Payyavula Keshav: పయ్యావులపై అనంతపురం అధికారులు ఫైర్.. కారణం ఏంటో తెలుసా?
తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన అనంతపురం జిల్లా రైతులకు మద్దతుగా అనంతపురం ఎంఎల్ఏలు రంగంలోకి దిగారు.ప్రతిపక్షపార్టీ ఎంఎల్ఏ పయ్యావుల కేశవ్ లేవనెత్తిన అంశంపై అధికార పార్టీ ఎంఎల్ఏలు కూడా మద్దతు పలికారు.
పయ్యావుల కేశవ్.. ఈ పేరు వింటేనే మండిపోతున్నారు అనంతపురం జిల్లా వ్యవసాయశాఖాదికారులు. ఎందుకంటే వారి తప్పొప్పులను వెతికి మరీ జిల్లాఅభివృద్ది కమిటీ మీటింగ్లో ప్రజాప్రతినిధులు తీవ్రంగా విరుచుకుపడేలా చేశారు పయ్యావులు. ప్రతిపక్ష పార్టీ ఎంఎల్ఏ అయినప్పటికీ ఆయన లేవనెత్తిన అంశంపై జిల్లాలోని అధికారపార్టీ ఎంఎల్ఏలు కూడా ఒక్కతాటిపైకి వచ్చి వ్యవసాయాశాఖాదికారుల తప్పిదాన్ని గట్టిగానే ప్రశ్నించారు. చివరకు ఇంచార్జ్ మంత్రి బొత్స కూడా వ్యవసాయశాఖ కమీషనర్తో మాట్లాడి పరిస్థితులపై వెంటనే రంగంలోకి దిగేలా ఆదేశాలిచ్చారు మంత్రి బొత్స. ఏదో తప్పుడు లెక్కలు చెప్పి తప్పించుకొందామంటే ఎంఎల్ఏ పయ్యావుల లేవనెత్తిన అంశాలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు అనంతపురం జిల్లా వ్యవసాయశాఖాదికారులు.
వివరాల్లోకి వెళితే ఇప్పటికే ఖరీప్ సీజన్లోనే వేరుశనగతో పూర్తిగా దెబ్బతిని వుంది అనంత రైతాంగం. ఇక రబీ సీజన్లో సాగయ్యే పప్పుశనగ, మిరప, ఇతర పంటలు సాగు చేసిన రైతులు కూడా మొన్నవచ్చిన తుపాన్లు, వరుసగా కురుస్తున్న వర్షాలతో ఒక్క ఎకరాలో పంట పండింది లేదు. మొత్తం జిల్లాలో పంట నాశనం అయ్యి రైతులు తీవ్రఇబ్బందులు పాలయ్యారు. వీటన్నిటిని సమీక్షించి క్షేత్రస్థాయిలో ఈక్రాప్ బుకింగ్ చేయాల్సిన వ్యవసాయ శాఖాదికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అనుకొన్న స్థాయిలో ఈ క్రాప్ బుకింగ్ జరగడం లేదు. డిసెంబర్ 15 తేదీ లోపు ఫసల్ బీమాలో అప్లోడ్ చేయకపోతే బీమా మొత్తం కూడా రైతులకు వచ్చే పరిస్థితి లేదు. ఓ వైపు పంటలు మొత్తం పోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే వ్యవసాయశాఖాదికారులు మాత్రం తప్పుడు లెక్కలతో మీటింగ్లో వివరించే ప్రయత్నం చేశారు.
కానీ వాస్తవాన్ని పయ్యావుల బయటకు తీయడంతో అధికార పార్టీ ఎంఎల్ఏలు కూడా పయ్యావులకు వంతపాడారు. అందరూ కలిసి వ్యవసాయశాఖధికారుల నిర్లక్ష్యాన్ని తూర్పారపట్టారు. ఈ క్రాప్ బుకింగ్లో అసలు ఎడిట్ ఆప్షన్ లేదని, దీనివలన నష్టపోయిన వివరాలు సమగ్రంగా అప్లోడ్ చేయలేకపోతున్నామన్న విషయాన్ని వ్యవసాయాశాకాధికారులు మీటింగ్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో మంత్రి బొత్స వ్యవసాయశాఖ కమీషనర్తో మాట్లాడి పది రోజుల్లోపు సమగ్రంగా ఈక్రాప్ బుకింగ్ చేయాలని ఆదేశాలిచ్చారు. ఈ వ్యవహరంతో అనంతపురం జిల్లా వ్యవసాయశాకాధికారుల అలసత్వ వైఖరిపై ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్ష జరిగినట్లు తెలుస్తోంది.
ఫలితంగానే ముఖ్యమంత్రి ఇకనుంచి ఏ సీజన్లో పంట నష్టపోతే అదే సీజన్లో పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చినట్లుగా తెలుస్తోంది.దీంతో అనంతపురం అదికారులపై కమీషనర్ గుర్రుగా వున్నట్లు తెలుస్తోంది. ఏదో కప్పిపుచ్చుదాంలే అనుకొన్న అనంతపురం వ్యవసాయశాఖాధికారులకు పయ్యావుల కేశవ్ లేవనెత్తిన అంశాలతో తీవ్రంగా తలంటుకోవాల్సి వచ్చింది. అందుకే పయ్యావుల కేశవ్ పై వారికి కోపంగా వున్నట్లు జిల్లా అదికార వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి. ఇక నుంచైనా వేగంగా వచ్చే 10 రోజుల్లోపు ఈ క్రాప్ బుకింగ్ వేగంగా చేసి పసల్ బీమాలో రైతులకు లబ్ది చేకూరేలా వ్యవసాయశాఖాదికారులు పరుగులు తీస్తారా....లేకపోతే ఎప్పట్లానే కాకమ్మకథలు చెప్తూ నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తారా అన్నది చూడాలి మరి. జిల్లాలో తీవ్రంగా నష్టపోయిన రైతులకు మద్దతుగా కీలకంగా పనిచేయాల్సిన వ్యవసాయశాకాదికారుల నిర్లక్ష్య వైకరిపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవతున్నాయి.
Also Read: Tirumala: శ్రీవారి సర్వ దర్శనం టిక్కెట్లు విడుదల.. రోజుకు పది వేల చొప్పున కేటాయించిన టీటీడీ