HIV Rises in Andhra Pradesh : ఎయిడ్స్ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ టాప్- ఏపీ ప్రభుత్వం అలర్ట్- సత్య కుమార్ ఏమన్నారంటే?
HIV Rises in Andhra Pradesh : పెరిగిపోతున్న పార్టీ సంస్కృతి, గతి తప్పుతున్న వైవాహిక వ్యవస్థ, లోపిస్తున్న అవగాహన కారణంగా ఎయిడ్స్ కేసులు భారీగా పెరుగుతున్నాయి ఇందులో ఆంధ్రప్రదేశ్ టాప్ ప్లేస్‌లో ఉంది.

HIV Rises in Andhra Pradesh : దేశ వ్యాప్తంగా ఐటీ ఉద్యోగుల్లో హెచ్ఐవీ కేసులు నమోదవుతుండడం పట్ల ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. విలాసవంతమైన జీవితం, మాదక ద్రవ్యాల వాడకం వంటి కారణాలతో ఈ ధోరణి కొత్తగా కనిపిస్తోందన్నారు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (న్యాకో) పరిశీలనలో ఐటీ రంగానికి చెందిన వారిలో హెచ్ఐవీ వ్యాప్తి పెరుగుతున్నట్లు తాజాగా తేలిందన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి ఆదేశించారు.
మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని కోరారు మంత్రి. 'సేఫ్' సెక్స్ విధానాలు అవలంబించాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లలకు సేఫ్ సెక్స్ గురించి, ఎయిడ్స్ తీవ్రత గురించి అవగాహన కల్పించాలన్నారు. ఎయిడ్స్ రోగులపట్ల ఎవరూ కూడా వివక్ష చూపకూడదని పేర్కొన్నారు. హెచ్ఐవీ విద్యార్థుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 'ప్రపంచ ఎయిడ్స్ దినం- 2025' కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి శ్రీ సత్యకుమార్ మాట్లాడుతూ.. హెచ్ఐవి బాధితుల్లో అనారోగ్యంపాలైన వారికి అవసరమైన శస్త్ర చికిత్సలు చేసేందుకు వైద్యులు నిరాకరిస్తున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చిందని మంత్రి పేర్కొన్నారు. హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు జిల్లాల్లో అంబుడ్స్‌మెన్‌గా ఉన్న డీఎంఅండ్ హెచ్ ఓలకు ఫిర్యాదు చేస్తే బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు. ఇటువంటి ఘటనల గురించి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకురావచ్చునన్నారు.
హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులు ప్రతినెలా మందుల (ఎఆర్టీ) కోసం దూర ప్రాంతాల్లో ఉన్న ఆసుపత్రులకు వెళ్లడంలో కొన్ని సమస్యలు ఉన్నాయన్నారు మంత్రి. ఇలాంటి వారి విజ్ఞప్తులు అనుసరించి వెస్ట్ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో ఎంపికచేసిన పీహెచ్సీల్లో ఏఆర్టీ మందులను అందుబాటులో ఉంచామని తెలిపారు. ఇతరచోట్ల కూడా ఇటువంటి సౌకర్యాన్ని బాధితుల నుంచి వచ్చే విజ్ఞప్తులు అనుసరించి కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
2030 నాటికి ఎయిడ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు కృషి
2030 నాటికి ఎయిడ్స్‌రహిత దేశంగా, రాష్ట్రంగా మార్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం హెచ్ఐవి కొత్త కేసులు నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని పేర్కొన్నారు. 2015-16లో పరీక్షించిన వారిలో 2.34% పాజిటివిటీ నమోదుకాగా 2024-25 నాటికి అది 0.58%కు తగ్గిందని పేర్కొన్నారు. 2024-25లో కొత్తగా 13,383 కేసులు వచ్చాయన్నారు. అవగాహన కార్యక్రమాల నిర్వహణ, ప్రజల్లో కనిపిస్తోన్న మార్పువంటి చర్యలవల్ల కేసులు తగ్గుతున్నాయన్నారు. మందుల వాడకంతో మరణాల సంఖ్య కూడా తగ్గిందన్నారు. రూ.30వేల నుంచి రూ.40వేల విలువైన మందులను ప్రతి ఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్ఐవీ బాధితులకు అందచేస్తున్నాయని తెలిపారు. 2030 నాటికి కొత్త కేసుల నమోదు జరగకుండా చూడాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న ఎయిడ్స్ వ్యాధి నియంత్రణ సంస్థ అధికారులు, ఉద్యోగులను మంత్రి అభినందించారు.
ఎయిడ్స్ వ్యాధిపై తొలినాళ్లల్లో ఉన్న భయం ప్రస్తుతం లేదని వ్యాఖ్యానించారు. ఎయిడ్స్ సోకడంవల్ల ప్రాణాలు పోవట్లేదు కదా? అనే నిర్లక్ష్యం పనికిరాదన్నారు. హెచ్ఐవీ బాధితుల్లో ప్రస్తుతం 42వేల మందికి ప్రభుత్వం నుంచి పింఛన్ అందుతుందని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. కొత్తగా అందిన 95వేల దరఖాస్తులు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. వీరిలో అర్హత కలిగిన వారికి త్వరలో పింఛన్ ల మంజూరుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
సమాజ అప్రమత్తత కోసమే అవగాహన కార్యక్రమాలు!
రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ నీలకంఠారెడ్డి మాట్లాడుతూ సమాజాన్ని అప్రమత్తంచేసేందుకు ఎయిడ్స్ అవగాహన కార్యక్రమాలు జరుపుతున్నామని తెలిపారు. యువత సన్మార్గంలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధరబాబు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. విద్యార్థిని విద్యార్థులు హెచ్ఐవీ పట్ల జాగ్రత్తగా ఉండాలని, వచ్చిన వారి పట్ల వివక్ష చూపకూడదని ప్రదర్శించిన 'స్కిట్లు' ఆహుతులను అలరించాయి. ఎయిడ్స్ కేసుల నియంత్రణకు కృషి చేస్తున్న వారిలో పలువురిని మంత్రి సత్యకుమార్ సత్కరించారు.





















