Heavy Rains: రాష్ట్రంలో దంచి కొడుతున్న వర్షాలు - ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Andhra News: బంగాళాఖాతంలో వాయుగుండం బలహీనపడే క్రమంలో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రకాశం, గుంటూరు, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
Heavy Rains In AP: వాయుగుండం ప్రభావంతో ఏపీవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వానలతో రాష్ట్రంలో జనజీవనం స్తంభించింది. విజయవాడ నగరం పూర్తిగా నీట మునిగింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం అర్ధరాత్రి కళింగపట్నం సమీపంలో తీరం దాటిందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాసరావు తెలిపారు. తీరం దాటిన వాయుగుండం జగదల్ పూర్‌కు ఆగ్నేయంగా 60 కిలోమీటర్లు, విశాఖకు వాయువ్యంగా 120 కిలోమీటర్ల దూరంలో ఉందని వెల్లడించారు. ఇది క్రమంగా దక్షిణ ఒడిశా - విదర్భ చేరుకుని బలహీనపడుతుందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో ఆది, సోమవారాల్లో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ క్రమంలో పల్నాడు, ఎన్టీఆర్, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ జారీ చేశారు. అటు, ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించారు.
అటు, ఉత్తరాంధ్ర తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని.. ఈ రెండు రోజులు మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. గడిచిన 24 గంటల్లో అమరావతిలో 26 సెం.మీ, తిరువూరులో 25, గుంటూరు 23, తెనాలి 18, మంగళగిరి 17, విజయవాడ 17.5 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.
ప్రభుత్వం అప్రమత్తం
మరోవైపు, భారీ వర్షాల క్రమంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోన్న సీఎం చంద్రబాబు అధికారులు తగు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అందరూ సమన్వయంతో పని చేయాలని సూచించారు. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. భారీ వరదలోనే బోటులో ప్రయాణిస్తూ బాధితులను పరామర్శించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉద్ధృతిని పరిశీలించారు. భద్రతా సిబ్బంది వారిస్తున్నా వినకుండానే ఆయన బోటులోనే వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించారు. సింగ్ నగర్ నుంచి గండి పూడ్చడంపై అధికారులతో మాట్లాడి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ప్రాణనష్టం జరగకుండా చూడాలని సూచించారు. అటు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో నిరంతరం పర్యటిస్తూ బాధితులకు ఆహారం, తాగునీరు అందేలా చర్యలు చేపడుతున్నారు.
నిలిచిన రాకపోకలు
ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలతో రోడ్లన్నీ జలమయం కాగా.. తెలంగాణ - ఏపీ మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇరు రాష్ట్రాల సరిహద్దు రామాపురం వద్ద చిమిర్యాల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండగా.. కోదాడ నుంచి వరద నీరు దిగువకు ప్రవహిస్తోంది. నల్లబండగూడెం వద్ద జాతీయ రహదారిపైకి నీరు చేరింది. ఈ క్రమంలో అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు, వరదల దృష్ట్యా విజయవాడ - హైదరాబాద్ మధ్య తిరిగే ఆర్టీసీ బస్సులు దారి మళ్లించారు. విజయవాడ నుంచి గుంటూరు, పిడుగురాళ్ల మీదుగా హైదరాబాద్‌కు ఆర్టీసీ బస్సులు మళ్లించారు. ఆ రూట్‌లో వరద తగ్గడంతో ఈ దారిలో బస్సులు తిప్పేందుకు అనుమతి ఇచ్చారు. అటు, విజయవాడ - హైదరాబాద్ హైవేపై ఐతవరం వద్ద వరద నీరు ఇంకా ప్రవహిస్తుండగా.. బస్సులు నడిపే పరిస్థితి లేకపోవడంతో ఆ రూట్‌లో బస్టాండ్లలో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.
స్కూళ్లకు సెలవు
వర్షాల క్రమంలో ఏపీ, తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు సెలవులు ప్రకటించాయి. కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు సెలవులు ప్రకటించడం లేదని అలాంటి వాటిపై చర్యలు తప్పవని విద్యా శాఖ హెచ్చరించింది.