Type-2 Diabetes Risk : స్వీట్స్ కాదు.. రోజూ తింటున్న ఈ ఫుడ్స్ వల్లే షుగర్ పెరుగుతుందట, నిపుణుల హెచ్చరికలు ఇవే
Diabetes Risk : స్వీట్స్ తింటే షుగర్ వస్తుంది అనుకుంటారు. కానీ మీకు తెలుసా? కొన్ని రకాల ఫుడ్స్ కూడా మధుమేహ ప్రమాదాన్ని పెంచుతాయని. అవేంటో డయాబెటిస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూసేద్దాం.

Foods Regularly increases Diabetes Risk : మధుమేహం కేవలం స్వీట్స్ తినడం వల్ల మాత్రమే రాదు.. ఈ విషయం చాలామందికి తెలియదు. స్వీట్స్ ఆపేసినా, తగ్గించినా డయాబెటిస్ రాదు అనుకుంటారు. కానీ రోజువారీ ఆహారపు అలవాట్లు కూడా మధుమేహంతో ముడిపడి ఉంటాయంటున్నారు నిపుణులు. కొన్ని ఆహారాలను తక్కువ అంచనా వేస్తాము కానీ.. అవి తెలియకుండా ప్రమాదకరమైన సమస్యలను శరీరానికి ఇస్తాయి. కాలక్రమేణా రక్తంలో చక్కెరను అదుపులో లేకుండా పెంచుతాయి. దానివల్ల టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ రక్తంలో షుగర్ లెవెల్స్ పెంచే ఆహారాలు ఏంటో.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూసేద్దాం.
డీప్-ఫ్రైడ్ స్నాక్స్
సమోసా, పకోడా, చిప్స్ ఇవన్నీ ఎక్కువమంది ఇష్టంగా తినే స్నాక్స్. కానీ వేయించిన ఫుడ్స్ అనారోగ్యకరమైన కొవ్వుతో నిండి ఉంటాయి. ఈ కొవ్వు నెమ్మదిగా శరీరంలో పేరుకుపోయి.. బరువును పెంచుతుంది. బరువు పెరిగితే ఇన్సులిన్ నిరోధకత కూడా పెరుగుతుంది. ఇది టైప్-2 మధుమేహానికి ప్రధాన కారణం. ఫాస్ట్ ఫుడ్‌లో ఉపయోగించే నూనెను చాలాసార్లు వేడి చేస్తారు. దీని వలన అందులోని ట్రాన్స్ ఫ్యాట్ ఏర్పడుతుంది. ఇది రక్తంలో చక్కెరను మరింత వేగంగా పెంచుతుంది.
గ్రేనోలా, హెల్తీ సెరల్స్
బ్రేక్‌ఫాస్ట్ సమయంలో ఆరోగ్యానికి మంచిదని.. చాలామంది గ్రేనోలా, సెరల్స్ ఎక్కువగా తీసుకుంటారు. కానీ వాటిలో దాగి ఉన్న చక్కెర పరిమాణం మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తుంది. చాలా గ్రేనోలా బార్‌లు, ఓట్ బార్‌లు, సెరల్స్‌లో అదనపు చక్కెర ఉంటుంది. వీటిని చిన్న మెత్తంలో తీసుకున్నా రక్తంలో చక్కెరను వెంటనే పెరుగుతుంది. పదేపదే చక్కెర పెరగడం వల్ల శరీరం ఇన్సులిన్‌పై ఎక్కువగా ఆధారపడుతుంది. ఈ అలవాటు కాలక్రమేణా మధుమేహ ప్రమాదాన్ని పెంచుతుంది.
ప్రాసెస్ చేసిన మీట్
సాసేజ్, బేకన్, సలామీ వంటి ప్రాసెస్ చేసిన మాంసాలలో సోడియం, నైట్రేట్‌లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ మూలకాలు గుండెకు చెడు చేయడమే కాకుండా.. మధుమేహంతో నేరుగా సంబంధం కలిగి ఉన్నాయని పరిశోధనలు చెప్తున్నాయి. ప్రాసెస్ చేసిన మాంసం శరీరంలో మంటను పెంచుతుంది. జీవక్రియను తగ్గిస్తుంది. దీని కారణంగా రక్తంలో చక్కెరను నియంత్రించడం కష్టమవుతుంది.
సోడా, స్వీట్ డ్రింక్స్
కోల్డ్ డ్రింక్స్, ప్యాక్ చేసిన సోడాలలో చక్కెర శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక సోడా డబ్బాలో ఉండే చక్కెర.. ఎక్కువరోజులు స్వీట్స్ తినడం కంటే ఎక్కువ. ఇటువంటి పానీయాలు వెంటనే గ్లూకోజ్‌ను పెంచుతాయి. ప్యాంక్రియాస్‌పై నిరంతరం ఒత్తిడిని కలిగిస్తాయి. ప్రతిసారీ స్వీట్ డ్రింక్ తాగినప్పుడు.. శరీరం అదనపు ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయాల్సి వస్తుంది. దీని వలన కాలక్రమేణా ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది.
వైట్ బ్రెడ్, మైదాతో చేసిన ఫుడ్స్
మైదాతో చేసిన వంటలు అంటే వైట్ బ్రెడ్, బన్, కుకీలు, నాన్ చాలా త్వరగా గ్లూకోజ్‌గా విచ్ఛిన్నమవుతాయి. మైదాలో ఫైబర్ ఉండదు. దీని కారణంగా ఇది రక్తంలో చక్కెరను వెంటనే పెంచుతుంది. పదేపదే అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారం తీసుకోవడం వల్ల శరీరం రక్తంలో చక్కెరను సమతుల్యం చేయడానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఈ అలవాటు నెమ్మదిగా మధుమేహం ప్రమాదాన్ని పెంచుతుంది.
వైట్ రైస్
తెల్లటి బియ్యం ఆహారంలో తీసుకునే ముఖ్యమైన భాగం. కానీ వీటిని పూర్తిగా శుద్ధి చేసి తీసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్ శాతం ఎక్కువగా ఉంటుంది. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా ఎక్కువ. అంటే ఇది తిన్న వెంటనే గ్లూకోజ్‌గా మారి నేరుగా రక్తంలో చక్కెరను పెంచుతుంది. రోజూ పెద్ద మొత్తంలో అన్నం తినడం వల్ల బరువు పెరుగుతారు. చక్కెర నియంత్రణ దెబ్బతింటుంది. దీనివల్ల టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం మరింత పెరుగుతుంది.
కాబట్టి ఈ ఫుడ్స్‌ని రెగ్యులర్‌గా కాకుండా వన్స్ ఇన్ ఏ వెయిల్ అన్నట్టు అప్పుడప్పుడు తక్కువ మోతాదులో తీసుకోవచ్చు. వీటికి ఆల్ట్రనేటివ్, హెల్తీ స్నాక్స్‌తో రిప్లేస్ చేయవచ్చు. వైట్ రైస్‌ని పూర్తిగా మానేయలేకపోతే.. తక్కువ మోతాదులో తీసుకోవచ్చు. లేదా బ్రౌన్ రైస్‌తో భర్తీ చేయవచ్చు. స్వీట్స్ తగ్గించడంతో పాటు ఆహారంలో ఈ మార్పులు చేస్తూ.. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉంటూ.. వ్యాయామం చేస్తూ ఉంటే మధుమేహం రాకుండా చూసుకోవచ్చు. అలాగే మధుమేహ సమస్యలను దూరం చేసుకోవచ్చు.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.






















