Avinash Reddy Arrest: 'అవినాష్ అరెస్టు ఇప్పట్లో కష్టమే, అడ్డుకునేందుకు జగన్ ఎంత దూరమైనా వెళ్తారు'
Avinash Reddy Arrest: అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేయడం ఇప్పట్లో జరగదని సీపీఐ నాయకుడు నారాయణ అన్నారు. ఆయన అరెస్టును అడ్డుకునేందుకు సీఎం జగన్ ఏమైనా చేస్తారన్నారు.
Avinash Reddy Arrest: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టుకు సంబంధించి సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పట్లో అవినాష్ రెడ్డి అరెస్టు ఉండదని నారాయణ అన్నారు. వైసీపీ ఎంపీ అవినాష్ అరెస్టును అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎంత దూరమైన వెళ్తారని వ్యాఖ్యానించారు. వివేకానంద రెడ్డి హత్య కేసు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగిందని, ఆనాడే అవినాష్ రెడ్డిని అరెస్టు చేసి ఉంటే ఇంత జరిగేది కాదని నారాయణ పేర్కొన్నారు. కడప జిల్లాలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన నారాయణ మాట్లాడారు.
'సీబీఐ చేసిందేం లేదు, చేసిందంతా సునీతనే'
వివేకానంద రెడ్డి హత్య కేసులో ఈ రోజు ఇంత దూరం రావడానికి వివేకా కుమార్తె సునీత పట్టుదలే కారణమని సీపీఐ నారాయణ అన్నారు. ఈ విషయంలో సీబీఐ చేసింది ఏమీ లేదని ఆయన ఎద్దేవా చేశారు. 'వివేకానంద రెడ్డి కుమార్తె సునీత పట్టుదల వల్లే ఈరోజు వివేకా హత్య కేసు ఇంత దూరం రాగలిగింది. ఈ విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థ చేసిందేమీ లేదు' అని నారాయణ అన్నారు.
Also Read: Varla Ramaiah: ఆకురౌడీలు చెప్తే సీబీఐ వెళ్లిపోతుందా? కేంద్రాన్నీ శంకించాల్సి వస్తోంది - వర్ల రామయ్య
'ఏ మొక్కను అడిగినా వివేకాను ఎవరు చంపారో చెబుతుంది'
సీబీఐ.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వద్ద మోకాలు వంచితే, సీఎం జగన్.. కేంద్రం మంత్రి అమిత్ షా వద్ద మోకాలు వంచారని సీపీఐ నారాయణ మండిపడ్డారు. పులివెందులలో చివరికి ఏ పూల మొక్కను అడిగినా వివేకానంద రెడ్డిని ఎవరు చంపారో చెబుతుందని నారాయణ వ్యాఖ్యానించారు. వైఎస్ కుటుంబం అనుమతి లేకుండా పులివెందులో ఒక్క చీమ కూడా కుట్టదని సీపీఐ జాతీయ నాయకుడు అన్నారు.
'గాలి కంటే అవినాష్ శక్తివంతుడేం కాదు'
గాలి జనార్దన్ రెడ్డి కంటే ఎంపీ అవినాష్ రెడ్డి శక్తిమంతుడు ఏమీ కాదని నారాయణ పేర్కొన్నారు. ఇదే తరహాలో ఇతర రాష్ట్రాల్లో ఎవరైనా ఎంపీ కేసులో చిక్కుకుని ఉంటే.. సీబీఐ అధికారులు వచ్చి ఆ సర్కారును రద్దు చేసి, అరెస్టు చేసి తీసుకెళ్లే వారని నారాయణ వ్యాఖ్యానించారు. కానీ ఏపీలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతున్నట్లు తెలిపారు.
Also Read: Avinash Reddy : అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు - ముందస్తు బెయిల్‌పై ఏం చెప్పిందంటే ?
విశ్వభారతి ఆస్పత్రి ముందు వైసీపీ ఆందోళన
కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రి ముందు వైసీపీ శ్రేణుల ఆందోళన కొనసాగుతున్నాయి. వినూత్న రీతిలో వైసీపీ కార్యకర్తలు నిరసనలు చేపడుతున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆయనకు మరికొంత సమయం ఇవ్వాలని కోరుతున్నారు. సీబీఐ అధికారులు మానవతా దృక్పథంలో ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కర్నూలు మేయర్ రామయ్య సహా ఇతర కార్యకర్తలు, నాయకులు నిరసనల్లో పాల్గొన్నారు. 'వి రెస్పెక్ట్ సీబీఐ.. అండర్ మదర్ హెల్త్ గ్రౌండ్స్ వి నీడ్ సమ్ టైం.. వీ రెస్పెక్ట్ సీబీఐ.. వీ కోఆపరేట్ విత్ సీబీఐ(మేం సీబీఐని గౌరవిస్తాం. తల్లి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మరికొంత సమయం ఇవ్వాలి. మేం సీబీఐని గౌరవిస్తున్నాం.. వారికి పూర్తిగా సహకరిస్తాం)' అని రాసి ఉన్న ప్లకార్డులతో నిరసనలు కొనసాగిస్తున్నారు.