Mohan babu : షిర్డీ కన్నా తమ ఆలయమే గొప్పంటున్న మోహన్ బాబు - ఉద్దేశపూర్వకమా ? టంగ్ స్లిప్పా ?
షిరిడీకి వద్దు తాను నిర్మించిన ఆలయానికి రావాలని మోహన్ బాబు పిలుపునివ్వడం వివాదాస్పదం అవుతోంది. తాను నిర్మించిన ఆలయమే గొప్పదని ఆయనంటున్నారు.
Mohan babu : సినీ నటుడు మంచుమోహన్ బాబు తిరుపతి సమీపంలో తమకు ఉన్న విద్యాలయాల దగ్గర షిరిడి సాయి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తాము నిర్మించిన ఆలయం షిరిడి కన్నా గొప్పదని చెప్పుకునే ప్రయత్నం చేయడం వివాదాస్పదమవుతోంది. ఇకపై ఎవరూ షిర్డీకి వెళ్ళాల్సిన అవసరంలేదని, రుషికేష్ సహా అనేక పవిత్ర స్థలాల నుంచి మూలికలు, చెక్కలు తీసుకొచ్చి ఆలయంలో పీఠం కింద ఉంచామని, ఇంత పవిత్రమైన ఈ ఆలయం నిర్మించడంతో ఇక సాయి నాధుని భక్తులు ఎవరూ షిరిడి ఆలయానికి వెళ్లనక్కర్లేదని వ్యాఖ్యానించారు. మోహన్ బాబు వ్యాఖ్యలపై సోషల్‌మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తిరుపతి సమీపంలో సాయిబాబా గుడి కట్టించిన మోహన్ బాబు
తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలం, రంగంపేటలోని మోహన్ బాబు విద్యా సంస్ధకు ప్రక్కనే ఇటీవల్ల మోహన్ బాబు సొంత నిధులతో సాయిబాబా ఆలయంను నిర్మించారు.. తానూ సాయిబాబా భక్తుడిగా చెప్పుకునే మోహన్ దగ్గరుండి ఆలయ నిర్మాణం చేపట్టారు.. విద్యా సంస్ధలోని విద్యార్దులు, చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు, శ్రీవారి దర్శనంకు విచ్చేసే భక్తులు ఆలయంను సందర్శించి సాయి బాబా ఆశీస్సులు పొందే విధంగా ఆలయ ప్రాంగణం అత్యంత అద్భుతంగా నిర్మించామని ఆయన ప్రకటించారు. అంతే కాకుండా ఆలయ చుట్టూ ప్రక్కల పచ్చని చెట్లతో ఆలయంను తీర్చి దిద్దామన్నారు. తమ ఆలయ గొప్పతనాన్ని చెప్పుకునే క్రమంలో షిరిడికి కూడా భక్తులు వెళ్లొద్దని.. తమ ఆలయానికే రావాలని చెప్పుకోవడం వివాదాస్పదమవుతోంది.
పుణ్యక్షేత్రంగా మార్చాలనుకుంటే ఇతర ఆలయాల్ని తక్కువ చేయాలా ?
మోహన్ బాబు తాను నిర్మించిన ఆలయాన్ని షిరిడి కన్నా గొప్ప పుణ్యక్షేత్రంగా మార్చాలనుకుంటున్నారు. అందుకే అలాంటి వ్యాఖ్యలు చేశారన్న వాదన వినిపిస్తోంది. అయితే సాయిబాబా ఆలయాన్ని అతిపెద్దగా నిర్మించినంత మాత్రాన షిరిడి లాంటి పవిత్ర స్థలాన్ని తక్కువ చేసి భక్తులందరూ.. తమ ఆలయానికే రావాలని పిలవడం ఏమిటన్న వాదన వినిపిస్తోంది. నిజమైన భక్తులు ఎవరూ అలా భావించరని అంటున్నారు. షిరిడి సాయినాథునిపై భక్తితో ఆలయాన్ని నిర్మించడం మంచిదే కానీ ఇలా.. . తమ ఆలయమే గొప్ప అని.. ఇతర సాయినాధుని ఆలయాలకు వెళ్లవద్దని చెప్పడం భక్తులు చేసే పని కాదని అంటున్నారు.
తన వ్యాఖ్యల వివాదంపై ఇంకా స్పందించని మోహన్ బాబు
తన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో వివాదం రేగుతున్న మంచు మోహన్ బాబు ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం ఆలయ ప్రారంభోత్సం సందర్భంగా యాగాలు చేస్తున్నారు. ఈ ఆలయం ప్రారంభోత్సవానికి చాలా మంది ప్రముఖుల్ని ఆహ్వానించారు. చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి సలహా పలువుర్ని ఆహ్వానించారు. అయితే పెద్దగా ప్రముఖులెవరూ రాకుండానే ఆలయ ప్రారంభోత్సవం నిర్వహించేస్తున్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తమ ఆలయానికి వస్తే బాగా పాపులర్ అవుతుందని మోహన్ బాబు భావిస్తున్నారు. బాబా భక్తుల ఆగ్రహంపై మోహన్ బాబు స్పందించాల్సి ఉంది.