(Source: ECI/ABP News/ABP Majha)
Trains Cancellation: 'దయచేసి వినండి' - గోదావరి ఎక్ర్ ప్రెస్ రద్దు, విశాఖ ఎక్స్ ప్రెస్ ఆలస్యం, మరిన్ని రైళ్లు రద్దు చేసిన ద.మ రైల్వే
SCR: భారీ వర్షాలతో విశాఖ - హైదరాబాద్ - విశాఖ గోదావరి ఎక్స్ ప్రెస్ రైలుతో పాటు మరో 19 రైళ్లను రద్దు చేసినట్లు ద.మ రైల్వే ప్రకటించింది. అటు, విశాఖ ఎక్ర్ ప్రెస్‌ను రీషెడ్యూల్ చేశారు.
SCR Cancelled Trains Due To Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. వర్ష బీభత్సంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇప్పటికే ఆది, సోమ వారాల్లో పలు రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) కొన్ని సర్వీసులను దారి మళ్లించింది. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. తాజాగా, గోదావరి ఎక్స్ ప్రెస్ (Godavari Express) సహా 19 రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఆదివారం సాయంత్రం బయలుదేరాల్సిన విశాఖ - హైదరాబాద్ - విశాఖ (12727/12728) గోదావరి రైలుతో పాటు మరో 19 రైళ్లను రద్దు చేస్తున్నట్లు తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. వానలకు కొన్ని చోట్ల పట్టాలపైకి నీరు చేరిన క్రమంలో పలు రైళ్లను దారి మళ్లించారు. సికింద్రాబాద్ - భువనేశ్వర్ మధ్య నడిచే విశాఖ ఎక్స్‌ప్రెస్ (17016) (Visakha Express) రైలును రీ షెడ్యూల్ చేశారు. ఈ రైలు ఆదివారం సాయంత్రం 4:50 గంటలకు బదులుగా సాయంత్రం 06:50 గంటలకు షెడ్యూల్ చేసినట్లు తెలిపారు. మరోవైపు, ద.మ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తాజా పరిస్థితిపై అధికారులతో సమీక్ష చేశారు. రైలు సర్వీసుల పునరుద్ధరణ, భద్రతాపరమైన చర్యలకు సంబంధించి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలో సమీక్షించారు. భారీ వర్షాల క్రమంలో ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టినట్లు వివరించారు.
రద్దైన రైళ్ల వివరాలు
Bulletin No. 13 - SCR PR No. 336 on "Cancellation/Diversion of Trains due to Heavy Rains" pic.twitter.com/KN7BB5BYqz
— South Central Railway (@SCRailwayIndia) September 1, 2024
Bulletin No. 12 - SCR PR No. 335 on "Cancellation/Diversion of Trains due to Heavy Rains" pic.twitter.com/q0g4ixVNNl
— South Central Railway (@SCRailwayIndia) September 1, 2024
ఈ రైళ్లు సైతం
మరోవైపు, విజయవాడ డివిజన్ పరిధిలో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఆది, సోమవారాల్లో దాదాపు 30 రైళ్లు రద్దు కాగా.. మరికొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. సింహాద్రి, మచిలీపట్నం, గంగా - కావేరి, సంఘమిత్ర, గౌతమి, చార్మినార్, యశ్వంత్‌పూర్ రైళ్లను నిలిపేశారు. అటు సికింద్రాబాద్ - గుంటూరు (17202), విశాఖ - సికింద్రాబాద్ (20708) రైళ్లు రద్దు చేసినట్లు చెప్పారు. విజయవాడ - సికింద్రాబాద్ - విజయవాడ (12713/12714), గుంటూరు - సికింద్రాబాద్ (17201), సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్ (17233), సికింద్రాబాద్ - గుంటూరు - సికింద్రాబాద్ (12705/12706) రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. అటు, తిరుపతి - కరీంనగర్ (12761), విశాఖ - న్యూఢిల్లీ (20805) రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు.
రైళ్ల రద్దుతో ప్రయాణికుల అవస్థలు
వర్షాలతో పలు రైళ్లు రద్దు చేయగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడతో పాటు రాయనపాడు రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ఈ క్రమంలో స్టేషన్‌లో రద్దీ నెలకొంది. వృద్ధులు, చిన్నారులు అవస్థలు పడుతున్నారు. రైల్వే అధికారులు స్టేషన్‌లోనే ప్రయాణికులకు భోజన ఏర్పాట్లు చేశారు. వర్షాలతో ట్రాక్స్ దెబ్బతిన్న చోట్ల సిబ్బంది పునరుద్ధరణ పనులు చేపట్టారు. వర్షాల తీవ్రతను బట్టి రైళ్ల రద్దును మరో రెండు మూడు రోజులు పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.