Home Minister Anita: డీఎస్పీ జయసూర్యపై నివేదిక మా దగ్గర ఉంది- చర్యలు ఖాయం - హోంమంత్రి అనిత ప్రకటన
DSP Jayasuriya : డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై నివేదిక ఉందని హోంమంత్రి అనిత ప్రకటించారు. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అని.. ఆయన ఏ విషయంపైన అయినా స్పందించవచ్చన్నారు.

Home Minister Anitha on DSP Jayasuriya: భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారంపై తమ దగ్గర సమాచారం ఉందని.. పోలీసు ఉన్నతాధికారుల నుంచి వచ్చిన నివేదిక ఉందని హోంమంత్రి అనిత తెలిపారు. ఈ అంశంపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. డీఎస్పీ జయసూర్యపై పవన్ కల్యాణ్ .. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఈ వ్యవహారం వైరల్ కావడంతో సంబంధిత శాఖ మంత్రి అయిన అనిత స్పందించారు.
"పవన్ కళ్యాణ్ ఏపీకి డిప్యూటీ సీఎం. ఆయన దృష్టిలో ఉన్న విషయాలను చెబుతారు. ఆయన ఇచ్చింది అఫీషియల్ కమ్యూనికేషన్. మా దృష్టిలో కూడా సమాచారం ఉంది, యాక్షన్ తీసుకుంటాం. మాకు మధ్య ఈగో లేనప్పుడు మీకు ఎందుకు..? మా శాఖల మధ్య కోఆర్డినేషన్ ఉంది. ఓఎస్డీలతో, ప్రిన్సిపల్ సెక్రటరీలతో కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. ప్రజలకు కావాల్సింది రిజల్ట్. మా ప్రభుత్వంలో అది ప్రతీ విషయంలోనూ రిజల్ట్ కనిపిస్తోంది. మాకు లేని సమస్య మీకు దేనికి.?" అని ప్రశ్నించారు.
పవన్ ఏమన్నారంటే ?
భీమవరం డిఎస్పీ జయసూర్య పై అనేక ఆరోపణలు వస్తూండటంతో పశ్చిమ గోదావరి ఎస్పీతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చర్చించారు. జయసూర్య వ్యవహారాలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. భీమవరం డి.ఎస్.పి. పరిధిలో పేకాట శిబిరాలు పెరిగిపోయాయనీ, సివిల్ వివాదాలలో సదరు అధికారి జోక్యం చేసుకొంటున్నారనీ, కొందరి పక్షం వహిస్తూ కూటమి నేతల పేరు వాడుతున్నారనే విషయాలు వెలుగులోకి వచ్చాయిని చెబుతున్నారు. ఇవి రాను రాను శ్రుతిమించడంతో మంగళవారం మధ్యాహ్నం పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీతో ఈ అంశంపై ఉప ముఖమంత్రి పవన్ కల్యాణ్ ఫోన్ లో మాట్లాడారు. తన దృష్టికి వచ్చిన ఫిర్యాదులు ప్రస్తావించి డి.ఎస్.పి. వ్యవహార శైలిపై నివేదిక పంపించాలని స్పష్టం చేశారు. అసాంఘిక వ్యవహారాలకు డి.ఎస్.పి. స్థాయి అధికారి అండగా ఉండటాన్ని తీవ్రంగా పరిగణించాలని, పోలీసులు సివిల్ వివాదాల్లో తలదూర్చకుండా చూడాలన్నారు. ఈ తరహా వ్యవహారాలను కూటమి ప్రభుత్వం ఉపేక్షించదనే విషయాన్ని సిబ్బందికి తెలియచేయాలన్నారు. ప్రజలందరినీ సమదృష్టితో చూసి శాంతిభద్రతలను పరిరక్షించాలని దిశానిర్దేశం చేశారు.
భీమవరం డి.ఎస్.పి.పై వచ్చిన ఆరోపణలను రాష్ట్ర హోమ్ శాఖ మంత్రికీ, రాష్ట్ర డీజీపీకి తెలియచేయాలని తన కార్యాలయ అధికారులను పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఓ డీఎస్పీపై పవన్ కల్యాణ్ ఇంత ఆగ్రహం వ్యక్తం చేయాడనికి బలమైన కారణాలు ఉంటాయని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. జయసూర్య వైసీపీ హయాంలో కృష్ణా జిల్లా గన్నవరం డీఎస్పీగా పని చేశారు.




















