Mudragada : స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం కూడా వెనక్కి తీసుకోండి... ప్రధానికి ముద్రగడ లేఖ !
మూడు సాగు చట్టాల్లాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ముద్రగడ పద్మనాభం ప్రధాని మోడీకి లేఖ రాశారు.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాశారు. ఢిల్లీలో రైతులు చేసిన ఆందోళన, వారి బాధలు చూసి రైతులు మెడకు చుట్టుకునే 3 బిల్లులు పార్లమెంటులో ఉపసంహరించడంపై సంతోషం వ్యక్తం చేశారు. అదే కోవలో ఎందరో ప్రాణత్యాగాలు , మరెందరో నాయకుల పదవుల త్యాగంతో పాటు ప్రజలు పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కూడా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కష్టపడి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయాలనే ఆలోచనతో ఈ ప్రాంత ప్రజలు బాధపడుతున్నారని ముద్రగడ లేఖలో ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.
Also Read : పయ్యావులపై అనంతపురం అధికారులు ఫైర్.. కారణం ఏంటో తెలుసా?
మీ పాలనలో మరెన్నో ఫ్యాక్టరీలు రావాలని ప్రజలు కోరుకుంటున్న ఈ సమయంలో ప్రైవేటు పరం అనే పిడుగు లాంటి వార్తను ప్రజలు అంచనా వేయలేదని.. ఎందరో ప్రాణత్యాగ ఫలితంగా సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి , దేశంలో పలు చోట్ల స్థాపించిన పరిశ్రమలకు లింకు పెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రత్యేకంగా చూడటంతో పాటు దీన్ని ఏవిధంగా సాధించుకున్నారో పూర్తిగా దృష్టిపెట్టాలిగాని అన్నింటితో పాటు జత చేసి ప్రైవేటు పరం చేయవద్దని కోరారు. మా ప్రాంత ప్రజల కోరికను తప్పనిసరిగా గౌరవించాలని విజ్ఞప్తి చేశారు.
Also Read : దయచేసి నెల్లూరు వైపు రావొద్దు.. వచ్చి ఇబ్బందులు పడొద్దు.. అధికారుల సూచనలు
రైతులు తాలూకు 3 బిల్లులు ఉపసంహరించడానికి తీసుకున్న నిర్ణయం లాంటిదే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటు పరం చేయాలనే అలోచన విరమించుకోవాలని ప్రధానమంత్రిని ముద్రగడ తన లేఖలో కోరారు. భవిష్యత్తులో ఈ ప్రాంత ప్రజల సహకారం కావలసి ఉంటుంది కాబట్టి , ఉప సంహరణ కోసం ప్రత్యేకమైన దృష్టి పెట్టి మా ప్రాంత ప్రజలను సంతోషపెట్టాలన్నారు.
Also Read: CM Meet Central Team : విపత్తు నిర్వహణలో బాగా పని చేశారు.. సీఎం జగన్‌కు కేంద్ర బృందం అభినందన !
ముద్రగడ పద్మనాభం ఇటీవల వరుసగా లేఖలు రాస్తున్నారు. తాను కాపు రిజర్వేషన్ ఉద్యమ పోరాటం నుంచి వైదొలిగానని గతంలో ప్రకటించారు. ఈ కారణంగా ఆ అంశంపై తప్ప.. అన్ని అంశాలపై లేఖలు రాస్తున్నారు. ఇటీవల చంద్రబాబుకు కూడా లేఖ రాశారు. ఇప్పుడు ప్రధానమంత్రికి లేఖ రాశారు. అయితే ప్రధానమంత్రికి కూడా తెలుగులో రాశారు. మీడియాకు విడుదల చేశారు. ఇది బహిరంగలేఖనా లేకపోతే .. పీఎంఓకు పంపుతారా అన్నదానిపై క్లారిటీ లేదు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి