Chandrababu: జీవితంలో జగన్ ఇక గెలవడు- తుని సభలో చంద్రబాబు వ్యాఖ్యలు
Tuni TDP Meeting: జగన్ ఇక జీవితంలో గెలవడని తుని బహిరంగ సభలో చంద్రబాబు విమర్శించారు. జగన్ ఇక గెలిచే పరిస్థితులు లేవని, వచ్చేది టీడీపీ-జనసేన ప్రభుత్వమేనని వ్యాఖ్యానించారు.
TDP Public Meeting In Tuni: వచ్చే ఎన్నికల్లో టీడీపీ- జనసేన కూటమి గెలవడం ఖాయమని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) ఆశాభావం వ్యక్తం చేశారు. జీవితంలో ఎప్పుడూ జగన్ గెలిచే అవకాశాలు లేవని, రాష్ట్రంలో రాజకీయం మరిందని చెప్పడానికి తునినే సాక్ష్యమన్నారు. 'రా.. కదలి రా' కార్యక్రమంలో భాగంగా ఇవాళ తునిలో చంద్రబాబు బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జగన్ (YS Jagan) ప్రభుత్వంపై వ్యతిరేకతతో తాము ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభలకు ఎక్కడ చూసినా జనం బ్రహ్మారథం పడతున్నారని అన్నారు. ఇది ప్రారంభం మాత్రమేనని, త్వరలో సునామీగా మారుతుందన్నారు, సునామీలో వైసీపీ చిరునామా గల్లంతవుతుందని, మూడు నెలల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్ అహంకారమే ఆయన అంతానికి దారితీసే పరిస్థితి వచ్చిందని, వైసీపీని చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలపాలని ప్రజలకు చంద్రబాబు సూచించారు. జగన్ రాతియుగం పోవాలని, టీడీపీ-జనసేన స్వర్ణయుగం రావాలన్నారు.
ప్రజల జీవిత ప్రమాణాల్లో మార్పు వచ్చిందా?
'సైకో జగన్‌కు.. ఐదు కోట్ల మంది ప్రజలకు మధ్య పోరాటం జరుగుతుంది. ఐదేళ్లలో ప్రజల జీవిత ప్రమాణాల్లో మార్పు వచ్చిందా? కల్తీ మద్యంతో ఆడబిడ్డల తాళిబొట్లతో ఆడుకునే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన పార్టీగా టీడీపీకి పేరుంది. త్వరలోనే పేదలు, రైతుల సంక్షేమ రాజ్యం వస్తుంది. ఇంటింటికీ వెళ్లి ప్రజలను చైతన్యవంతం చేయాలి. మీ భవిష్యత్తుకు భరోసా ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. కౌలు రైతులను ఆదుకునే బాధ్యత తీసుకుంటా. వెనుకబడిన వర్గాలకు సమర్థ నాయకత్వం ఇచ్చిన పార్టీ టీడీపీ.. వెనుకబడిన వర్గాల కోసం జయహో బీసీ తీసుకొచ్చాం. అన్ని వర్గాలను గౌరవించే బాధ్యత తీసుకుంటాం. 'బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ' తప్పకుండా అమలు చేస్తా. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ టీడీపీ. తెలుగుజాతిని స్వర్ణయుగం వైపు నడిపే బాధ్యత తీసుకుంటా. ప్రపంచంలో తెలుగుజాతి నంబర్‌వన్‌గా ఉండాలనేది నా సంకల్పం' అని చంద్రబాబు స్పష్టం చేశారు.
రాజకీయాలకు అర్హత లేని వ్యక్తి జగన్?
పేదరికం లేని సమాజం చూడాలనే ఎన్టీఆర్ కలను సాకారం చేస్తానని, పేదరికం నుంచి ప్రతి ఒక్కరూ బయటపడేలా చూస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాజకీయాలకు అర్హత లేని వ్యక్తి జగన్ అని, నష్టపోయిన రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ఎస్సీలు, ఎస్టీలు అంటే జగన్‌కు లెక్క లేదని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం రూ.13 లక్షల కోట్లు అప్పు చేసిందని, ఆదాయంతో సమానంగా వడ్డీలు, అసలు కట్టే పరిస్థితి లేదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద సృష్టించి ఆదాయం పెంచుతామని, పెంచిన ఆదాయంతో అభివృద్ది కార్యక్రమాలు చేపడతామన్నారు.
అమరావతే రాజధాని అని జగన్ అధికారంలోకి వచ్చారని, వచ్చిన తర్వాత అమరావతిని పట్టించుకోలేదని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెంచి ప్రజలకు భారం మోపారన్నారు. దేశంలోనే అత్యధిక పెట్రోల్ ధరలు ఏపీలోనే ఉన్నాయని ఆరోపించారు. నాసిరకం, కల్తీ మధ్యం తీసుకువచ్చారని, దాని వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారన్నారు. తెలుగుజాతికి దశ, దిశ చూపిస్తామని, రూ.200 పెన్షన్‌ను రూ.2 వేలకు పెంచింది టీడీపీనేనని తుని బహిరంగ సభలో చంద్రబాబు పేర్కొన్నారు.