APSRTC : ఆర్టీసీ ఆదాయంలో కొంతమేర ప్రభుత్వానికి ఇచ్చే ప్రతిపాదన ఉంది : ఆర్టీసీ ఎండీ
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాక నష్టాలు తగ్గుతున్నాయని ఎండీ ద్వారకా తిరుమలరావు అన్నారు. ఆర్టీసీ ఆదాయాన్ని కొంత వరకు ప్రభుత్వానికి ఇచ్చే ప్రతిపాదన ఉందని, ఎంత వరకూ ఇవ్వాలనేది చర్చించి నిర్ణయిస్తామన్నారు.
ఆర్టీసీ(RTC)లో త్వరలోనే కారుణ్య నియామకాలు పూర్తి చేస్తామని సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు(Dwaraka Tirumala Rao) స్పష్టం చేశారు. కారుణ్య నియామకాలపై ఎవరూ కంగారుపడొద్దని, 2015-19 మధ్య పెండింగ్‌లో ఉన్న నియామకాలు తొలుత భర్తీ చేస్తామని వెల్లడించారు. విలేజ్ వార్డ్ సెక్రటేరియట(Village Ward Secretory), ఆర్టీసీలోని ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. కారుణ్య నియామకాల కింద 1,500 మందికి ఉద్యోగాలిస్తామని తెలిపారు. ఆర్టీసీ ఆదాయాన్ని కొంతవరకు ప్రభుత్వానికి ఇచ్చే ప్రతిపాదన ఉందన్నారు. ఎంతవరకు ప్రభుత్వానికి ఇవ్వాలనేది చర్చించి నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. కార్మిక సంఘాలు ఇచ్చిన నోటీసులోని సమస్యలు పరిష్కరిస్తున్నామని చెప్పారు. ఉద్యోగులు సమ్మెకు వెళ్లటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ఆర్టీసీ ఏడాదికి 30 కోట్ల లీటర్ల డీజిల్ కొంటుందని ఎండీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. రిటైల్(Retail)గా కంటే బల్క్‌గా కొంటేనే డీజిల్(Diesel) ధర పెరుగుతోందన్నారు. మార్చి 1 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తున్నాయని చెప్పారు. ఏలూరు(Eluru), రాజోలు, రంగంపేట, ఉరవకొండలో ఆర్టీసీకి రిటైల్ బంకులు ఉన్నాయని రిటైల్ బంకుల నుంచే ఇంధనం కొనాలని నిర్ణయించామన్నారు. బల్క్ రేట్ తగ్గిన్నపుడు ఆయిల్ తయారీ సంస్థల నుంచి కొంటామని తెలిపారు.
పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారని ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం తర్వాత మెడికల్ అన్‌ఫిట్(Medical Unfit) అయిన వారి పిల్లలకు కారుణ్య నియామకాలు చేపడతామన్నారు. విలీనానికి ముందు మెడికల్ అన్‌ఫిట్ అయిన వారి పిల్లలకు మానిటరీ బెనిఫిట్స్ మాత్రమే ఇస్తామన్నారు. బల్క్ ధరలు తగ్గాక ప్రభుత్వ వాహనాలకు ఆర్టీసీ ద్వారా డీజిల్ సరఫరా చేస్తామన్నారు. విలీనం తర్వాత సంస్థ నష్టాలు తగ్గుతున్నాయని ద్వారకా తిరుమలరావు అన్నారు. కరోనాకు ముందు కార్గో సేవల ద్వారా ఏడాది రూ.97.44 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. గతంలో రోజుకు 18 వేల పార్సిళ్లు రవాణా చేయగా, ప్రస్తుతం 22 వేలకు పెరిగాయన్నారు. సీసీఎస్(CCS)కు ఉన్న రూ.269 కోట్ల అప్పు తీర్చేశామన్నారు. పీఎఫ్(PF)లోని అప్పు రూ.640 కోట్లు కూడా తీర్చామని తెలిపారు. గత 3 నెలలుగా సంస్థ పరిస్థితి మెరుగుపడుతోందని ఎండీ స్పష్టం చేశారు. డీజిల్ ధరలు పెరిగినా టికెట్ ధరలు పెంచలేదన్నారు.
ఫిబ్రవరి 1న రిటైల్‌గా డీజిల్ ధర రూ.96.02లు ఉంటే బల్క్‌గా రూ.96.24లకు పెరిగిందన్నారు. ఫిబ్రవరి 15 నాటికి రిటైల్‌గా 96.02గా ఉంటే బల్క్ ఇంధనం ధర రూ.100.41లుగా ఉందన్నారు. రిటైల్ కన్నా బల్క్ ధరలు ఎక్కువగా ఉందన్నారు. దీంతో ఆర్టీసీకి రోజుకు రూ.32 లక్షలు అదనంగా ఖర్చు అవుతుందని ఎండీ స్పష్టం చేశారు. కొద్ది రోజుల్లో 100 ఎలక్ట్రిక్ బస్సులు(Electric Buses) అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. ప్రయోగాత్మకంగా 100 డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తామని ద్వారకా తిరుమలరావు చెప్పారు.