Roja Review : తెలంగాణలో ఉన్న పురాతన శాసనాల్లోనూ ఏపీకి వాటా - తీసుకొస్తామన్న మంత్రి రోజా !
తెలంగాణలో ఉన్న పురాతన శాసనాల్లోనూ ఏపీకి వాటా ఉందని మంత్రి రోజా అన్నారు. వాటిని తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు.
Roja Review : ఉమ్మడి ఏపీ విడిపోయి ఎనిమిదేళ్లు అయిపోయింది. కానీ ఆస్తుల పంపకాలు ఇంకా పూర్తి కాలేదు. అందరూ ఉమ్మడి సంస్థలు, ఆస్తుల గురించి చెబుతున్నారు కానీ మరికొన్నింటిని మర్చిపోతున్నారు. వాటిని మంత్రి రోజా గుర్తు చేశారు. ఏపీ సచివాలయంలో టూరిజం, సాంస్కృతిక మరియు క్రీడా శాఖా అధికారులతో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖా మంత్రి ఆర్. కె. రోజా ,శాప్ ఛైర్మెన్ బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన వాటిపై ఆరా తీశారు.
పురాతన వస్తువుల పంపకం జరగలేదన్న మంత్రి రోజా
ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలు ఉమ్మడి చరిత్ర మరియు వారసత్వాన్ని పంచుకుంటున్నాయని కానీ రాష్ట్రాలు 2014లో విభజన తర్వాత పురాతన వస్తువులను మార్పిడి చేసుకోలేదని రోజా సమీక్షలో గుర్తించారు. వీటిలో పురాతన శాసనాలు ఉన్నాయని వాటిలో కొన్ని 200-300 BCE నాటివి ఉన్నాయని మంత్రి తెలిపారు. విభజన తర్వాత రెండు రాష్ట్రాల పురావస్తు శాఖలు విలువైన పురాతన వస్తువుల జాబితా ద్వారా.. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంకి చెందవల్సిన పురావస్తు సంపదను రాష్ట్రానికి తీసుకురావడానికి చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.
మ్యూజియంలను అభివృద్ధి చేయడానికి ప్రణాళిక
రాష్ట్రవ్యాప్తంగా వున్న మ్యూజియంలను అభివృద్ది చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, డిపిఆర్ తయారు చేసి కేంద్రప్రభుత్వానికి పంపాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. మ్యూజియంలన్ని టూరిజం అట్రాక్షన్ స్పాట్స్ గా తయారు చేయాలని, ఆధునీకరించాలని మంత్రి అదికారులకు ఆదేశించారు. పిపిపి ద్వారా మ్యూజియాల అభివృద్ది చేయాలనే ప్రతిపాదనలను ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ అధికారులతో మంత్రి చర్చించారు.
కేరళ తరహాలో టూరిజం ప్రణాళికలు
జగనన్న స్పోర్ట్ కిట్స్, గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు అంశాలపై రోజా , శాప్ ఛైర్మన్ భైరెడ్డి సిద్దార్ద్ రెడ్డి అధికారులతో చర్చించారు. పాఠశాలల్లో విద్యార్ధులకు క్రీడలపై అవగాహనా కార్యక్రమాలను శాప్ ద్వారా చేపట్టాలని, కల్చరల్ యాక్టవిటీస్ కి ఆదరణ కల్పించే కార్యక్రమాలను రూపోందించాలని మంత్రి ఆదికారులకు సూచించారు. ప్రసాద్ స్కీం కింద ఒంటిమిట్ట నంద్యాలలో టెంపుల్ టూరిజం, ట్రైబల్ మ్యూజియం అభివృద్ధి, కేరళ తరహాలో కోనసీమ బ్యాక్ వాటర్ ల్లో బోట్ హౌజ్ ల ఏర్పాటు చేసి తద్వారా పర్యాటకులను ఆకర్షించాలని అధికారులకు సూచించారు. పర్యాటకం తో పాటుగా చరిత్ర,సాక్ష్యాలను కూడ కాపాడాల్సిన బాద్యత అందరి పై ఉన్న నేపద్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ద్వార భవిష్యత్ తరాలకు ఎపీ ని అద్బుతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు.