Yamini Krishnamurthy Passes Away: ప్రముఖ భరతనాట్యం కళాకారిణి యామినీ కృష్ణమూర్తి కన్నుమూత
Yamini Krishnamurthy Dies | ప్రముఖ భరతనాట్యం కళాకారిణి యామినీ కృష్ణమూర్తి ఢిల్లీలో కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం (ఆగస్టు 3న) నాడు తుదిశ్వాస విడిచారు.
Bharatanatyam Veteran Yamini Krishnamurthy passes away at 84 | న్యూఢిల్లీ: ప్రముఖ భరతనాట్యం, కూచిపూడి కళాకారిణి యామినీ కృష్ణమూర్తి కన్నుమూశారు. ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యామినీ కృష్ణమూర్తి శనివారం తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె వయసు 84 ఏళ్లు కాగా, గత కొంతకాలం నుంచి యామిని కృష్ణమూర్తి వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. గత ఏడు నెలలుగా ఐసీయూలో ఉండి చికిత్స పొందుతున్న ఆమె కన్నుమూశారని యామిని కృష్ణమూర్తి మేనేజర్, సెక్రటరీ గణేష్ పిటిఐతో మాట్లాడుతూ తెలిపారు.
యామినీ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో జన్మించారు. ఆమె సేవల్ని గుర్తించిన ప్రభుత్వాలు యామినీ కృష్ణమూర్తిని పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మవిభూషణ్ అవార్డులతో సత్కరించాయి. భౌతికకాయాన్ని ఆదివారం ఉదయం 9 గంటలకు ఆమె ఇన్‌స్టిట్యూట్ అయిన యామిని స్కూల్ ఆఫ్ డ్యాన్స్‌కి తీసుకురానున్నారని సమాచారం. ఆమె అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించనున్నారన్న వివరాలు తెలియాల్సి ఉంది. యామినీ కృష్ణమూర్తికి ఇద్దరు సోదరీమణులు ఉన్నారు.
Bharatanatyam doyen Yamini Krishnamurthy dies of age-related ailments at 84
— Press Trust of India (@PTI_News) August 3, 2024
1940 డిసెంబరు 20న చిత్తూరు జిల్లా మదనపల్లెలో జన్మించారు. తండ్రి కృష్ణమూర్తి సంస్కృత పండితుడు కాగా, తాత ఉర్దూ కవి. యామిని కృష్ణమూర్తి కుటుంబం తమిళనాడులోని చిదంబరంలో స్థిరపడింది. భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ నృత్యాలను నేర్చుకుని ప్రదర్శణలు ఇస్తూ నిష్ణాతురాలు అయ్యారు. కర్ణాటక సంగీతంలోనూ ఆమెకు ప్రావీణ్యం ఉంది. 1957లో యామిని కృష్ణమూర్తి తొలి నృత్య ప్రదర్శన ఇచ్చారు. భారత్‌లోనే కాదు అంతర్జాతీయంగా సైతం పలు దేశాలలో ప్రదర్శనలు ఇచ్చి మెప్పు పొందారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన నర్తకిగా యామిని కృష్ణమూర్తి సేవలు అందించారు.
పద్మ అవార్డులతో సత్కరించిన కేంద్ర ప్రభుత్వాలు
ఢిల్లీలో డ్యాన్స్ అకాడమీ స్థాపించి శాస్త్రీయ నృత్యకళారూపాల్లో ఎంతో మందికి శిక్షణ ఇచ్చారు. ఈ క్రమంలో ప్రభుత్వాలు ఆమె సేవల్ని గుర్తించి పలు అవార్డులతో సత్కరించాయి. మొదటగా 1968లో యామిని కృష్ణమూర్తిని పద్మశ్రీ అవార్డు వరించింది. ఆపై 2001లో పద్మ భూషణ్, 2016లో రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ తో కేంద్ర ప్రభుత్వం ఆమెను గౌరవించింది. 1977లో సంగీతనాటక అకాడమీ అవార్డు కైవసం చేసుకున్నారు.
Also Read: Viral Video: అమెరికాలో సత్యనారాయణ స్వామి వ్రతం - ఇంగ్లీష్‌లో సత్యదేవుని వ్రత కథ, వైరల్ వీడియో