Amaravati Land Pooling: అమరావతిలో మరో 16,666 ఎకరాల భూసమీకరణ - గతమంత నమ్మకం ఉందా? రైతులు ముందుకు వస్తారా?
Amaravati farmers: అమరావతిని మరింత విస్తరిచేందుకు ప్రభుత్వం భూసమీకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. మరి రైతులు గతంలోలా ముందుకు వస్తారా ?

Amaravati Land Pooling 2nd Phase: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రాజధాని అభివృద్ధికి రెండో దశ భూసమీకరణ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ - LPS 2.0 నోటిఫికేషన్ జారీ చేసింది. 16,666.57 ఎకరాల భూములను 7 గ్రామాల్లో సమీకరిస్తారు. అభివృద్ధి చేసిన ప్లాట్లను రైతులకు కేటాయిస్తారు. క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (CRDA) పరిధిలో ఉన్న వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి, హరిశ్చంద్రపురం, వడ్లమాను, పెదపరిమి గ్రామాల్లో ఈ ప్రక్రియ మొదలవుతోంది. మొదటి దశలో 33 వేల ఎకరాలు సమీకరించారు. అప్పట్లో నెలన్నరలో ప్రక్రియ పూర్తి అయింది. ప్రభుత్వంపై ఎంతో నమ్మకంతో భూములు ఇచ్చారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అన్నది అసలు ప్రశ్నగా మారింది.
ప్రపంచ స్థాయి రాజధానికి మరిన్ని భూములు
ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ నవంబర్ 28న రెండో దశ LPSకు ఆమోదం తెలిపింది. CRDA కమిషనర్‌కు భూములు సమీకరించే అధికారం ఇచ్చారు. మొత్తం 16,666.57 ఎకరాలు సమీకరించి, అమరావతి అభివృద్ధికి ఉపయోగిస్తారు. రాజధాని నిర్మాణాలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు భూములు సమకూర్చడం. మొదటి దశలో 33 వేల ఎకరాలు సమీకరించినట్టు, రెండో దశలో మరో 16 వేలు జోడించి మొత్తం 50 వేల ఎకరాలు చేస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాబినెట్ సమావేశంలో ఈ 7 గ్రామాల్లో రైతులు 16,666 ఎకరాలు స్వచ్ఛందంగా ఇవ్వడానికి ముందుకు వచ్చారని తెలిపారు. మొదటి దశలో 90 శాతం రైతులు సహకరించారు, ఇప్పుడు కూడా అదే స్పందన వస్తుందని నమ్ముతున్నారు. కానీ అంత ఉత్సాహం కనిపించడం లేదని రాజకీయవర్గాలు భావిసతున్నాయి.
మొదటి దశలో భూములిచ్చిన రైతుల ఆందోళనల ఎఫెక్ట్
మొదటి దశలో భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటికీ సమస్యలు ఉన్నాయి. అన్ని మౌలిక సదుపాయాలతో ప్లాట్లను హ్యాండోవర్ చేయలేదు. ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. పదేళ్లు అవుతున్నాయి. మధ్యలో జగన్ సీఎం కావడం పనులు ఆగిపోవడంతో రైతులు ఇబ్బంది పడ్డారు. అదే సమయంలో ప్రభుత్వం మారిన తర్వాత గ్రామకంఠాలు, నెగోషియేటెడ్ సెటిల్‌మెంట్ పాలసీ , E13 ఆలస్యం వంటి వాటిపై ఫిర్యాదులు చేశారు. ఆరు నెలల్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ రైతుల సమస్యలు రెండో వడిత పూలింగ్ లో భూములు ఇవ్వాలనుకునేవారిని కాస్త వెనక్కి తగ్గేలా చేస్తున్నాయి.
ఈ సారి ల్యాండ్ పూలింగ్ అంత ఈజీగా సాగదు !
రెండో దశలో ల్యాండ్ పూలింగ్ కు భూములిచ్చే రైతులకు గతంలో అమలు చేసిన నిబంధనలే వర్తిస్తాయని సీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. జరీబు భూమికి నివాస స్థలం 1,000 గజాలు, వాణిజ్య ప్లాటు 450 గజాలు, మెట్ట భూములకు నివాస స్థలం 1,000 గజాలు, వాణిజ్య ప్లాటు 250 గజాలు కేటాయిస్తారు. కౌలు కూడా మొదటి దశలో రైతులకు చెల్లించినట్లుగానే చెల్లిస్తారు. ఇప్పటికే ఈ ఏడు గ్రామాల్లో సభలు నిర్వహించారు. భూ సమీకరణకు అనుకూలంగా చేసిన తీర్మానాలు చేశారు. వారంతా ముందుకు వస్తే రెండో దశ ల్యాండ్ పూలింగ్ సజావుగా సాగుతుంది. కానీ రైతులు కొత్త కొత్త డిమాండ్లు , అదనపు హామీలు అడిగే అవకాశం ఉంది. 16,666 ఎకరాల భూసమీకరణ ప్రజెక్టు అమరావతి పునరుద్ధరణకు కీలకం. రైతులు ముందుకు వస్తే విజయం, ఆటంకాలు ఏర్పడితే.. కొత్త సమస్యలు వస్తాయి. అయితే ప్రభుత్వం మాత్రం రైతులకు తమపై ఏ మాత్రం నమ్మకం తగ్గలేదని గట్టిగా నమ్ముతోంది.




















