AP CAG Report : ఆదాయం పెరుగుతోంది కానీ అప్పుల భారం అనూహ్యం.. ఏపీ తొమ్మిది నెలల రిపోర్ట్‌లో కాగ్ వెల్లడి !
ఏపీలో రెవిన్యూ లోటు ఊహించనంతగా పెరుగుతోందని కాగ్ నివేదిక వెల్లడించింది. ఏడాది మొత్తం మీద రూ. ఐదు వేల కోట్ల లోటును బడ్జెట్‌లో అంచనా వేయగా తొమ్మిది నెలలకే అది రూ. 46వేల కోట్లకు చేరింది.
ఆంధ్రప్రదేశ్ ఆదాయం క్రమంగా పెరుగుతోందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు తొమ్మిది నెలల్లో ఆదాయం రూ. 1,56,029 కోట్లు వచ్చింది. ఈ ఏడాది మొత్తం ఆదాయం 2,14,276 కోట్లు వస్తుందని ప్రభుత్వం బడ్జెట్ అంచనాల్లో తెలిపింది. అంచనాలకు తగ్గట్లుగా ఆదాయం వస్తోందని కాగ్ రిపోర్టును బట్టి అర్థం చేసుకోవచ్చు. తొమ్మిది నెలల ఆదాయం గతేడాదికన్నా 2.3 శాతం ఎక్కువగా ఉంది. బడ్జెట్‌లో ఏడాది మొత్తం పన్నుల ద్వారా రూ. 1,77,196 కోట్లు వస్తుందని అంచనా వేయగా.. తొమ్మిది నెలలకు రూ. 97887 కోట్లు వచ్చింది. ఇది గతేడాది కన్నా ఏడు శాతం అధికం.
రాష్ట్ర సొంత పన్నులు డిసెంబర్ వరకు రూ. 69,943 కోట్లు వచ్చింది. ఇది గతేడాదికన్నా 10.14 శాతం ఎక్కువ. ఆదాయంతో పాటు ప్రభుత్వం పెట్టే ఖర్చు కూడా అంతకంతకూ పెరుగుతోంది. బడ్జెట్‌లో ఏడాది మొత్తం రూ. 2,13,394 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేశారు. , డిసెంబర్ వరకు రూ. 1,55,376 కోట్లు ఖర్చు పెట్టారు. ఇది గత ఏడాది కన్నా రెండు శాతం అధికం. ప్రణాళికా వ్యయం జనరల్, సోషల్ సెక్టార్లు రెండింటిలోనూ తక్కువగానే ఖర్చు పెట్టారు.
అప్పుల విషయంలో ప్రభుత్వం దూసుకెళ్తోందని కాగ్ రిపోర్టు మరోసారి వెల్లడించింది. ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లో రూ. 50,525 కోట్లు రుణంగా తీసుకున్నారు. దీంతో మొత్తం రుణం ఇప్పటివరకు రూ. 2,98,722 కోట్లకు చేరుకుంది. తీసుకున్న రుణాలపై డిసెంబర్ వరకు రూ. 15,291 కోట్లను వడ్డీ రూపంలో చెల్లించారు. బడ్జెట్ ప్రతిపాదనల్లో కూయ 37 వేల కోట్ల రూపాయల ద్రవ్య లోటు ఉంటుందని పేర్కొనగా తొమ్మిది నెలలకే ఈ లోటు ఏకంగా రూ. 58,112 కోట్లకు చేరిపోయింది. గత ఏడాది 142 శాతం అధికంగా ద్రవ్యలోటు నమోదుకాగా, ఈ ఏడాది 157 శాతానికి పెరిగింది.
రెవెన్యూ లోటు కూడా అదే స్థాయిలో పరుగులు తీస్తోంది. బడ్జెట్‌లో ఐదు వేల కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు ఉంటుందని అంచనా వేశారు. కానీ ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లోనే ఇది రూ. 46 వేల కోట్లకు చేరిపోయింది. ఇది ఆందోళనకరమైన అంశంగా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే ప్రభుత్వ ఆదాయం నిలకడగా పెరుగుతోంది. కానీ ఖర్చులపై అదుపు లేకపోవడంతో అప్పులు విపరీతంగా చేయాల్సి వస్తోంది. ఈ కారణంగా రెవిన్యూ లోటు కూడా ఊహించని స్థాయిలో పెరుగుతోంది.