పార్టీ నేతలే వెన్నుపోటుదారులు- టీడీపీ అధికార ప్రతినిధి గంజి చిరంజీవి ఆరోపణలు
టీడీపీకి గంజి చిరంజీవి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా పదవులు, పరపతి కోసం కాదని, పార్టీ నేతల వెన్నుపోటు భరించలేకే అని వివరించారు.
తెలుగు దేశం పార్టీ అధికార ప్రతినిధి గంజి చిరంజీవి ఆ పార్టీకీ రాజీనామా చేశారు. టీడీపీ అధికార ప్రతినిధి పదవితోపాటు, పార్టీ సభ్యత్వానికి గుడ్ బై చెబుతున్నట్లు వివరించారు. టీడీపీ మున్సిపల్ ఛైర్మన్‌గా, 2014లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు చెప్తూనే పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు.
ఇన్నాళ్లూ తనకు అండగా ఉన్న నాయకులతోపాటు కార్యకర్తలకు ఋణపడి ఉంటానన్నారు గంజి చిరంజీవి. తాను పదవులు, పరపతి కోసం పార్టీకి రాజీనామా చేయడం లేదని... సొంత పార్టీ నేతల వెన్నుపోటు భరించలేకే దూరం అవుతున్నట్లు వివరించారు. బీసీగా ఉన్న తనను రాజకీయంగా చాలా ఇబ్బందులకు గురి చేశారని, 2014లో తన ఓటమికి సొంత పార్టీ నేతలే కారణం అయ్యారని చిరంజీవి చెప్పారు.
ఎవరు, ఎలా ఓడించారో అందరికీ తెలుసు..
"పేర్లు చెప్పే టైపు నేను కాదు కానీ. మీ అందరికీ తెలుసు. నన్ను ఎవరు ఏ విధంగా ఓడించారు. ఎవరు ఓ విధంగా ఓడించిన వ్యక్తులు ఈరోజు టీడీపీని ఆడిస్తున్నారో మీ అందరూ గమనించాలి. నేనేమీ స్వార్థం కోసం పదవుల కోసం ఈ మాటలు చెప్పడం లేదు. 2014లో సీటు ఇచ్చి గెలిపించుకోలేని తెలుగు దేశం పార్టీ, సొంత వాళ్లే ఓడించడం ఎంత వరకు ధర్మమో.. తెలుగు దేశం పార్టీ నాయకులు కూడా ఆలోచించుకోవాలి. ఈ విధంగానే చేస్తే రానున్న రోజుల్లో నందమూరి రామారావు ఏ ఉద్దేశంతో పార్టీ పెట్టారో... బీసీలు, ఎస్సీలు, చిన్న వర్గాలకి ప్రాధాన్యత లభించాలని అది దెబ్బ తీసిన పార్టీగా చరిత్రలో నిలిచిపోతుందని నేను భావిస్తున్నాను." - గంజి చిరంజీవి
తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే టైపు కాదు నేను..
"ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో జరిగే అంశాలను పార్టీ సేకరిస్తుందనే విషయం మీ అందరికీ తెలుసు. మీడియా విస్తృతం అయిపోయింది. నా బాధ, నా ఆవేదన పైస్థాయి వాళ్లకు తెలీదా. హండ్రెడ్ పర్సంట్ తెలుసు. కావాలాని.. ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదు. నేనైతే ఏనాడు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు, అంతటి సాహసాలు కానీ అంతటి దూకుడు తనాలు కానీ చేయలేదు. తల్లిపాలు రొమ్ముగుద్దే రాజకీయ నాయకుడిని నేను కాదు." - గంజి చిరంజీవి
టీడీపీ వాళ్లే నా రాజకీయ జీవితం నాశనం చేశారు..
టీడీపీ నేతలే తన రాజకీయ జీవితాన్ని నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరి నిమిషం వరకు మంగళగిరి ఎమ్మెల్యే సీటు నీకే ఇస్తామని చెప్పి.. ఆఖరి క్షణంలో చేతులెత్తేశారని వాపోయారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అనే పదవి ఇచ్చి తనను మంగళగిరి ప్రజలకు దూరం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేనేత, బీసీగా ఉన్న తనను సొంత పార్టీ నేతలే అణగదొక్కారన్నారు. తన ఆవేదన, బాధ గురించి నాయకులకు తెలిసినా ఏమాత్రం పట్టించుకోలేదని తన మనసులోని మాటలను వెల్లడించారు. ఎస్సీ,ఎస్టీ, బీసీలకు న్యాయం చేసే వారితోనే నడుస్తానని స్పష్టం చేశారు. అందరినీ సంప్రదించి త్వరలోనే సరైన నిర్ణయం తీసుకుంటానన్నారు.