Tomato Price: భారీగా పడిపోయిన టమాటా ధర, కిలో రూ. 8 మాత్రమే- ఎక్కడంటే?
Tomato Price: టమాటా ధరలు భారీగా పడిపోయాయి. కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్ లో కిలో ధర రూ.8 కు పడిపోయింది.
![Tomato Price: భారీగా పడిపోయిన టమాటా ధర, కిలో రూ. 8 మాత్రమే- ఎక్కడంటే? Tomato Prices Fallen To Rs.8 Per Kg In Kurnool Tomato Price: భారీగా పడిపోయిన టమాటా ధర, కిలో రూ. 8 మాత్రమే- ఎక్కడంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/06/3c1630fa989dbaeccb0cc3daa74b7ee31693983299033754_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Tomato Price: టమాటా ధరలు భారీగా పడిపోయాయి. మొన్నటి వరకు చుక్కల్ని చూపించిన టమాటా.. ఇప్పుడు అథఃపాతాళానికి పడిపోయింది. కిలో టమాటా ధర రూ.300 నుంచి రూ.8కు పడిపోయి రైతున్నను నట్టేట ముంచేయడానికి సిద్ధమైంది. కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్ లో టమాటా ధరలు ఘోరంగా పడిపోయాయి. టమాటా ధర తగ్గడం సామాన్యులకు గుడ్ న్యూసే అయినప్పటికీ.. రైతున్నలకు పెను శాపంగా పరిణమించనుంది. నాణ్యతను బట్టి క్వింటా టమాటా ధర కనిష్ఠంగా రూ.800 పలకగా.. గరిష్ఠంగా రూ.1600 వరకు పలికింది. రోజు రోజుకు టమాటా దిగుబడి పెద్ద ఎత్తున వస్తుండటంతో ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. మార్కెట్ ధర ప్రకారం కిలో రూ.8 అంతకంటే తక్కువగానే ఉన్నాయి. దీంతో రైతులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
రెండు నెలల క్రితం టమాట ధరలు సంచలనం సృష్టించాయి. చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా ఆకాశాన్ని అంటాయి. కిలో టమాట రూ.300 వరకు పలికింది. కొందరు రైతులైతే కోట్లలో ఆర్జించారు. అయితే సాధారణ మధ్యతరగతి పౌరుడు మాత్రం ఇబ్బంది పడ్డాడు. వంద రూపాయలు పెట్టినా ఐదు టమాటలకు మించి రాకపోవడంతో ఆందోళన చెందాడు. దాంతో పాటే పచ్చి మిర్చీ ఇతర కూరగాయలు పెరగడంతో జేబుకు చిల్లు పడింది. ఇంటి బడ్జెట్ పెరిగి పోయింది.
వేసవిలో విపరీతంగా ఎండలు కొట్టడంతో టమాట దిగుబడి (Tomato Production) తగ్గిపోయింది. అదే సమయంలో కొన్ని చోట్ల అతి వృష్టితో టమాట పంట నాశనమైంది. మరికొన్ని చోట్ల వర్షాలు లేక తోటలు ఎండిపోయాయి. ఉత్తరాదిలో విపరీతమైన డిమాండ్ ఏర్పడటంతో వారం రోజుల్లోనే టమాట రూ.30 నుంచి 300కు చేరుకుంది. ధరల్లో స్థిరత్వం తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నేపాల్ నుంచి టమాటను దిగుమతి చేసుకుంది. దక్షిణాది నుంచి దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, హరియాణా మార్కెట్లకు టమాటాలు తరలించింది. సాధారణంగా టమాట పంట మూడు నెలల్లో చేతికొస్తుంది. ఇప్పుడిప్పుడే మార్కెట్లకు అధిక స్థాయిలో టమాట వస్తోంది. దాంతో హోల్‌సేల్ ధరలు పడిపోతున్నాయి. మైసూర్‌లోని ఏపీఎంసీ మార్కెట్లో ఆదివారం కిలో టమాట రూ.14కు దిగొచ్చింది. శనివారం నాటి రూ.20 నుంచి ఆరు రూపాయలు తగ్గింది. ఇదే సమయంలో బెంగళూరులో కిలో టమాట రూ.30-35 వరకు పలుకుతోంది.
Also Read: Sonia Letter To PM: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా ఏంటి? ప్రధానికి లేఖ రాసే యోచనలో సోనియా
మండిపోతున్న ఉల్లి ధరలు
రోజురోజుకూ ఉల్లిగడ్డ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ప్రభుత్వం నాఫెడ్ ద్వారా ఉల్లిని సేకరించి మార్కెట్లకు తరలిస్తున్నప్పటికీ ధరలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇందుకు కారణం ఆంధ్ర ప్రదేశ్‌లో ఉల్లి సాగు తగ్గడమేనని నిపుణులు చెబుతున్నారు. అలాగే కర్ణాటకలో కూడా కొత్త పంట చేతికి రాకపోవడంతో రాబోయే రోజుల్లో ఉల్లి ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందని అంటున్నారు. ఏపీలో ఉల్లి సాగు తగ్గడంతో ధరలు కూడా రెండు రెట్లు పెరిగాయి. మార్చి నెలలో 10 రూపాయల నుంచి 15 రూపాయలు కిలోగా ఉన్న ఇల్లి ప్రస్తుతం 30 నుంచి 40 రూపాయలకు వరకు చేరుకుంది. రానున్న రోజుల్లో ఉల్లి ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం ఉల్లిపాయల మార్కెట్ కి ఉల్లి రాక విపరీతంగా తగ్గిపోయింది. గతంలో మార్కెట్ కు రోజుకు 90 లారీల ఉల్లి వచ్చేది. కానీ ప్రస్తుతం అది గణనీయంగా తగ్గింది. రోజుకి ఒకటి నుంచి రెండు లారీల ఉల్లి మాత్రమే వస్తుండడంతో ఉల్లి ధరలు విపరీతంగా పెరుగుతాయని భావిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)