Minister Pinipe Viswarup : మీ నిర్లక్ష్యం వల్లే ప్రభుత్వానికి బ్యాడ్, ఎమ్మార్వోపై మంత్రి విశ్వరూప్ సీరియస్
Minister Pinipe Viswarup : మీ నిర్లక్ష్యం వల్లే ప్రభుత్వానికి బ్యాడ్ వస్తుందని మంత్రి పినిపే విశ్వరూప్ ఎమ్మార్వోపై ఫైర్ అయ్యారు. ఎమ్మార్వో వరద సహాయక చర్యలు చేపట్టడంలేదని స్థానికులు నిలదీయడంతో మంత్రి సీరియస్ అయ్యారు.
Minister Pinipe Viswarup : కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలంలో వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే పర్యటిస్తున్నారు. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే ను వరద బాధితులు నిలదీశారు. తమకు ఎటువంటి సాయం అందడంలేదని ఆరోపించారు. దీంతో ఎమ్మార్వో పై మంత్రి విశ్వరూప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పి.గన్నవరం మండలం లంకల గన్నవరంలో వరద బాధితులను ఆదివారం మంత్రి పినిపే విశ్వరూప్ పరామర్శించారు. మంత్రి ఎదుటే రెవెన్యూ అధికారుల తీరుపై బాధితులు మండిపడ్డారు. ఇంతవరకు ఎటువంటి సహాయం అందడం లేదని మంత్రి ఎదుట ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానికులు. తహసీల్దార్ ఏమి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తహసీల్దారుపై మంత్రి విశ్వరూప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీ నిర్లక్ష్యం వల్లే మాకు బ్యాడ్
తహసీల్దార్ కార్యాలయం దగ్గర్లోనే ఉన్నా మీరు ఏం చేయలేకపోతున్నారు అంటూ మంత్రి విశ్వరూప్ ఎమ్మార్వోపై అసహనం వ్యక్తం చేశారు. మీరు చేస్తున్న నిర్లక్ష్యం వల్ల ఎమ్మెల్యే కు బ్యాడ్ వస్తుంది అంటూ సీరియస్ అయ్యారు. తక్షణం మండలంలోని వరద బాధితులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఎమ్మార్వో కు మంత్రి విశ్వరూప్ సూచించారు.
వరద నీటిలో కొట్టుకుపోయిన 300 జింకలు
గోదావరి నది మధ్యలో ఉండే పచ్చిక బయళ్ల చిగుళ్లు తింటూ చెంగు చెంగున గంతులేస్తూ జీవించే జంకలకు వరదలు కష్టాలు తెచ్చాయి. వరద ఉద్ధృతి అధికంగా ఉండటంతో ఈ జింకలన్నీ నీటి ప్రవాహనికి కొట్టుకుపోతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి పులసలంకలో సుమారు 300 పైబడి జింకలు, లేళ్లు ఉన్నాయి. అయితే శనివారం వరదనీటి ప్రవాహం అధికమవ్వడంతో పులసలంక చాలా వరకు మునిగిపోయింది. దీంతో ఇవి ఒక్కొక్కటిగా గోదావరిలో కొట్టుకుపోతున్నాయి. పొట్టిలంక సమీపంలో గోదావరి ప్రవాహానికి కొట్టుకుపోతున్న నాలుగు జింకలను రైతులు పట్టుకుని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అయితే ఒక జింక ఒడ్డుకు చేరినప్పటికీ కుక్కల దాడిలో మృతి చెందింది. దీనిపై అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
వన్యప్రాణులకు శాపం
పులసల లంకలో సుమారు 1500 గొర్రెలు చిక్కుకుపోగా మూడు రోజుల నుంచి అధికారులు శ్రమించి వాటిని బోట్లు, పంట్లు ద్వారా బయటికి తరలించారు. అయితే జింకలను అలా తీసుకురావడం సాధ్యంకాదని అధికారులు అంటున్నారు. చెంగుచెంగున పరిగెత్తే వీటిని పట్టుకుని తీసుకురావడం చాలా కష్టంతో కూడుకున్నది. మనషులను చూస్తేనే జింకలు పారిపోతాయి. 2020 వరదలకు సుమారుగా 100 జంకలు కొట్టుకుపోగా ప్రస్తుత వరదలకు మిగిలిన 300 కూడా కొట్టుకుపోతున్నాయని పులసలంకలో వ్యవసాయం చేసే రైతులు ఆవేదన చెందుతున్నారు. అలాగే రావులపాలెం బ్యారేజీ దిగువన గల లంకల్లో ఉండే జింకలు కూడా ఈ వరద తాకిడికి కొట్టుకుపోతున్నాయి. ప్రతి ఏటా వచ్చే వరదలు ఈ వన్యప్రాణులకు శాపంగా మారుతున్నాయి.