Kandukur Murder Case: కందుకూరు హత్య కేసులో విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు - బాధితులకు భూమి, పరిహారం - చంద్రబాబు ఆదేశం
Kandukur:కందుకూరు హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. బాధితులకు పరిహారం ఇవ్వనున్నారు.

Fast track court in Kandukur murder case: శాంతి భద్రతలపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కందుకూరులో జరిగిన లక్ష్మీ నాయుడు హత్య ఘటనపై కూడా చర్చించారు. ఈ హత్యను చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన అమానుషం, అమానవీయం అని.. లక్ష్మీనాయుడు హత్య కేసు నిందితులకు కఠినంగా శిక్షపడాలని ఆదేశించారు. ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి ఈ వ్యవహారంపై వేగంగా దర్యాప్తు చేయాలన్నారు.
లక్ష్మినాయుడు కుటుంబానికి పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
చనిపోయిన లక్ష్మీ నాయుడు కుటుంబానికి పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. భార్యకు 2 ఎకరాల భూమి, రూ.5 లక్షల నగదు పరిహారం ఇవ్వాలని నిర్మయించారు. ఇద్దరు పిల్లలకు 2 ఎకరాల చొప్పున భూమి, రూ.5 లక్షల చొప్పున ఫిక్స్‌డ్ డిపాటిజ్ చేయాలని సీఎం ఆదేశించారు. లక్ష్మీ నాయుడు పిల్లలను చదివించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. అలాగే కారు దాడిలో గాయపడ్డ పవన్, భార్గవ్‌కు కూడా పరిహారం అందించాలని సీఎం ఆదేశించారు. పవన్‌కు 4 ఎకరాల భూమి, రూ.5 లక్షల నగదుతో పాటు ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. భార్గవ్‌కు రూ.3 లక్షల నగదు, ఆసుపత్రి ఖర్చులు చెల్లించనున్నారు. లక్ష్మీ నాయుడు హత్య కేసు విచారణ వేగంగా జరిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించి.. కోర్టులో కేసు విచారణ కోసం ప్రత్యేక పీపీని నియమించాలని ఆదేశాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు.
ఆర్థిక కారణాలతో జరిగిన హత్యకు కులం జోడించిన రాజకీయం
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కందుకూరు సమీపంలోని గుడ్లూరు మండలం దారకానిపాడు గ్రామంలో దసరా పండుగ రోజు జరిగిన దారుణ హత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. 25 ఏళ్ల తిరుమలశెట్టి లక్ష్మీనాయుడును హరిచంద్రప్రసాద్ అనే వ్యక్తి కారుతో కొట్టి చంపారు. లక్ష్మినాయుడు సోదరులకు కాళ్లు, చేతులు విరిగాయి. ప్రత్యక్ష సాక్షుల సమాచారం ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలకారణంగానే ఈ హత్యలు జరిగాయని పోలీసులు ప్రకటించారు. అయితేఈ ఈ హత్య రాజకీయ, కులాల కుంపటిగా మారింది.
కఠిన చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మృతుడి భార్య తో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని, కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. హోం మంత్రి వంగలపూడి అనిత, మున్సిపల్ మంత్రి పి.నారాయణ, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించారు. వైసీపీ నేతలు కుల హత్యగా మార్చి అలజడి సృష్టించేందుకు ఫేక్ వీడియోలు,ఏఐ వీడియోలు కూడా తయారు చేస్తున్నారని.. వారిపై పోలీసులు కేసులు పెట్టారు.





















