వారి చావుకి చంద్రబాబే కారణం- మంత్రి కాకాణి ఆగ్రహం
ఇవి శవ రాజకీయాలు కావని, శవాలను చేసిన రాజకీయాలని మండిపడ్డారు మంత్రి కాకాణి. కందుకూరు ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాలనుంచి కూడా జనాల్ని రప్పించారని, తొక్కిసలాటకు వారే కారణం అయ్యారని అన్నారు కాకాణి.
చంద్రబాబు ఆశ, అధికార దాహం కోసం కందుకూరులో 8మంది బలయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కాకాణి. లేనిది ఉన్నట్టు సృష్టించడానిక చంద్రబాబు ప్రయత్నించారని, అందుకే ఎన్టీఆర్ సర్కిల్ లో రోడ్ షో ఏర్పాటు చేశారని చెప్పారు. జనం ఎక్కువమంది కెమెరాకు కనపడాలని ఆయన వాహనాన్ని ముందుకు తెచ్చారు. 20 అడుగుల వెడల్పు ఉండే రోడ్ లో చంద్రబాబు వాహనం వచ్చింది. అక్కడ గ్రూపు రాజకీయాలున్నాయి. పోటా పోటీగా ఫ్లెక్సీలు కట్టారు. జనం అటు, ఇటు వెళ్లిపోకుండా ఫ్లెక్సీల మధ్య నిలబడితే, డ్రోన్ కెమెరాలతో చూపించాలనుకున్నారు. ఆ పొరపాట్ల వల్లే 8మంది చనిపోయారన్నారు కాకాణి. పాపం కూలీ డబ్బులిస్తారని వచ్చి ప్రాణాలు కోల్పోయారని అన్నారు.
ఇవి శవరాజకీయాలు కావని, శవాలను చేసిన రాజకీయాలని మండిపడ్డారు కాకాణి. కందుకూరు ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాలనుంచి కూడా జనాల్ని రప్పించారని, తొక్కిసలాటకు వారే కారణం అయ్యారని అన్నారు కాకాణి. ఫొటో షూట్ కోసం చంద్రబాబు వాహనాన్ని పదే పదే ముందుకు వెనక్కు జరిపారని అన్నారు.
గోదావరి పుష్కరాల్లో ఇదే జరిగింది. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. అప్పుడాయన పుష్కర స్నానం చేసే వరకు ఎవరినీ స్నానానికి పోనివ్వలేదని, అందుకే తోపులాట జరిగిందని అన్నారు కాకాణి. ఇప్పుడు కూడా అదే రిపీట్ అయిందని, ఎనిమిదిమందిని చంద్రబాబు పొట్టినపెట్టుకున్నారని అన్నారు.
ఆ కుటుంబాల ఘోష చంద్రబాబుకి తగులుతుంది..
ఆ 8మంది కుటుంబాల ఘోష చంద్రబాబుకి తప్పకుండా తగులుతుందని శాపనార్థాలు పెట్టారు కాకాణి. అసలు చంద్రబాబు సభలకు ప్రజలు ఎందుకొస్తారని అన్నారు కాకాణి. ఉద్యోగాలిచ్చారని యువత వస్తారా, రుణమాఫీ చేశారని రైతులు వస్తారా, మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించారా అని నిలదీశారు. అసలు ఆయన రాష్ట్రానికి ఏం చేశారన ప్రశ్నించారు.
సభలకు జనం ఎందుకొస్తారనే ఆత్మ పరిశీలన చేసుకోకుండా వేలాదిమంది వస్తున్నారని చూపించుకోడానికి ఆయన తపిస్తున్నారని అన్నారు. ఎక్కడ మీటింగ్ పెడితే, ఎక్కడ ఫొటో బాగొస్తుందనేది వారి టీమ్ ముందుగానే చెబుతారని, రైట్ తిరగండి, లెఫ్ట్ తిరగండి అంటూ ఫొటోలు తీసేవాళ్లు చెప్పినట్టే చంద్రబాబు చేస్తుంటారని, ఫొటోలు తీసేవారి డైరక్షన్లో చంద్రబాబు నడుస్తుంటారని, ఆ హడావిడి అంతా పచ్చ మీడియాలో చూపించుకునే తాపత్రయం చంద్రబాబుదని అన్నారు.
ఇదేం ఖర్మ..
చంద్రబాబు కందుకూరు రావడం వల్ల ఇదేం ఖర్మ అని అక్కడి ప్రజలు అనుకుంటున్నారని, చంద్రబాబు పుట్టడమే ఈ రాష్ట్రానికి ఖర్మ అని మండిపడ్డారు కాకాణి. ఆయన పుట్టడమే రాష్ట్ర ప్రజలు చేసుకున్న ఖర్మ అని అన్నారు. ఆయన ఖర్మకి ఎంతమంది బలయ్యారు, ఎన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయో ఆలోచించాలన్నారు.
వైసీపీ కూడా కందుకూరులో సభ పెట్టారని, తానే ఆ సభ ఏర్పాట్లు చూశానని, సువిశాల ప్రాంతంలో సభ పెడితే జనం విరగబడి వచ్చారని, చంద్రబాబు లాగా పరదా చాటున, ఎవరికీ కనిపించకుండా బస్సుల్లో కూర్చుని రాలేదని ఎద్దేవా చేశారు. జనంలో తిరిగుతూనే జగన్ సభ పెడితే జనం బాగా వచ్చారని, ఎక్కడా అపశృతి చోటు చేసుకోలేదన్నారు కాకాణి. కానీ ఈనాడు పొటో షూట్ కోసం చంద్రబాబు చేసిన ప్రయత్నం వల్లే 8మంది చనిపోయారన్నారు.
పోలీసుల వైఫల్యం లేదు..
పోలీసులు సభల దగ్గరకు వస్తే, టీడీపీ వాళ్లు దుర్భాషలాడారని, కానీ ఇప్పుడు పోలీసు సిబ్బంది లోపం ఉందని టీడీపీ అనుకూల మీడియాలో రావడం దురదృష్టకరం అని చెప్పారు కాకాణి. ఈ ఘటనకు కారణమైన చంద్రబాబుపై కేసు పెట్టాలని, ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు కాకాణి.