Kakinada Bulk Drug Company : కాకినాడలో బల్క్ డ్రగ్ పార్క్, కేంద్రం గ్రీన్ సిగ్నల్!
Kakinada Bulk Drug Company : ఏపీలో బల్క్ డ్రగ్ కంపెనీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాకినాడలో ఏర్పాటు చేసి ఈ కంపెనీ ద్వారా రూ.7 వేల కోట్ల పెట్టుబడులు, 12 వేల ఉద్యోగాలు రానున్నాయని అధికారులు అంటున్నారు.
Kakinada Buld Drug Company : దేశంలో మూడు బల్క్ డ్రగ్ పార్క్‌ల ఏర్పాటు కోసం కేంద్రం ప్రకటించిన ప్రత్యేక పథకంలో భాగంగా ఏపీలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాకినాడ జిల్లా తొండంగి మండలం కేపీ పురం, కోదాడ గ్రామాల పరిధిలో బల్క్ డ్రగ్ కంపెనీ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు కేంద్ర ఎస్‌ఎస్‌సీ (స్కీమ్ స్టీరింగ్ కమిటీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదికను (డీపీఆర్) 90 రోజుల్లోగా ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ ఏజెన్సీ ఐఎఫ్‌సీఐ(ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)కు పంపాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ పరిధిలోని ఫార్మాసూటికల్స్ విభాగం సంయుక్త కార్యదర్శి ఎన్.యువరాజ్ లేఖ రాసినట్లు అధికారులు వెల్లడించారు.
12 వేల ఉద్యోగాలు
బల్క్ డ్రగ్ పార్క్‌ల కోసం ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. ఏపీ ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానం 2020–23 ప్రకటించి కేంద్రానికి లేఖ రాసింది. ఇందులో కాకినాడ జిల్లా తొండంగి మండలం కేపీ పురం, కోదాడ గ్రామాల పరిధిలో రెండు వేల ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపి తీర్మానాన్ని కేంద్రానికి పంపింది. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు ద్వారా రూ.6,940 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. రాబోయే ఎనిమిదేళ్లలో పార్క్ ద్వారా రూ.46,400 కోట్ల మేర వ్యాపారం జరుగుతుందని, 10 వేల నుంచి 12 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు.
బల్క్ డ్రగ్ పార్క్ వద్దు, కేంద్రానికి యనమల లేఖ
కాకినాడలో ఏర్పాటు చేయబోతున్న బల్క్ డ్రగ్ పార్క్ వల్ల పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకోవాలని కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ కార్యదర్శికి యనమల లేఖ రాశారు. ఈ లేఖ కాపీలను జాతీయ హరిత ట్రైబ్యునల్, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు పంపించారు.
రైతుల ఆందోళన
ఈ ప్రాంతంలో సెజ్ ఏర్పాటు కోసం రైతుల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం 8,500 ఎకరాల భూమిని సేకరించిందని లేఖలో యనమల అన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసే పరిశ్రమ వల్ల మత్స్యకారుల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చెప్పారన్నారు. అందుకు విరుద్ధంగా సీఎం జగన్ అరబిందో రియాల్టీ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కు ఫార్మా పార్క్ ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నారన్నారు. ఫార్మా పార్క్ ఏర్పాటు చేస్తే నేల, నీరు, వాయు, సముద్రం కలుషితమై రైతులు, మత్స్యకారుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. ఫార్మా పార్క్ ను వ్యతిరేకిస్తూ రైతులు, మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారన్న విషయాన్ని ఆయన లేఖలో రాశారు.
Also Read : CM Jagan Review : ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టండి, అధికారులకు సీఎం జగన్ క్లాస్