Cyclone Gulab Live Updates: జేఎన్‌టీయూ పరిధిలో సెప్టెంబర్ 29న జరగాల్సిన పరీక్షలు వాయిదా
గులాబ్ తుఫాన్ తీరంలో కల్లోలం సృష్టిస్తోంది. ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో తీరాన్ని తాకిన గులాబ్. 11 గంటలకు పూర్తిగా తీరాన్ని దాటింది.
LIVE
Background
గులాబ్ తుపాను, భారీ వర్షాల కారణంగా తెలంగాణ శాసన సభ వర్షకాల సమావేశాలకు మూడు రోజుల పాటు విరామం ప్రకటించారు. అధికారులు, శాసన సభ్యులు సహాయక చర్యల్లో పాల్గొనాల్సి ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో తిరిగి అక్టోబర్ 1న శాసన సభ, శాసన మండలి సమావేశాలు పున ప్రారంభం కానున్నాయి.
జేఎన్‌టీయూహెచ్ పరిధిలో సెప్టెంబర్ 29న జరగాల్సిన పరీక్షలు వాయిదా
జేఎన్‌టీయూహెచ్ పరిధిలో సెప్టెంబర్ 29న జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో రేపు నిర్వహించాల్సిన ఇంజినీరింగ్, ఫార్మసీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు అదికారులు తెలిపారు. వాయిదా వేసిన పరీక్షలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఓ ప్రకటనలో వెల్లడించారు. సెప్టెంబర్ 30 నుంచి జరగాల్సిన పరీక్షలు యథాతథంగా జరుగుతాయని పేర్కొన్నారు.
అనకాపల్లి మండలం కొప్పాక వద్ద ఏలేరు కాల్వ ఓవర్ ఫ్లో
తుఫాను కారణంగా అనకాపల్లి మండలం కొప్పాక వద్ద ఏలేరు కాల్వ ఓవర్ ఫ్లో అయింది. తద్వారా జాతీయ రహదారిలో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. అనకాపల్లి రూరల్ పోలీసులు గండి కొట్టి వరద ఉధృతి కంట్రోల్ చేశారు.
ప్రకాశం బ్యారేజీ నుంచి నీరు విడుదల
ప్రకాశం బ్యారేజీ నుంచి 1,72,069 క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు. తూర్పు, పశ్చిమ కాల్వలకు 4,959 క్యూసెక్కులు విడుదల చేశారు. బ్యారేజీ నుంచి సముద్రంలోకి 1,67,110 క్యూసెక్కులు విడుదల అయ్యాయి. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీలో 3.07 టీఎంసీల పూర్తిస్థాయి నీటినిల్వ ఉంది. ఎగువ నుంచి వస్తున్న నీటిని యథాతథంగా దిగువకు విడుదల చేస్తున్నారు.
విశాఖ జిల్లాలో వర్షాలు
గులాబ్ తుపాను ఎఫెక్ట్ తో విశాఖ జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. చోడవరంలోని వినాయక ఆలయం గర్భగుడిలోకి వర్షపు నీరు ప్రవేశించింది. గర్భగుడి నుంచి నీటిని అర్చకులు బయటకు తోడుతున్నారు. చోడవరంలో 1,256 ఎకరాల్లోని పంట నీట మునిగింది.
ఎడతెరిపి లేని వర్షాలకు పెరిగిన నీటిమట్టాలు
విశాఖ సీలేరు కాంప్లెక్స్‌లోని డొంకరాయి జలాశయానికి వరద ఉద్ధృతి పెరిగింది. డొంకరాయి జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. డొంకరాయి జలాశయం 2 గేట్లు ఎత్తి 6,300 క్యూసెక్కులు విడుదల చేశారు.