Kodi Kathi Srinu: జై భీమ్ రావ్ భారత్ పార్టీలో చేరిన కోడికత్తి శీను, చాలా గర్వంగా ఉందన్న జడ శ్రావణ్ కుమార్
Kodi Kathi Srinu Political Entry: కోడి కత్తి కేసులో నిందితుడు శీను జై భీమ్ రావ్ భారత్ పార్టీలో చేరాడు. సోమవారం రాత్రి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ సమక్షంలో ఆ పార్టీలో చేరాడు.
Andhra Elections JaiBhim Rao Bharat Party: అమలాపురం: కోడి కత్తి కేసులో నిందితుడు శీను (Kodi Kathi Srinu) జై భీమ్ రావ్ భారత్ పార్టీలో చేరాడు. సోమవారం రాత్రి తొమ్మిది గంటలకు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ సమక్షంలో ఆ పార్టీలో చేరాడు శ్రీనివాస్. కండువా కప్పి శీనును తన పార్టీలోకి ఆహ్వానించారు జడ శ్రావణ్. త్వరలో జరగనున్న ఎన్నికల్లో అమలాపురం (Amalapuram) నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం. అసెంబ్లీలో బడుగు బలహీన వర్గాల తరఫున బలమైన వాయిస్ వినిపిస్తానంటున్నాడు శ్రీనివాస్.
ప్రతి దళితుడు, బహుజనులు సంతోషంగా ఉండాలి, ప్రతి ఒక్కరికి ఉపాధి కావాలని ఆలోచించే అతికొద్ది మందిలో శ్రీనివాస్ ఒకడని జడ శ్రావణ్ కుమార్ అన్నారు. సోదరుడిగా, ఈ రాష్ట్రంలో అణగారిన వర్గాల్లో శీను పుట్టినందుకు తనకు గర్వంగా ఉందన్నారు. కోర్టు పరిధిలో ఉన్న అంశం కనుక తాను ఆ విషయం టచ్ చేయనన్నారు. రాజకీయాలు స్వేచ్ఛగా, పారదర్శకతతో చేయాలి కానీ, కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయని విమర్శించారు.
బెయిల్ పై విడుదలైన కోడికత్తి శీను
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయనపై దాడి చేసిన కోడి కత్తి కేసులో శ్రీనివాస్ నిందితుడిగా ఉన్నాడు. దాదాపు ఐదేళ్లుగా ఆయన జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటుండగా.. తాజాగా కోర్టు తీర్పు ఇవ్వడంతో శుక్రవారం (ఫిబ్రవరి 9) జైలు నుంచి బయటికి వచ్చాడు. ఈ సందర్భంగా కోడికత్తి శీను మాట్లాడుతూ.. తనకు బెయిల్ రావడానికి ప్రయత్నించిన వారికి ధన్యవాదాలు తెలిపాడు. ఇన్నాళ్లు తాను జైలులో ఉండగా, తనకు అండగా నిలిచిన దళిత సంఘాలకు కూడా ధన్యవాదాలు తెలిపాడు. శ్రీనివాస్ తరపు న్యాయవాది సలీం మాట్లాడుతూ.. ఆయన బెయిల్ కోసం తాను మానవతా దృక్పథంతో ప్రయత్నించానని చెప్పారు. బయటికి వచ్చిన అతనికి ఏం జరిగినా ఏపీ ప్రభుత్వానిదే బాధ్యత అని న్యాయవాది సలీం మాట్లాడారు.
విశాఖ సెంట్రల్ జైలు నుంచి బెయిల్‌పై కోడి కత్తి శీనివాస్ విడుదల అయ్యే సమయంలో అతడికి దళిత సంఘాలు ఘన స్వాగతం పలికాయి. జై భీమ్, న్యాయం గెలిచింది అంటూ నినాదాలు చేశారు. జైలు నుంచి శ్రీనివాస్‌ను తీసుకొని న్యాయవాది శ్రీనివాస్, సలీం, విదసం నాయకుడు బూసి వెంకటరమణ వచ్చారు. న్యాయవాదులు దళిత సంఘాల సమక్షంలో తండ్రి కుటుంబ సభ్యులకు శీనివాస్‌ను అప్పగించ్చారు.
ఐదేళ్ల క్రితం ఘటన
2018లో అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ పై విశాఖపట్నం ఎయిర్ పోర్టులోని లాబీలో శ్రీనివాస్ అనే యువకుడు కోడి కత్తితో దాడి చేశాడు. దాడి చేశాక పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. జగన్ కు అప్పట్లో చేయికి గాయం అయింది. దీంతో ఆయన హైదరాబాద్ కు వెళ్లి వైద్యం చేయించుకున్నారు. నిందితుడైన శ్రీనివాస్ ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
అలా శ్రీనును పోలీసులు విచారణ చేశారు. విచారణ సమయంలో శ్రీనివాస్ మాట్లాడుతూ.. జగన్ ను సీఎంగా చూడాలన్నదే తన ఆశ అని అన్నారు. ఈ దాడి చేస్తే ఎన్ని కల్లో జగన్‌కు సానుభూతి వస్తుందని నిందితుడు చెప్పాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం నమోదు చేయగా.. ఆ తర్వాత నిందితుడిని విడుదల చేయాలని అతని తల్లిదండ్రులు వేడుకున్నారు. నిందితుడు శ్రీనివాస్ కు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తల్లి, అన్న నిరవధిక దీక్షకు కూడా దిగారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. దళిత సంఘాలు కూడా ప్రభుత్వ తీరుపై గళం ఎత్తాయి. మొత్తానికి ఐదేళ్లకు ఇప్పుడు శ్రీను బెయిల్ పై విడుదల అయ్యాడు.