AP Liquor Scam:2022 నాటి కల్తీ మద్యం మరణాలపై మళ్లీ విచారణ - లిక్కర్ కేసుకు లింక్ - ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం
Jangareddy Gudem Deaths: 2022లో జంగారెడ్డి గూడెం కల్తీ మద్యం మరణాలపై విచారణకు ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ నియమించింది. ఎస్పీ కిషోర్ నేతృత్వంలో విచారణ జరుపుతారు.

Government appoints task force to probe Jangareddy Gudem deaths: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2022లో జంగారెడ్డి గూడెంలో దాదాపుగా ఇరవై మంది అసహజంగా చనిపోయారు. అవి కల్తీ మద్యం మరణాలు అని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. అయితే ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించింది. అప్పట్లో జరిగిన అసహజ మరణాల కేసులపై పూర్తి వివరాలు సేకరించి..దర్యాప్తు చేసేందుకు ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ను నియమించారు. ఆ మరణాలన్నీ కల్తీ మద్యం కారణంగా అనే అనుమానాలు ఉన్నందున పూర్తి స్థాయిలో అధ్యనం చేయాలని ఆదేశించారు. టాస్క్ ఫోర్స్ చీఫ్గ్ గా ఏలూరు ఎస్పీ కిషోర్ ను నియమించారు. మృతుల పోస్టు మార్టం రిపోర్టులను పరిశీలించి వీరు ఎలా చనిపోయారో ..అసలు ఈ మరణాల మిస్టరీ ఏమిటో బయటకు తీయనున్నారు.
2022లో జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం తాగిన చాలా మంది తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వీరిలో కొందరు ఆసుపత్రులలో చికిత్స పొందుతూ మరణించారు. వరదరాజులు అనే వ్యక్తి మరణం కలకలం రేపింది. ఈ వ్యక్తి కల్తీ సారా వల్ల మరణించాడని ఆరోపణలు వచ్చాయి. అయితే పించగా, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వం పోస్టు మార్టం చేయించింది. అతని మరణం బ్రెయిన్ హెమరేజ్ వల్ల సంభవించినట్లు నిర్ధారించారని రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. బాధితులు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల నుండి, తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన కార్మికులు , రైతులు. మద్యంలో విషపూరితమైన మిథైల్ ఆల్కహాల్ కలపడం వల్ల ఈ ఘటనలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి.
కల్తీ మద్యం కారణంగానే ఈ మరణాలు జరిగాయన్న టీడీపీ ఆరోపణల్ని వైసీపీ తోసిపుచ్చింది. జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తయారీ జరగడం లేదని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటిచారు. TDP నేతలు బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. విచారణ కోసం డిమాండ్ చేశారు. కల్తీ నాటు మద్యం తాగడం వల్ల సంభవించిన మరణాలు ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ మద్యం నియంత్రణపై తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రతిపక్షం 27 మరణాలు జరిగినట్లు ఆరోపించగా, ప్రభుత్వం కొన్ని మరణాలను ఇతర కారణాలతో ముడిపెట్టింది. సంఘటన తర్వాత, పోలీసులు 33 కేసులు నమోదు చేసి, 22 మందిని అరెస్టు చేశారు. కానీ ఇప్పుడు లిక్కర్ కేసు విచారణ కీలక దశలో ఉన్నప్పుడు ఈ టాస్క్ ఫోర్స్ వేయడం ఆసక్తికరంగా మారింది.
వైసీపీ హయాంలో తయారు చేసిన అమ్మిన లిక్కర్ అంతా కల్తీనేనని టీడీపీ ఆరోపిస్తోంది. గతంలో ల్యాబ్ టెస్టులు కూడా బయట పెట్టింది. ఇప్పుడు టాస్క్ ఫోర్స్ దర్యాప్తులో అవన్నీ కల్తీ మద్యం మరణాలేనని పోస్టుమార్టం, ఇతర సాంకేతిక ఆధారాల ద్వారా బయట పెడితే.. ఈ కేసులో నిందితులపై మరింత కఠినమైన సెక్షన్లు నమోదు చేసి అదనపు కేసులు పెట్టే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.






















