Pitapuram TDP : పిఠాపురం టీడీపీ నేతల ఆందోళన - వర్మకే టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ !
Andhra News : పిఠాపురంలో పవన్ పోటీ చేస్తానని ప్రకటించడంతో టీడీపీ నేతల్లో అసంతృప్తి ప్రారంభమయింది. వర్మ శుక్రవారం కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు.
Pitapuram TDP : జనసేనాని పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయనున్నట్లు గురువారం అధికారికంగా ప్రకటించారు. దీంతో పవన్ కల్యాణ్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. కానీ పిఠాపురం టీడీపీ నేతలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురం నియోజవర్గం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేస్తానని వెల్లడించడంతో పిఠాపురం టిడిపి కార్యాలయం వద్ద ఉద్రక్తత ఏర్పడింది. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత అయిన ఎన్‌వీఎస్‌ఎన్ వర్మకు టికెట్ రాకపోవడంతో ఆయన అనుచరులు ఒక్కసారిగా కోపంతో ఊగిపోయారు. పిఠాపురం నుంచి వర్మకే టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారు. తమ నాయకుడికి టికెట్ ఇవ్వకపోతే ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయమని తేల్చి చెప్పారు. అలాగే కోపంతో ఊగిపోతూ.. టీడీపీ ఫ్లేక్సీలు, జెండాలను తగలబెట్టారు. తమ నాయకుడైన వర్మకే టికెట్ కేటాయించాలని నిరసన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు వర్మ అనుచరులందరూ సంయమనంతో ఉండాలని కోరారు. తన కార్యాచరణను శుక్రవారం ప్రకటిస్తానన్నారు.
టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ పిఠాపురం టికెట్ ను ఆశించారు. పిఠాపురం టికెట్ తనకు వస్తుందని ఆశించారు. ఈ మేరకు కొన్ని రోజులుగా ప్రచారం చేసుకుంటున్నారు కూడా. ఈ పరిస్థితుల్లో పిఠాపురం నుంచి తానే పోటీ చేస్తానని పవన్ కల్యాణ్ ప్రకటించడంతో.. వర్మ మద్దతుదారులు ఆగ్రహానికి లోనయ్యారు. పార్టీ జెండాలు, ఫ్లెక్సీలను తగలబెట్టారు. పిఠాపురం టికెట్ వర్మకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అవసరమైతే వర్మ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వర్మ మద్దతుదారులు టీడీపీ ఆఫీసు ముందు రచ్చ రచ్చ చేశారు. పార్టీ ఆఫీసులో ఉన్న జెండాలు, ఫ్లెక్సీలను తగలబెట్టారు. దీంతో టీడీపీ ఆఫీసు దగ్గర ఉద్రిక్త వాతావరణ నెలకొంది.
వర్మకు 2014లోనూ టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. కాపు సామాజికవర్గం నేతలు ఎక్కువ అని.. ఆ వర్గం వారికి ఇస్తే.. వర్మకు నియోజకవర్గ ప్రజలు అంతా అండగా నిలిచారు. స్వతంత్రంగా పోటీ చేసినా దాదాపుగా యాభై వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. తర్వాత ఆయన టీడీపీ అనుబంధ సభ్యుడిగా కొనసాగారు. 2019లో తెలుగుదేశం పార్టీ హైకమాండ్ ఆయనకే టిక్కెట్ ఇచ్చింది. అయితే ఆయన వైసీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. పొత్తులు లేకపోతే ఈ సారి కూడా వర్మనే పోటీ కిదిగే అవకాశం ఉంది. కానీ పవన్ కల్యాణ్ పోటీ చేయాలనుకోవడంతో ... ఒక్క సారిగా ఆయన అదృష్టం తిరగబడింది.
వర్మను బుజ్జగించేందుకు టీడీపీ హైకమాండ్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పొత్తుల కోసం కొన్ని త్యాగాలు తప్పవని ప్రభుత్వంలో సముచితమైన ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇస్తున్నట్లుగా చెబుతున్నారు. వైసీపీ ఇప్పటికే పిఠాపురంలో అభ్యర్థిగా వంగా గీతను ఖరారు చేశారు. పవన్ పోటీ చేస్తే అభ్యర్థిని మార్చే అవకాశం ఉంది. ఒక వేళ వైసీపీ తరపున ఆఫర్ వస్తే వర్మ ఆ పార్టీ నుంచి పోటీ చేసే చాన్స్ ఉందా లేదా అన్నది రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.