Gannavaram Slow Down : రేంజ్ ఇంటర్నేషనల్ కానీ డొమెస్టిక్ సర్వీసులే కష్టం ! గన్నవరం ఎయిర్‌పోర్టుకు కష్టాలెందుకు..?
రెండేళ్ల కిందటి వరకూ 60 విమానాల రాకపోకలతో బిజీగా ఉండే గన్నవరం ఎయిర్‌పోర్టులో ఇప్పుడు కార్యకలాపాలు తగ్గిపోయాయి. ప్రయాణికులు లేరని పలు సంస్థలు సర్వీసులు నిలిపివేస్తున్నాయి.
విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా విదేశాలకు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇక గల్ఫ్ వెళ్లాలన్నా.. ఇతర దేశం వెళ్లాలన్నా హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు వెళ్లాల్సిన అవసరం లేదు అని జూలైలో భారీ రన్‌వే ప్రారంభం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్పుకున్నారు. దానికి తగ్గట్లుగా ఖతార్ కు విమాన సర్వీస్‌కు బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. అయితే నెల తిరగకముందే అంతర్జాతీయ సర్వీసుల సంగతేమో కానీ.. అసలు డొమెస్టిక్ సర్వీసులు కూడా ఆగిపోతున్నాయన్న సమాచారం బయటకు వచ్చింది. స్పైస్ జెట్ సర్వీసుల్ని నిలిపివేసింది.
రాష్ట్ర విభజన తర్వాత గన్నవరం ఎయిర్ పోర్ట్ కు 2017 మే 3వ తేదీన కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ హోదా కల్పించింది. కానీ ఒక్క సర్వీసును కూడా ప్రారంభించలేదు. ఏపీ ప్రభుత్వం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ విధానంతో ఇండిగో ఒప్పందం చేసుకుని సింగపూర్ సర్వీస్ ను నడిపించింది. అంటే సగం కన్నా తక్కువ సీట్లు బక్ అయితే... ఆ మొత్తం ఏపీ ప్రభుత్వం చెల్లించాలి. సగం కన్నా ఎక్కువ టిక్కెట్లు బుక్ అయితే చెల్లించాల్సిన అవసరం లేదు. 180 మంది సీటింగ్ ఉన్న ఇండిగో విమానాన్ని నడపింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నిలిపివేసింది. అయితే అప్పటి వరకూ వయబిలిటీ ఫండింగ్ చేయాల్సిన అవసరం ఏపీ ప్రభుత్వానికి రాలేదు. అలా ప్రారంభమైన అంతర్జాతీయ సర్వీస్ ఆగిపోయింది.
అయితే ఎయిర్‌పోర్టు రన్‌వేను భారీ విమానాల రాకపోకల కోసం విస్తరించారు. విశాఖ కన్నా అతి పెద్ద రన్‌వే విజయవాడ ఎయిర్‌పోర్టులో ఉంది. గన్నవరంలోని కొత్త రన్ వేపై బోయింగ్, ఎయిర్‌బస్ ఎ350 వంటి భారీ విమానాలు రాకపోకలు సాగించవచ్చు. సింగపూర్‌తో ఆగిపోయిన అంతర్జాతీయ సర్వీసును ఇటీవల రన్‌వే ప్రారంభించిన తర్వాత ఎయిరిండియా ఒమన్ రాజధాని మస్కట్‌కు డైరెక్ట్ విమాన సర్వీస్‌లను ప్రారంభించనుంది. ప్రతి వారం ఓ సర్వీస్ ఉంటుంది. ఇక మళ్లీ మహర్దశ వచ్చిందిలే అనుకునేలోపు స్పైస్ జెట్ బ్యాడ్ న్యూస్ చెప్పింది. నిజానికి ఇలా సర్వీసులు నిలిపివేంది ఒక్క స్పైస్ జెట్ మాత్రమే కాదు పలు కంపెనీలు ఉన్నాయి. రెండేళ్ల కిందటి వరకూ రోజుకు అరవై విమానాలు రాకపోకలు ఎయిర్‌పోర్టుకు వచ్చేవి. ఇప్పుడు కేవలం పదహారు విమానాలకే పరిమితమైంది.
రెండేళ్ల కిందటి వరకూ విజయవాడ నుంచి దేశంలోని అన్ని ప్రధాన విమానాశ్రయాలకూ విమానాల రాకపోకలు ఉండేవి. గంటకు ఓ విమానం ల్యాండయి.. మరో విమానం టేకాఫ్ అయ్యేది. అంత బిజీగా ఉండే ఎయిర్‌పోర్టులో ఇప్పుడు విమానాల చప్పుడు కనిపించడం లేదు. ప్రస్తుతం రోజుకు ఎనిమిది విమానాలు మాత్రమే వస్తున్నాయి. ఆ ఎనిమిది విమానాలే మళ్లీ గాల్లోకి ఎగురుతున్నాయి. 30 శాతం కూడా ఆక్యుపెన్సీ ఉండకపోవడం వల్ల భారీ నష్టాలను మూటగట్టుకోవాల్సి వస్తుందన్న కారణంగా నిలిపివేసింది. ఇక చిన్న విమానయాన సంస్థలైన ట్రూజెట్, అలయెన్స్ ఎయిర్‌లు కూడా తమ సర్వీసుల్ని నిలిపివేశాయి. కేంద్ర ప్రభుత్వం ఉడాన్ అనే పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకం కింద చిన్న నగరాలకు విమాన సర్వీసులు తక్కువ ధరలకు నడుపుతారు. ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇవ్వాల్సి ఉంటుంది. అదే సమయంలో ఏపీలో వ్యాపార కార్యకలాపాలు తగ్గిపోయాయి. అమరావతి నిలిచిపోవడం.. కరోనా కారణంగా పెట్టుబడిదారులు కూడా వెనుకాడటంతో ఇప్పుడు మళ్లీ పాత స్థితికి చేరింది.