Andhra Pradesh Assembly: విద్యారంగంలో సమూల మార్పులు - టీచర్ల బదిలీలకు చట్టం - విద్యా మంత్రి లోకేష్ కీలక నిర్ణయాలు
AP Assembly : విద్యారంగంలో సమూల మార్పులు తెస్తామని నారా లోకేష్ అసెంబ్లీలో ప్రకటించారు. ఉపాధ్యాయుల బదిలీలకు కొొత్త చట్టం తీసుకు వచ్చారు.

Nara lokesh: అమరావతిః వైసీపీ అనాలోచిత నిర్ణయాలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు దారుణంగా పడిపోయాయని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అసర్ నివేదిక, 2018లో పాఠశాలల్లో సదుపాయాలు, విద్యా ప్రమాణాలు మెరుగ్గా ఉండి, 2022-24 మధ్యకాలంలో పతనం కావడంపై శాసనమండలిలో సభ్యులు దువ్వారపు రామారావు, పి.అశోక్ బాబు, బి.తిరుమలనాయుడు అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానం ఇచ్చారు.
పిల్లలు పుస్తకాలు చదివేందుకు ఇబ్బందిపడ్డారు !
2014-24 మధ్య పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను బేరీజు వేస్తే .. వైసీపీ పాలనలో ఐదో తరగతి విద్యార్థులు రెండో తరగతి తెలుగు పుస్తకం చదివేందుకు ఇబ్బందిపడ్డారు. 2014లో 57శాతం మంది విద్యార్థులు చదవగలిగితే, జగన్ రెడ్డి పాలనలో 37.5 శాతానికి పడిపోయిందని అసర్ నివేదిక స్పష్టం చేసిందని నారా లోకేష్ తెలిపారు. 8వ తరగతి విద్యార్థులు రెండో తరగతి తెలుగు పుస్తకాన్ని 2014లో సుమారు 80శాతం మంది చదవగలిగితే.. 2024కు వచ్చేనాటికి 53శాతానికి పడిపోయింది. మూడో తరగతి విద్యార్థుల్లో 85శాతం మంది విద్యార్థులు కనీసం రెండో తరగతి టెక్ట్స్ బుక్ చదవలేకపోతున్నారని.. ఐదో తరగతి విద్యార్థుల్లో 63 శాతం విద్యార్థులు బేసిక్ గ్రేడింగ్ చేయలేకపోతున్నారని లోకేష్ తెలిపారు. 8వ తరగతి విద్యార్థులను పరిశీలిస్తే.. కనీసం 50శాతం మంది విద్యార్థులు ఫ్లూయెంట్ గా మాట్లాడలేకపోతున్నారు. 3వ తరగతి పిల్లలను చూస్తే 60శాతం మంది బేసిక్ సబ్ ట్రాక్షన్ చేయలేకపోతున్నారు. 8వ తరగతి పిల్లలను చూస్తే 55శాతం మంది బేసిక్ డివిజన్ కూడా చేయలేకపోతున్నారు. 90శాతం మంది మూడో తరగతి విద్యార్థులకు బేసిక్ ఫౌండేషన్ న్యూమరసీ స్కిల్స్ కూడా లేవని అసర్ నివేదిక తేటతెల్లం చేసిందన్నారు.
పాఠశాల విద్య, ఇంటర్ లో 12 లక్షల మంది విద్యార్థులు తగ్గారు
వైసీపీ హయాంలో ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్ కలిపి సుమారు 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. ఇప్పుడు ఆ సంఖ్య 33.4 లక్షలుగా ఉంది. వైసీపీ పాలనలో అనాలోచిత నిర్ణయాలు, చర్చ లేకుండా సంస్కరణలు తీసుకువచ్చి విద్యార్థులు, ఉపాధ్యాయులపై, తల్లిదండ్రులపై రుద్దారు. 117 జీవోలో స్థానిక అంశాలను పరిగణనలోకి తీసుకోకపోవడంతో విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో చేరారు. కూటమి ప్రభుత్వ హయాంలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు 10,15 సంస్కరణలు తీసుకువస్తున్నాం. బోధనలో సాంకేతికతను జోడిస్తాం. ఉపాధ్యాయులు కూడా పాఠాలు బోధించిన తర్వాత 60సెకన్ల వీడియో ప్రదర్శించి ఆ పాఠాన్ని సమ్మప్ చేసి, క్లిక్కర్ టెక్నాలజీ ద్వారా పిల్లలను అసెస్ చేస్తాం. అక్కడి నుంచి ప్రిస్కిప్టివ్ హోంవర్క్ ఇస్తాం. మెగా టీచర్-పేరెంట్ మీటింగ్ ఇప్పటికే నిర్వహించాం. వచ్చే విద్యా సంవత్సరంలో రెండు సార్లు నిర్వహిస్తాం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పిల్లల మధ్య ఇంటరాక్షన్ కోసం అద్భుతమైన ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డును కూడా రూపొందించడం జరిగిందన్నారు.
వైసీపీ హయాంలోని డేటా ఎందుకు లేదు ?
వైసీపీ హయాంలో వైసీపీ హయాంలో ఎంతమంది విద్యార్థులు ఏ స్కూల్ లో చదువుతున్నారో డేటా లేదని, విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన బొత్స.. డేటా ఎందుకు లేదో సమాధానం చెప్పాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్ విద్యలో 12 లక్షల మంది విద్యార్థులు తగ్గారనే వ్యాఖ్యలకు నేను కట్టుబడి ఉన్నా. బొత్స మంత్రిగా ఉన్నప్పుడు పాఠశాల విద్యలో ఎంతమంది విద్యార్థులు చదివారో లెక్కలు చెప్పాలని సవాల్ చేశారు. దీ 2017లో ఇంగ్లీష్ లో భారతదేశంలో నాలుగో స్థానంలో ఉన్నాం. వైసీపీ హయాంలో 14 స్థానానికి ఎందుకు పడిపోయామో సమాధానం చెప్పాలన్నారు.
ఏ పాఠశాలలో ఐబీ సిలబస్ అమలుచేశారో సమాధానం చెప్పాలి
ఐబీ విషయానికి వస్తే కేవలం ఒక కన్సల్టింగ్ రిపోర్ట్ కోసం రూ.4.86 కోట్లు ఖర్చు పెట్టారు. ఐబీ కరిక్యులమ్ అమలు చేశామని ఎలా చెబుతారు? ఏ పాఠశాలలో అమలు చేశారు ఐబీ? సమాధానం చెప్పాలి. సీబీఎస్ఈ విషయంలో విద్యార్థులను సన్నద్ధం చేయలేదు. మాక్ టెస్ట్ నిర్వహిస్తే కనీసం ఒక సబ్జెక్ట్ లో 90శాతం మంది ఫెయిల్ అయ్యారు. ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వకుండా, పిల్లలను సన్నద్ధం చేయకుండా సీబీఎస్ఈ తీసుకువచ్చారని ఆరోపించారు. నూటికి నూరు శాతం ఉపాధ్యాయులు పాఠాలే చెప్పాలనే విధానానికి కట్టుబడి ఉన్నామని లోకేష్ తెలిపారు.సింగిల్ టీచర్స్ స్కూల్స్ విషయానికి వస్తే 12,512 పాఠశాలల్లో సింగిల్ టీచర్ ఉన్నారు. ఇది వాస్తవం. 30శాతం పాఠశాలల్లో సింగిల్ టీచర్ ఉన్నారు. అందుకే మోడల్ ప్రైమరీ స్కూళ్ల కింద కనీసం 7,8 వేల ప్రైమరీ స్కూల్స్ వస్తే ఒక తరగతికి ఒక ఉపాధ్యాయుడిని అందించే అవకాశం ఏర్పడుతుందన్ననారు.
ఉపాధ్యాయుల బదిలీలకు అసెంబ్లీలో చట్టం
ఏపీ రాష్ట్ర ఉపాధ్యాయ బదిలీల క్రమబద్ధీకరణ బిల్లు-2025 ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్-1982లో లీగల్ అథారిటీ ఆనాడు కల్పించడం జరిగిందన్నారు. ఎన్నికల సమయంలో కూడా 1100 మంది ఉపాధ్యాయులను ఏకపక్షంగా ట్రాన్స్ ఫర్ చేశారు. కోర్టు జోక్యం చేసుకుని రద్దు చేయడం జరిగింది. కావాలని కొంతమందిపై రాజకీయ కక్షతో బదిలీలను నిలిపివేశారు. గడచిన ఐదేళ్లలో అనేక లిటిగేషన్స్ వచ్చాయి. అనేకసార్లు కోర్టులు కూడా జోక్యం చేసుకున్నాయి. ఒక యాక్ట్ తీసుకువచ్చి పారదర్శకంగా ఉపాధ్యాయ బదిలీలను చేపట్టాలనే లక్ష్యంతో పనిచేశాం. రాజకీయ జోక్యాన్ని నివారించాల్సిన అవసరం ఉంది. బోధనపైనే ఉపాధ్యాయులు దృష్టిపెట్టాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఈ ఆన్ లైన్ ద్వారా ట్రాన్సపరెన్సీ, అకౌంటబులటీ కూడా తీసుకువస్తాం. గ్రీవెన్స్ రిడ్రెసెల్ మెకానిజం కూడా ఈ బిల్లులో పొందుపర్చడం జరిగింది. గైడ్ లైన్స్ ఎఫెక్టివ్ గా రూపొందించాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. ప్రమోషన్స్ చాలా పారదర్శకంగా చేస్తాం. ఉపాధ్యాయుల నుంచి కూడా అభిప్రాయసేకరణ చేశాం. 7,735 సలహాలు వచ్చాయి. కర్ణాటక, ఉత్తరాఖండ్, అస్సాంలో ఈ టీచర్ ట్రాన్స్ ఫర్ యాక్ట్ అమల్లో ఉందని నారా లోకేష్ తెలిపారు. ఈ ఏడాది జూన్ నాటికి సంస్కరణలు పూర్తిచేసి ఎగ్జిక్యూట్ చేస్తామన్నారు. ఉపాధ్యాయుల సీనియారిటీ లిస్ట్ పారదర్శకంగా రూపొందిస్తున్నామన్నారు.
ప్రైవేటు యూనివర్శిటీలకు ప్రోత్సాహం
ప్రైవేటు విశ్వవిద్యాలయాలను ప్రోత్సహిస్తామ నారా లోకేష్ తెలిపారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన, క్రమబద్ధీకరణ రెండో సవరణ బిల్లు-2025ను మంత్రి నారా లోకేష్ శానససభలో ప్రవేశపెట్టారు. .కేంద్ర, రాష్ట్ర నిబంధనల ప్రకారం వీవీఐటీ ప్రైవేటు యూనివర్సిటీ గా గుర్తించాలని కోరడం జరిగింది. వారికి 50 ఎకరాల భూమి ఉంది. 4,75,278 చ.అడుగుల బిల్టప్ ఏరియా ఉంది. సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, ఇంక్యుబేటర్ సెంటర్స్ ఉన్నాయి. 11 యూజీ, పీజీ కోర్సులు ఉన్నాయి. సుమారు 700 మంది సిబ్బంది ఉన్నారు. 9,200 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ సొసైటీ పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉంది. యూనివర్సిటీ ఎప్పుడు వచ్చినా చట్టసభల్లో యాక్ట్ కింద సవరణ చేసి యూనివర్సిటీ పేరును ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు.





















