AP News: ఏపీకి మరో భారీ ప్రాజెక్టు, కొప్పర్తిని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దాలని కేంద్ర నిర్ణయం
Smart City : దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న ఎనిమిది స్మార్ట్ సిటీలలో ఏపీకి చోటు దక్కేలా కృషి చేసింది. వైఎస్‌ఆర్ జిల్లా కొప్పర్తిని స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు సెలక్ట్ చేసింది.
AP News : టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి పెట్టుబడులు, ప్రాజెక్టుల రాక వేగవంతం అయింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని, ఆ దిశగా ప్రస్తుతం అడుగులు వేస్తుంది. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. కారణం ఎన్డీఏలో కీలక భాగస్వామిగా కూటమి ప్రభుత్వం ఉంది. దీంతో తాజాగా రాష్ట్రానికి మరో కీలక ప్రాజెక్టును తీసుకొచ్చింది.
దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న ఎనిమిది స్మార్ట్ సిటీలలో ఏపీకి చోటు దక్కేలా కృషి చేసింది. వైఎస్‌ఆర్ జిల్లా కొప్పర్తిని స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు సెలక్ట్ చేసింది. కొత్తగా కేంద్రం అభివృద్ధి చేసే ఎనిమిది స్మార్ట్ సిటీలకు కేంద్ర ప్రభుత్వం ఎనిమిది వేల కోట్ల రూపాయలను కేటాయించింది. స్మార్ట్‌సిటీ మిషన్ కింద ఇప్పటికే 100 నగరాలు అభివృద్ధి చేశామన్న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్.. వేగంగా సాగుతోన్న పట్టణీకరణకు అణువుగా ఉన్న మరికొన్ని ప్రాంతాల అభివృద్ధి ప్రణాళిక రూపొందించినట్టు చెప్పారు.
ఎనిమిది ప్రాంతాల ఎంపిక
కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కోసం 21 రాష్ట్రాల నుంచి మొత్తం 26 ప్రతిపాదనలు రాగా.. వాటి నుంచి ఎనిమిదింటిని సెలక్ట్ చేసినట్లు వివరించారు. అన్ని రాష్ట్రాల ప్రతిపాదనలు పరిశీలించినటు వంటి 15వ ఆర్థిక సంఘం అందులో మెరుగైన ప్రణాళికలు పంపిన ఎనిమిది రాష్ట్రాలను ఎంపిక చేసిందన్నారు. ఇందులో ఏపీ రాష్ట్రం నుంచి కొప్పర్తికి చోటు కల్పించినట్లు వివరించారు. ఐసీసీగా పరిగణించే నూతన స్మార్ట్ సిటీల్లో అత్యాధునిక రవాణా సదుపాయాలు, విద్యుత్, తాగునీరు, మురుగునీటి పారుదల, పరిశుభ్రతకు ప్రాధాన్యత కల్పించనున్నారు. ఆర్థిక, సామాజిక అభివృద్ధికి అవసరమైన సదుపాయాల కల్పనతో పాటు పాలనా పరంగానూ అధునాతన సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే అభివృద్ధి చేసిన 100 స్మార్ట్‌సిటీల్లో సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు, వైఫై, హాట్ స్పాట్ సౌకర్యం, డిజిటల్ క్లాస్ రూమ్‌లు, డిజిటల్ లైబ్రరీలు, అన్ని సదుపాయాలతో అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కేంద్రం పేర్కొంది.
Also Read : Mohanbabu Arrest: మీడియాతో పాటు మంచు మనోజ్‌పైనా తీవ్ర దాడి - ఏ క్షణమైనా మోహన్ బాబు అరెస్టు ?
ఓర్వకల్, కొప్పర్తిలో పారిశ్రామిక స్మార్ట్ సిటీలు
ఆ మధ్య కాలంలోనే ఓర్వకల్, కొప్పర్తిలో పారిశ్రామిక స్మార్ట్ సిటీల ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. హైదరాబాద్-బెంగళూరు, విశాఖపట్నం-చెన్నై కారిడార్‌ల అభివృద్ధి ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో రెండు కారిడార్లను అభివృద్ధి చేయనుంది. కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామిక కారిడార్ విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో భాగమని మంత్రి తెలిపారు. కొప్పర్తిలో 2,596 ఎకరాల్లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ రాబోతుంది. ఈ స్మార్ట్ సిటీని కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. 2,137 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఈ పారిశ్రామిక స్మార్ట్ సిటీలో 54,500 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. కొప్పర్తిలో తయారీ యూనిట్లు రాబోతున్నాయి.
రాయలసీమకు రెండుకన్నులు
ఓర్వకల్‌లో 2,621 ఎకరాల్లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ రానుంది. స్మార్ట్ సిటీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.2,786 కోట్లు కేటాయించింది. ఈ స్మార్ట్ సిటీలో 45,000 కొత్త ఉద్యోగాలు వస్తాయని ఆ మధ్య కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. పారిశ్రామిక స్మార్ట్ సిటీలు వెనుకబడిన రాయలసీమ ప్రాంత అభివృద్ధికి దోహదపడతాయని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన రెండు ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని, ఈ రెండు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా కేటాయించిందని మంత్రి తెలిపారు.