అమరావతిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్, 16,666 ఎకరాలు నోటిఫై చేస్తూ ఉత్తర్వులు
land pooling in AP capital | ఏపీ రాజధాని అమరావతిలో రెండో విడత భూ సమీకరణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైతుల నుంచి 16 వేల ఎకరాలను ఈ దశలో సేకరించనున్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో రెండో విడత ల్యాండ్ పూలింగ్‌కు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని ప్రాంతంలోని ఏడు గ్రామాలలో ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 16,666 ఎకరాలకు ల్యాండ్ పూలింగ్ కోసం నోటిఫికేషన్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో అమరావతి మండలంలోని ఐదు గ్రామాలు ఉన్నాయి.
అమరావతి మండలంలోని వైకుంఠపురం, పెద్ద మద్దూరు, ఏండ్రాయి, కర్లపూడి, లెమల్లె గ్రామాల్లో 7,465 ఎకరాలకు ల్యాండ్ పూలింగ్ చేయనున్నారు. అదే విధంగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని వడ్లమాను, హారిచంద్రపురం, పెద్ద పరిమి అనే మూడు గ్రామాలలో 9,097 ఎకరాలకు ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఇటీవల ఏపీ కేబినెట్ ఆమోదం
ఏపీలోని కూటమి ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి ప్రాంతంలో రెండో విడత ల్యాండ్ పూలింగ్ చేపట్టాలన్న ప్రతిపాదనకు రాష్ట్ర కేబినెట్ గత వారం ఆమోదం తెలిపింది. రెండో దశలో మరో16 వేల ఎకరాల సేకరించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన ప్రక్రియపై కసరత్తు చేపట్టిన ప్రభుత్వం పూర్తి జాబితా సిద్ధం చేసింది. రాజధాని అమరావతి నిర్మాణానికి మొదటి దశలో ప్రభుత్వ భూమి16 వేల ఎకరాలు సీఆర్డీఏకు అప్పగించారు. రాజధాని కోసం రైతుల నుంచి మొత్తం 50 వేల ఎకరాలు భూమి సేకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా తొలి విడతలో రైతుల నుంచి 34 వేల ఎకరాలను సమీకరించి సీఆర్‌డీఏకు అప్పగించారు. తాజాగా రెండో దశలో మరో 16 వేల ఎకరాల భూమి సేకరించాలని ఇటీవల కేబినెట్ భేటీలో ఆ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.






















