CM Jagan: సీఎం జగన్ ముందుకు నెల్లూరు పొలిటికల్ పంచాయితీ!
నెల్లూరు జిల్లాలో ఇంత జరుగుతుంటే ఆ విషయం జగన్ దృష్టికి వెళ్లకుండా ఉంటుందని అనుకోలేం. అయితే ఆయన స్థానిక విభేదాల విషయంలో అనిల్, రూప్ మధ్య సయోధ్య కుదురుస్తారో లేదో తేలాల్సి ఉంది.
నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన ఖరారైంది. ఈనెల 6న నెల్లూరు జిల్లాలోని రెండు ప్రధాన బ్యారేజ్ లను జగన్ ప్రారంభిస్తారు. కడప జిల్లానుంచి హెలికాప్టర్ లో నెల్లూరు జిల్లాకు ఈనెల 6 ఉదయం వస్తారు. నెల్లూరు జిల్లా సంగం వద్ద ఉన్న మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ ని ఆయన ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత హెలికాప్టర్లో నెల్లూరు నగరానికి వస్తారు. నెల్లూరు నగర పరిధిలోని పెన్నా బ్యారేజ్ ని కూడా సీఎం జగన్ ప్రారంభిస్తారు. ఆతర్వాత ఆయన తిరుగు ప్రయాణం అవుతారు.
జిల్లా రాజకీయాలపై చర్చ ఉంటుందా..?
ఇటీవల సీఎం జగన్ జిల్లాల పర్యటనల సందర్భంగా ఆయా ప్రాంతాల్లో స్థానిక రాజకీయాలు హైలెట్ అవుతున్నాయి. ఇటీవల ప్రకాశం జిల్లా చీమకుర్తి పర్యటనకు వచ్చిన ఆయన, స్థానిక ఎమ్మెల్యేకి షాకిచ్చారు. ఎమ్మెల్యేకి వ్యతిరేక వర్గంగా ఉన్న బూచేపల్లి వర్గంతోనే ఆయన అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కి సీఎం పర్యటనతో ఓ క్లారిటీ వచ్చినట్టయింది. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో కూడా అలాంటి సీన్ రిపీటవుతుందా, ఇక్కడ పొలిటికల్ గ్రూపు రాజకీయాలపై జగన్ దృష్టిపెడతారా.. వర్గ రాజకీయాలను పక్కనపెట్టి కలసిపోవాలని నాయకులకు చెబుతారా లేదా అనేది తేలాల్సి ఉంది.
నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం నాయకుల మధ్య అంతర్గత పోరు నివురుగప్పిన నిప్పులా ఉంది. నిన్న మొన్నటి వరకు మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మధ్య ఆధిపత్య పోరు నడిచింది. అప్పట్లో తాడేపల్లి పంచాయితీ తర్వాత ఆ గొడవ సద్దుమణిగింది. తాజాగా నెల్లూరు సిటీలోనే వైసీపీలోనే ఆధిపత్య పోరు నడుస్తోంది. సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కి, ఆయన బాబాయి రూప్ కుమార్ యాదవ్ కి మధ్య మాటల్లేవు. అనిల్ కుమార్ ఆఫీస్ రాజన్న భవన్ కి పోటీగా.. రూప్ కుమార్ ఇటీవల జగనన్న భవన్ కి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత కొన్నిరోజులకు రూప్ కుమార్ వర్గీయులను పోలీసులు స్టేషన్ కి తరలించడం, రూప్ కుమార్ వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి వారిని విడిపించుకు రావడం చకచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో రూప్ కుమార్ పరోక్షంగా తన ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. పార్టీకోసం పనిచేయండి, రెండోసారి జగన్ ని ఎలా అధికారంలోకి తేవాలనే విషయంపై దృష్టిపెట్టండని హితవు పలికారు.
ఈ సవాళ్లు, ప్రతి సవాళ్ల నేపథ్యంలో నెల్లూరు సిటీలో వ్యవహారం హాట్ హాట్ గా ఉంది. నగర నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్లు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు అనిల్ వర్గం, మరికొందరు నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ వర్గంలో ఉన్నారు. రేపు వీరంతా సీఎం జగన్ పర్యటనలో పాల్గానాల్సిన సందర్భం. నెల్లూరు నగర పరిధిలో ఉన్న బ్యారేజ్ ని సీఎం ప్రారంభించడానికి వస్తుండటంతో.. సిటీ నాయకులంతా అక్కడ హాజరవుతారు. బలప్రదర్శనకు దిగే అవకాశం కూడా ఉంది.
జగన్ దృష్టికి వెళ్లినట్టేనా..?
నెల్లూరు జిల్లాలో ఇంత జరుగుతుంటే ఆ విషయం జగన్ దృష్టికి వెళ్లకుండా ఉంటుందని అనుకోలేం. అయితే ఆయన స్థానిక విభేదాల విషయంలో అనిల్, రూప్ మధ్య సయోధ్య కుదురుస్తారో లేదో తేలాల్సి ఉంది. గొడవలు ఇంకా ముదిరితే అది పార్టీకే నష్టం. అందుకే ముందుగానే జగన్ ఈ విషయంలో రాజీ కుదిర్చే అవకాశముందని అంటున్నారు. అందుకు నెల్లూరు జిల్లా పర్యటనను ఉపయోగించుకుంటారని తెలుస్తోంది. ఒక వేళ, జగన్ ఈ విషయాన్ని లైట్ తీసుకుంటే మాత్రం రెండు వర్గాలు ముందు ముందు మరింతగా రెచ్చిపోయే అవకాశముంది.