MLA Balayya: ఎమ్మెల్యే బాలకృష్ణ మిస్సింగ్..! ఇంకో ఇద్దరు కూడా.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు, అసలు సంగతేంటంటే..
హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళనల్లో మద్దతు పలికేందుకు ప్రజా ప్రతినిధులు కనిపించడం లేదని బీజేపీ నేతలు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కనిపించడం లేదంటూ ఆ నియోజకవర్గ రాజకీయ నాయకులు కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేవలం బాలయ్య మాత్రమే కాకుండా ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ ఆచూకీ కూడా తెలియడం లేదంటూ స్థానిక బీజేపీ నాయకులు హిందూపురం వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల వ్యవహారం ప్రధానంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జిల్లాల పేర్లు, జిల్లాల పేర్లను ప్రభుత్వం ఖరారు చేసింది. ఆయా జిల్లాల ఏర్పాటుకు సీఎం జగన్ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.
అయితే, ఈ కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్న వారు ఎంత మంది ఉన్నారో.. కాస్త అసంత్రుప్తితో ఉన్న వారూ ఉన్నారు. తమ ప్రాంతాన్ని కూడా జిల్లా చేయాలని కొన్ని చోట్ల డిమాండ్లు చేస్తున్నారు. ఇలా కొత్త జిల్లాల ఏర్పాట్లపై ఆందోళన చేస్తున్నారు. ఇలాగే అనంతపురం జిల్లాలోనూ జిల్లాల పునర్విభజనపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పుట్టపర్తి కేంద్రంగా ప్రభుత్వం సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అయితే, ఆ నిర్ణయాన్ని హిందూపురం నియోజకవర్గ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ప్రజలు గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అయితే, ఈ ఆందోళనల్లో మద్దతు పలికేందుకు స్థానిక ప్రజా ప్రతినిధులు కనిపించడం లేదని హిందూపురం బీజేపీ నేతలు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ ఆచూకీ లేదని పోలీసులకు ఫిర్యాదు చేసి నిరసన తెలిపారు. వారు జిల్లాల పునర్విభజనపై స్పందించడం లేదని.. నిరసనకు మద్దతు చెప్పడం లేదని బీజేపీ నేతలు ఆరోపించారు. దీంతో నిరసన కారులు ప్రజా ప్రతినిధులు కనబడటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా.. వీరిలో ఏ ఒక్కరూ స్పందించడం లేదని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వారంతా బయటికి వచ్చి, వెంటనే పదవులకు రాజీనామా చేసి, హిందూపురం జిల్లా ఏర్పాటు కోసం జరుగుతున్న ప్రజా ఉద్యమంలో పాల్గొనాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.
Also Read: KCR Family: ముఖ్యమంత్రి ఫ్యామిలీలో విషాదం.. సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
Also Read: Sangareddy: సంగారెడ్డిలో టీఆర్ఎస్ లీడర్ దారుణ హత్య.. తల, మొండెం వేర్వేరు చోట్ల.. కారణం ఏంటంటే..