AP School Fee Row : ఏపీలో అతి తక్కువ స్కూల్ ఫీజులు విద్యార్థులకు వరం..! మరి స్కూళ్లకు..?
ఏపీలో ఇంటర్ వరకూ ఫీజులను ఖరారు చేసింది. అతి తక్కువ ఫీజులు నిర్ణయించింది. దీనిపై ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు అసంతృప్తిలో ఉన్నాయి. విద్యారంగం ప్రమాణాలు పడిపోతాయని అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేటు స్కూళ్లలో ఎంతెంత ఫీజులు వసూలు చేయాలో ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి ప్రైవేటు స్కూళ్లు దోపిడి చేస్తున్నాయని చాలా కాలంగా విమర్శలు ఉన్నాయి. అనేక సార్లు న్యాయస్థానాల్లో పిటిషన్లు కూడా వేశారు. కానీ ఎప్పుడూ ప్రభుత్వం ఇంత ఫీజు మాత్రమే వసూలు చేయాలని నిబంధనలు పెట్టలేదు. దీనికి కారణం ప్రైవేటు స్కూళ్లు అన్నీ ఒకేలా ఉండవు. సౌకర్యాల పరంగా భిన్నమైన స్కూళ్లు ఉంటాయి. అయితే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అందరికీ ఒకే రకమైన ఫీజులు నిర్ణయించింది. అయితే ఆ ఫీజులు చాలా తక్కువగా ఉన్నాయని.. వాటితో స్కూళ్లను నడపడం ఎలా సాధ్యమనే విమర్శలు యాజమాన్యాల నుంచి వస్తున్నాయి.
ఏపీలో స్కూల్ ఫీజులు ఇలా..!
స్కూల్ ఫీజులు నియంత్రించేందుకు ఏపీ ప్రభుత్వం పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఏర్పాటు చేశారు. హైకోర్టు రిటైర్డ్ జడ్జి చైర్మన్‌గా ఈ కమిషన్ ఏర్పాటయింది. ఈ కమిషన్ సిఫార్సుల మేరకు ప్రవేటు పాఠశాలలో నర్సరీ నుండి పదవ తరగతి వరకూ. కళాశాలలో ఇంటర్ వరకు ఫీజులను ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న పాఠశాలల్లో ప్రైమరీ విద్యకు రూ.10వేలు, హైస్కూల్ విద్యకు రూ. 12 వేలు, మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పాఠశాలల్లో ప్రైమరీ విద్యకు రూ.11వేలు, హైస్కూల్ విద్యకు రూ.15వేలు, అదే కార్పోరేషన్ పరిధిలో ఉన్న పాఠశాలలకు ప్రైమరీ విద్యకు రూ.12వేల, హైస్కూల్ విద్యకు రూ.18వేలను ప్రభుత్వం నిర్ణయించింది. జూనియర్ కాలేజీల్లో అయితే గ్రామ పంచాయతీల్లో ఎంపీసీ, బైపీసీ విభాగాలకు రూ.15వేలు, ఇతర గ్రూపులకు రూ.12వేలు, మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కళాశాలలకు ఎంపీసీ, బైపీసీలకు రూ.17,500లు, ఇతర గ్రూపులకు రూ.15వేలు, కార్పోరేషన్ల్ పరిధిలో ఉన్న కళాశాలలకు ఎంపీసీ, బైపీసీలకు రూ.20వేలు, ఇతర గ్రూపులకు రూ.18వేలు నిర్ణయించారు.
ఇక ఏ ఇతర ఫీజులూ వసూలు చేయరాదు.. !
ఇప్పటి వరకూ కాలేజీలు, స్కూళ్లు ఫీజు కాకుండా రకరకాల రుసుములు వసూలు చేసేవారు. ఇక నుంచి ఏ ఒక్క ఇతర రుసుమునూ వసూలు చేయలేరు. ట్యూషన్, ప్రాస్పెక్టస్, రిజిస్ట్రేషన్, అడ్మిషన్, ఎగ్జామినేషన్ ఫీ, ల్యాబొరేటరీ ఫీ, స్పోర్ట్సు, కంప్యూటర్ ల్యాబొరేటరీ, లైబ్రరీ, ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీ, స్టూడెంట్ వెల్ఫేర్, స్టూడెంట్ హెల్త్ కేర్, స్టడీ టూర్ తదితర ఫీజులన్నీ ఇందులో కలిపి ఉంటాయి.. విద్యార్థుల రవాణా కోసం బస్సులు ఏర్పాటు చేసి ఉంటే రవాణా చార్జీల కింద కిలోమీటరుకు రూ.1.20 చొప్పున వసూలు చేయాలని తెలిపింది. హాస్టళ్ల ఫీజు నిర్దేశించింది. విద్యార్థులకు హాస్టల్‌లో ఉంటే గరిష్టంగా రూ. 24వేలు మాత్రమే వసూలు చేయాలని జీవోలో పేర్కొన్నారు.
ఇంత తక్కువ ఫీజులతో నిర్వహణ అసాధ్యమంటున్న ప్రైవేటు స్కూల్స్..!
ప్రస్తుతం ఓ మాదిరి కార్పొరేట్ స్కూల్‌లో నర్సరీలో చేర్పించాలన్నా కనీసం రూ. నలభై వేలు వసూలు చేస్తున్నారు. ప్రతీ ఏడాది పెంచుకుంటూ పోతున్నారు. స్కూల‌్ అంటే ఇప్పుడు అనేక రకాల సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుందని .. కేవలం తరగతి గదులు పెట్టి ఒక్కో టీచర్‌ని ఉంచడం విద్యాబోధన కాదని అంటున్నారు. టెక్నికల్‌గా కూడా ఎంతో ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుందని.. ఒక్కో సెక్షన్‌లో పరిమితమైన విద్యార్థుల్ని పెట్టి అందరిపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని చదువులు చెప్పే పరిస్థితి వచ్చిందని గుర్తు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో పదో తరగతి విద్యార్థికి కూడా ఏడాదికి రూ. 18వేలతో చదువు చెప్పడం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. నిర్వహణ ఖర్చులు కూడా రావని అంటున్నారు. ఈ ఫీజులతోనే పాఠాలు చెప్పాలంటే నాణ్యతా ప్రమాణాలు పడిపోతాయని అంటున్నారు. స్కూళ్ల నిర్వహణ భారమై మూతపడుతాయని అంటున్నారు.
జమాఖర్చులు చూపిస్తే ఫీజులు పెంచుకునే చాన్సిస్తామంటున్న ప్రభుత్వం..!
అయితే ప్రభుత్వం మాత్రం తల్లిదండ్రులతో పాటు 90 శాతానికి పైగా ప్రైవేటు విద్యాసంస్థల నిర్వాహకులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని ప్రకటించింది. పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ మీడియా సమావేశం పెట్టి మరీ ఈ విషయం ప్రకటించారు. ఫీజులు సరిపోవని అనుకుంటే పెంచాలని కమిషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని ఆఫర్ ఇచ్చారు. ఏ విద్యా సంస్థకైనా తమకు ఆ ఫీజు చాలదని భావిస్తే 15 రోజుల్లో జమా ఖర్చులకు సంబంధించిన అన్ని రికార్డులతో కమిషన్‌కు దరఖాస్తు చేయవచ్చు. దాన్ని పరిశీలించి కమిషన్ సానుకూల పరిష్కారం చూపిస్తుందని ప్రకటించారు. అంటే కొన్ని విద్యా సంస్థలకు ఫీజులు పెంచుకునే అవకాశం ప్రభుత్వం కల్పించబోతోందన్నమాట.
రాజకీయ ప్రత్యర్థుల వేటకు విద్యారంగాన్ని నాశనం చేస్తున్నారని విపక్షాల విమర్శలు..!
కరోనా కారణంగా స్కూళ్లు నడవక అప్పుల పాలై కర్నూలు జిల్లాలో ఓ ప్రైవేటు స్కూల్ ఓనర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ప్రైవేటు స్కూల్ యాజమాన్యాల దుస్థితిని తెలిచేసతోందని రాజకీయ పార్టీలు అంటున్నాయి. ఇలాంటి సమంయలో అతి తక్కువ ఫీజులు నిర్ణయించడం వల్ల విద్యా ప్రమాణాలు మరింత పడిపోతాయని అంటున్నారు. ఏపీలో విద్యారంగం ఎక్కువగా తెలుగుదేశం పార్టీ నేతల చేతుల్లోనే ఉందని.. వారిని దెబ్బకొట్టాడనికే ఈ ఫీజులు ఖరారు చేశారన్న ఆరోపణలను టీడీపీ నేతలు వినిపిస్తున్నారు. ఏపీలో అడుగడుగునా కనిపించే నారాయణ గ్రూప్ స్కూల్స్ .. మాజీ మంత్రి నారాయణ కుటుంబానికి చెందినవి. అలపాటి రాజేంద్రప్రసాద్ సహా అనేక మంది టీడీపీ నేతలకు విద్యా సంస్థలు ఉన్నాయి. అందుకే ప్రభుత్వం ఇలా చేస్తోందని విమర్శిస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ప్రైవేటు విద్యా సంస్థల దోపిడి నుంచి ప్రజలను కాపాడుతున్నామని చెబుతోంది.