BJP Alliance Mind Game : ఏపీలో పొత్తులపై మైండ్ గేమ్ రాజకీయం - 75 అసెంబ్లీ సీట్లు అడుగుతామన్న బీజేపీ ఉపాధ్యక్షుడు !
AP Politics : ఏపీలో పొత్తులు, సీట్ల కేటాయింపులపై మైండ్ గేమ్ జోరుగా సాగుతోంది. మీడియాలో జరుగుతున్న సీట్ల కేటాయింపు సంఖ్యలన్నీ మైండ్ గేమ్ బీజేపీ నేతలంటున్నారు.
AP Politics Mind Game : ఆంధ్రప్రదేశ్‌లో జమిలీ ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీతో పాటు లోక్ సభ ఎన్నికలు మార్చి, ఏప్రిల్‌లో జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో రాజకీయ పార్టీల మధ్య పొత్తుల అంశం రోజు రోజుకు హాట్ టాపిక అవుతోంది. ఇప్పటికి జనసేన, టీడీపీ కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. తము జనసేనతో పొత్తుల్లో ఉన్నామని బీజేపీ పదే దే చెబుతోంది. టీడీపీతో కలిసి పోటీ చేస్తామంటున్న జనసేన కూడా బీజేపీతో విడిపోయామని ఎక్కడా చెప్పడం లేదు. ఈ కన్ఫ్యూజన్‌లో ఏపీ రాజకీయాల్లో ఒకరి మీద ఒకరు మైండ్ గేమ్ ప్రారంభించారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీ అని ఒక్క సారిగా మీడియాలో ప్రచారం
టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీ చేరబోతోందని.. నివేదిక మొత్తం ప్రధాని మోదీ వద్దకు చేరిందని.. సంక్రాంతి లోపే నిర్ణయం తీసుకుంటారని ఓ ప్రచారం జోరుగా సాగుతోంది మీడియాలోనూ ఇదే వస్తోంది. ఏపీలో గత ఎన్నికల్లో బీజేపీ పార్టీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని ఇతర పార్టీలకు చెందిన కొంత మంది నేతలు విమర్శలు చేస్తూంటారు. అలా అయితే బీజేపీని పట్టించుకోకూడదు కానీ బీజేపీని కూటమిలో కలుపుకోవాలని ఎందుకు అనుకుంటారని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. బీజేపీకి కనీసం ఆరు నుంచి ఎనిమిది శాతం ఓట్లు ఉంటాయయని అన్ని రాజకీయ పార్టీలు తాము బీజేపీకి దగ్గర అని ప్రచారం చేసుకుని బీజేపీకి ఓటేసినా.. మాకు ఓటేసినా ఒకటే అని నమ్మిస్తున్నాయని అందుకే తమ ఓటు బ్యాంక్ వేరే పార్టీలకు వెళ్తుందని చెబుతున్నారు.
లోక్‌సభ ఎన్నికలు కూడా జరుగుతూండటంతో మోదీ ప్రభావం
ఏపీలో లోక్‌సభ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటింగ్ ప్రయారిటీలో జాతీయ అంశాలు ప్రధానంగా ఉంటాయి. ఇది బీజేపీకి మరింతగా మేలు చేసే అవకాశం ఉంది. కూటమిలో ఉంటే.. ఆ కూటమి వైపే ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇటీవల ఏబీపీ న్యూస్ - సీ ఓటర్ నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో ప్రధానిగా మోదీకి 56 శాతం మద్దతు ఉన్నట్లుగా తేలింది. లోక్ సభ ఎన్నికలు ప్రధాన మంత్రి ఎవరు అనే ప్రాతిపదికనే జరుగుతాయి. అందుకే ఓటర్ల ప్రయారిటీ ఎక్కువగా బీజేపీకి మద్దతిచ్చే పార్టీకే ఉంటుంది. ప్రాంతీయపార్టీలు పోటాపోటీగా బీజేపీకి తామంటే తాము సపోర్టుగా ఉంటామన్న రాజకీయం చేస్తూ ఓటర్లను నేరుగా బీజేపీ వైపు రాకుండా చేస్తున్నారని బీజేపీ నేతలంటున్నారు. . ఈ క్రమంలో బీజేపీతో పొత్తులు పెట్టుకుంటే కలసి వస్తుందని భావిస్తున్నారు. అందుకే బీజేపీతో పొత్తులని అంటున్నారంటున్నారు.
సీట్ల విషయంలో మైండ్ గేమ్ జరుగుతోందా ?
బీజేపీకి ఆరు లోక్ సభ, 17 అసెంబ్లీ సీట్లు ఆఫర్ చేసినట్లుగా మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే దీన్ని మైండ్ గేమ్‌బా బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి తాము 75 అసెంబ్లీ సీట్లు, 15 పార్లమెంట్ సీట్లు అడుగుతామని స్పష్టం చేశారు. పొత్తులపై కేంద్ర నాయకత్వం ఇప్పటి వరకూ చర్చలు జరపలేదని ఆయన స్పష్టం చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ హైకమాండ్ జనవరి మూడు, నాలుగు తేదీల్లో కీలక సమావేశాలు నిర్వహించనుంది. ఆ సమావేశాల్లో పొత్తులపై అభిప్రాయాలు తెలుసుకుని.. తదుపరి హైకమాండ్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా మైండ్ గేమేనని ఏపీ బీజేపీ నమ్ముతోంది.