Manda Krishna : మాజీ సీజేఐ ఎన్వీరమణకు మంద కృష్ణ కృతజ్ఞతలు - కారణం ఏమిటంటే ?
MRPS : మాజీ సీజేఐ ఎన్వీ రమణకు ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్వీ రమణ సీజేఐగా ఉన్నప్పుడు వర్గీకరణ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి సిఫారసు చేసారు.
MMRPS leader Mandakrishna thanked former CJI NV Ramana : సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణతో ఎమ్మార్పీఎస్ బృందం సమావేశం అయింది. మంద కృష్ణ నేతృత్వంలో బృందం ఎన్వీ రమణ నివాసంలో ఆయనను కలిశారు. సుదీర్ఘ కాలం కోర్టుల్లో ఉన్న ఎస్సీ వర్గీకరణ అంశాన్ని జస్టిస్ ఎన్వీ రమణ సీజేఐగా ఉన్న సమయంలోనే ఎస్సీ వర్గీకరణ పిటిషన్లను విస్తృత ధర్మాసనానికి సిఫారసు చేశారు. అందుకే ఆయనకు మందకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంద కృష్ణ బృందాన్ని మాజీ చీఫ్ జస్టిస్ అభినందించారు. ఎస్సీ వర్గీకరణ కోసం మూడు దశాబ్దాలుగా మందకృష్ణ పోరాడుతున్నారు.
పంజాబ్ పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం
నిజానికి సుప్రీంకోర్టు ధర్మాసనం ఏపీలో ఎస్సీ వర్గీకరణపై విచారణ చేయలేదు. పంజాబ్ ప్రభుత్వ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపారు. షెడ్యూల్డ్ కులాల జాబితాలోకి ఏదైనా సామాజిక వర్గాన్ని చేర్చాలన్నా, తొలగించాలన్నా పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంటుందని, రాష్ర్టాల శాసనసభలకు కాదని సుప్రీంకోర్టు 2004లో తీర్పు చెప్పింది. ఈ తీర్పు కారణంగా పంజాబ్‌లో దాదాపు 30ఏళ్లుగా ఉన్న ఎస్సీ వర్గీకరణకు ఇబ్బంది ఎదురయింది. 2006లోఎస్సీ కోటా రిజర్వేషన్లలో 50 శాతాన్ని వాల్మీకి, మజహబీ సిక్కు సామాజికవర్గాలకు తొలి ప్రాధాన్యంగా ఇస్తూ పంజాబ్ సర్కారు ఓ చట్టాన్ని తీసుకొచ్చింది.
వర్గీకరణ అధికారం రాష్ట్రాలకే ఇస్తూ నిర్ణయం
పంజాబ్ తెచ్చిన చట్టంపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు పంజాబ్ ప్రభుత్వం చేసిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చెల్లదంటూ తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పంజాబ్ ప్రభుత్వం అప్పట్లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అనంతరం దీనిపై మరో 22 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను మొదట అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారించింది. అయితే మరింత విస్తృతమైన ధర్మాసనం అవసరమని 2020లో ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేశారు. 2024 ఫిబ్రవరి 8న తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా వర్గీకరణ చేసుకొనేలా రాష్ట్రాలకే అనుమతినిస్తూ గురువారం కీలక తీర్పు వెలువరించింది.
సహకరించిన అందరికీ కృతజ్ఞతలు చెబుతున్న మంద కృష్ణ
ముఫ్పై ఏళ్ల కల ఫలించిందని మందకృష్ణ చెబుతున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు చేసిన ఎస్సీ వర్గీకరణపై ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అది ఏపీలో అమలు అవుతుందన్నారు. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతుందన్న నమ్మకం తమకు ఉందని తెలిపారు. నాటి సందర్భంలో సీఎంగా ఎస్సీ వర్గీకరణను చంద్రబాబు నాయుడు అమలు చేశారని గుర్తుచేసుకున్నారు. గతంలో సహకరించిన వారందికీ ఆయన ఇప్పుడు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.