(Source: Poll of Polls)
Nara Lokesh: 'సీఎం అసమర్థ పాలనలో గాలిలో దీపంలా ప్రజారోగ్యం' - సిగ్గుతో తల దించుకోవాలన్న లోకేశ్
Nara Lokesh: సీఎం జగన్ పై నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్ విజయపురి సౌత్ కమ్యూనిటీ ఆస్పత్రి ప్రాంగణంలో చెట్ల కింద రోగుల అవస్థలు జగన్ చేతగాని పాలనకు నిదర్శనమని మండిపడ్డారు.
Nara Lokesh: సీఎం జగన్ అసమర్థ పాలనలో ప్రజారోగ్యం గాలిలో దీపంలా మారిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. నాలుగున్నరేళ్ల పాలన ప్రజలకు శాపంలా మారిందని ధ్వజమెత్తారు. తాజాగా, నాగార్జున సాగర్ సమీపంలోని విజయపురి సౌత్ కమ్యూనిటీ ఆస్పత్రి ప్రాంగణంలో చెట్ల కింద రోగుల దుస్థితిపై ఆయన స్పందించారు. ఇలాంటి పరిస్థితి జగన్ చేతగాని పాలనకు అద్దం పడుతోందన్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో గిరిజన తండాల ప్రజలకు ఏకైక దిక్కుగా ఉన్న ఈ ధర్మాస్పత్రిలో మూడేళ్లుగా చెట్ల కిందే వైద్య సేవలు అందిస్తున్నారంటే సీఎం సిగ్గుతో తలదించుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైద్య మంత్రి సొంత జిల్లాలోనే
రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి సొంత జిల్లాలోనే ఈ పరిస్థితి ఇలా ఉంటే, అల్లూరి జిల్లా వంటి మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలకు ఇక దేవుడే దిక్కని లోకేశ్ ఎద్దేవా చేశారు. 'కరోనా విజృంభణ సమయంలో ఆక్సిజన్ సరఫరా వైఫల్యం కారణంగా కళ్లెదుటే, వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం కళ్లారా చూశాం. జగన్ దివారా కోరు పాలనా పుణ్యమా అని కర్నూలు, అనంతపురం బోధనాస్పత్రుల్లో దూది సైతం అందుబాటులో లేని దుస్థితి నెలకొంది. రాష్ట్రంలో ఇంతటి దారుణ పరిస్థితులుంటే తమ హయాంలో వైద్య, ఆరోగ్య రంగం వెలిగిపోతుందని, జగనన్న సురక్ష పేరుతో ఇళ్ల వద్దకే వెళ్లి వైద్య సేవలు అందిస్తున్నామని సీఎం గొప్పగా చెబుతున్నారు.' ఇలాంటి వ్యక్తిని సైకో అని కాక మరేమనాలి? అంటూ లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, రాష్ట్రంలో నల్లమల అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న వెనుకబడిన గ్రామాల్లో ఏ ఒక్కరికి అనారోగ్య సమస్య వచ్చినా, నాగార్జున సాగర్ జలాశయం పక్కనే ఉన్న విజయపురి సౌత్ కమ్యూనిటీ ఆస్పత్రే దిక్కు. కానీ, ఇక్కడ గత మూడేళ్లుగా చెట్టు కిందే వైద్య సేవలు అందిస్తున్నారని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని సొంత జిల్లాలోనే ఈ పరిస్థితి నెలకొందని విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం ఉన్న భవనం సరిపోవడం లేదని, కొత్త భవనానికి 2021, జనవరిలో శంకుస్థాపన చేసి రూ.5.32 కోట్లతో ఆస్పత్రి నిర్మాణం ప్రారంభించారు. అయితే, మూడేళ్ల నుంచి నిర్మాణం జరుగుతున్నా ఇంకా 40 శాతం పనులు పెండింగ్ లోనే ఉన్నాయి. ప్రస్తుతం సాగర్ డ్యాం క్వార్టర్స్ లో ఆస్పత్రి నడుస్తోంది. వైద్య సిబ్బంది 10 పడకలు ఆరుబయటే వేసి రోగులకు వైద్యం అందిస్తున్నారు. ఈ దృశ్యాలు వైరల్ కాగా, టీడీపీ విమర్శిస్తోంది.
కేబినెట్ భేటీపైనా
రాష్ట్రంలో కరువు పరిస్థితిపై చర్చించని మంత్రి వర్గ సమావేశం ఎందుకని లోకేశ్ మండిపడ్డారు. 400 మండలాల్లో కరువు పరిస్థితి ఉంటే కేవలం 100 మండలాల్లోనే కరవు ఉందని ప్రభుత్వం ప్రకటించడం దారుణమన్నారు. వర్షాభావ పరిస్థితులపై భేటీలో సమీక్షించకపోవడం సీఎం జగన్, మంత్రుల బాధ్యతా రాహిత్యానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. 'వందేళ్లలో ఈ ఏడాదే తక్కువ వర్షపాతం అని గణాంకాలు చెబుతున్నాయి. కర్నూలు జిల్లాలో కరువు కారణంగా ఊళ్లు ఖాళీ అవుతున్నాయి. తప్పుడు కేసుల్లో ప్రతిపక్ష నేతలను ఇరికించడంపై ఉన్న శ్రద్ధ అన్నదాతలపై లేదు. కరువు నివారణ చర్యలపై శ్రద్ధ లేదు. యుద్ధ ప్రాతిపదికన రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా.' అని లోకేశ్ పేర్కొన్నారు.
Also Read: ఎంపీ విజయసాయి రెడ్డిపై సీజేఐకు పురంధేశ్వరి ఫిర్యాదు - బెయిల్ షరతులు ఉల్లంఘించారని లేఖ