Cyclone Gulab Live Updates: తీరాన్ని తాకిన గులాబ్ తుపాను... భారీగా ఈదురుగాలులు
ఒడిశాతో పాటు, ఉత్తరాంధ్ర జిల్లాలకు గులాబ్ తుపాన్ ముప్పు పొంచి ఉంది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది.
LIVE
Background
బంగాళాఖాతంలో శుక్రవారం ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండగా మారిన సంగతి తెలిసిందే. అది మరింత బలపడి శనివారం సాయంత్రానికి తుపాన్‌గా మారింది. దీనికి గులాబ్‌గా నామకరణం చేశారు. ఇది ప్రస్తుతం ఒడిశాలోని గోపాలపూర్‌కు 310 కి.మీ, శ్రీకాకుళం జిల్లాలో కళింగపట్నానికి 380 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఒడిశాతో పాటు, ఉత్తరాంధ్ర జిల్లాలకు గులాబ్ తుపాన్ ముప్పు పొంచి ఉంది.
శ్రీకాకుళం జిల్లాలో 1358 మంది పునరావాస కేంద్రాలకు తరలింపు
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా గులాబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ తెలిపారు. 13 మండలాల్లో 61 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఇప్పటికే 38 పునరావాస కేంద్రాల్లోకి 1358 మందిని తరలించామన్నారు. వారికి వైద్యం, భోజనం, ఇతర ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. గార మండలంలోని ఎస్.మత్స్యలేశం, మొగదలపాడు, నగిరెడ్లపేట తుపాను సురక్షిత కేంద్రాలతో పాటు బందరువానిపేట జిల్లా పరిషత్ హై స్కూల్లో 500 మందికి పునరావాసం కల్పించామని పేర్కొన్నారు.
గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల్లో నలుగురు క్షేమం... లభ్యం కాని ఇద్దరి ఆచూకీ
ఆదివారం మధ్యాహ్నం అక్కుపల్లి సముద్ర ప్రాంత సరిహద్దుల్లో గల్లంతైన మంచినీళ్లపేట గ్రామానికి చెందిన ఆరుగురు మత్స్యకారుల్లో ముగ్గురు మత్స్యకారులు ఎలుకల పాపారావు, వంక చిరంజీవి, కొండ బీమారావు సురక్షితంగా అక్కుపల్లి సముద్ర తీరానికి చేరుకున్నామని రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. ప్రస్తుతం ఆచూకీ తెలియని పిట్ట హేమారావు బోటులోనే ఉండే అవకాశం ఉంటుందని పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. నేవీ అధికారులు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన మత్స్యకారుల్లో మృతిచెందడనుకున్న వంక నాయకన్న ప్రాణాలతో సముద్ర తీరం చేరుకున్నారు. మంత్రి అప్పలరాజు ఆదేశాల మేరకు ఇచ్చాపురం నుంచి భవనపాడు వరకు తీరప్రాంతాలలో మత్స్యకారులు గాలింపు చేపట్టారు. బోట్ ఫ్యాన్ కాలికి తగిలి వంకనాయకన్నకు గాయం అయింది. ఆయన్ని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు అంటున్నారు.
తీరాన్ని తాకిన గులాబ్ తుపాను
ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య గులాబ్ తుపాను తీరాన్ని తాకింది. కళింగపట్నానికి 25 కి.మీ. దూరంలో తుపాను తీరాన్ని తాకింది. తుపాను పూర్తిగా తీరం దాటేందుకు 3 గంటల సమయం పడుతుందని వాతావరణశాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర తీరం వెంబడి 75-95 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి.
తీరాన్ని తాకిన గులాబ్ తుపాను
గులాబ్ తుపాను తీరాన్ని తాకే ప్రక్రియ ప్రారంభమైందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. మరో మూడు గంటల్లో తీరాన్ని తాకే ప్రక్రియ పూర్తవుతుందని వెల్లండించింది. శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నానికి 25 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైనట్లు ఐఎండీ తెలిపింది. ప్రస్తుతం తీర ప్రాంతాల్లో 75-85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని తెలిపింది. తుపాను తీరం దాటే సమయంలో 95 కి.మీ.వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
విజయనగరం జిల్లాపై గులాబ్ తుపాన్ ప్రభావం
విజయనగరం జిల్లాలో గులాబ్ తుఫాన్ ప్రభావంతో నేటి ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య 20.2 మీ.మీ సరాసరి వర్ష పాతం నమోదైంది. పార్వతీపురంలో అత్యధికంగా 33.4 మీ.మీ, పాచిపెంటలో అత్యల్పంగా 5 మీ.మీ.ల సరాసరి వర్షపాతం నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. ఆదివారం 4 గంటల నుంచి 5 గంటల మధ్య వేపాడలో 7 మీ.మీ, రామభద్రపురంలో 5.6 మీ.మీ., కొత్తవలసలో 5.2 మీ.మీ. వర్షం కురిసింది. తుఫాన్ ఆదివారం అర్ధరాత్రి తీరం దాటే అవకాశం ఉందని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఆ సమయంలో 80 కి.మీ. వేగంతో భారీ ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందన్న వాతావరణ శాఖ తెలిపింది. హెచ్చరికల నేపథ్యంలో ప్రజలంతా ఇళ్ల విడిచి బయటకు రావొద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు తెలిపారు.