Teacher's Day : ఏపీ ఉపాధ్యాయ సంఘాలు కీలక నిర్ణయం, టీచర్స్ డే బహిష్కరణ!
Teacher's Day : ఏపీలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు ఉపాధ్యాయ సంఘాలు ప్రకటించాయి. ప్రభుత్వ సత్కారాలు, సన్మానాలు తిరస్కరిస్తున్నట్లు ఏపీటీఎఫ్ పిలుపునిచ్చింది.
Teacher's Day : ఏపీలో ఉపాధ్యాయ సంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. టీచర్స్ డేను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం నాడు ప్రభుత్వం నిర్వహించే సత్కారాలు, సన్మానాలు తిరస్కరిస్తున్నట్లు ఏపీ టీచర్స్ ఫెడరేషన్(APTF) పిలుపునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులను అవమానిస్తుందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉపాధ్యాయ సంఘాలు తెలిపాయి. ఉపాధ్యాయులపై అక్రమ కేసులు, బైండోవర్లను తీవ్రంగా ఖండిస్తున్నామన్నాయి. ప్రభుత్వం సొంత ఫోన్లలో ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా హాజరు వేసేలా ఒత్తిడి చేస్తున్నారని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. సీపీఎస్ రద్దు హామీని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని పలు ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
సెప్టెంబర్ 1 నుంచి ఆన్ లైన్ హాజరు
ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు, బోధనేతర సిబ్బందికి కలిపి పాఠశాల విద్యాశాఖ ఒకే హాజరు యాప్‌ను తీసుకొచ్చింది. స్కూళ్ల ప్రాంగణంలో మాత్రమే పని చేసే ఈ యాప్‌ను సెప్టెంబర్ 1 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఉపాధ్యాయులు తమ ఫోన్లలో ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని ఉదయం 9 గంటల్లోపు ఫేస్ రికగ్నిషన్‌తో హాజరు వేయాల్సి ఉంటుంది. టైం దాటితే ఆ రోజు సెలవుగా పరిగణిస్తారు. సెలవులు కూడా ఈ యాప్‌లోనే ఆప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్ పనిచేయక హాజరు పడకపోతే సెలవుగా పరిగణిస్తే ఎలా అని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. యాప్ వినియోగానికి ప్రత్యేకంగా ఫోన్ ఇవ్వకుండా ఉపాధ్యాయుల సొంత సెల్‌ఫోన్, నెట్ వినియోగించాలని చెప్పడం సరికాదని అంటున్నాయి, ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే తమ ఫోన్‌లోని డేటా ఇతరులకు వెళ్లే ప్రమాదం ఉంటుందనే ఆరోపిస్తున్నారు. విద్యార్థులకు టిక్ మార్క్ హాజరును ఉదయం 10 గంటల్లోపు యాప్ లో నమోదు చేయాల్సి ఉంటుంది. అన్ని పథకాలకు ఈ హాజరునే ప్రామాణికంగా తీసుకుంటామని ప్రభుత్వం అంటోంది.
15 రోజుల గడువు లేదు
ఫేస్ రికగ్నిషన్ యాప్ లో పలు సమస్యలు ఉన్నాయని ఉపాధ్యాయులు అంటున్నారు. ఇటీవల మంత్రి బొత్స సత్యనారాయణతో ఉపాధ్యాయ సంఘాలు భేటీ అయ్యాయి. ఈ భేటీ తర్వాత ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తమ ఫోన్లలోనే ముఖ ఆధారిత హాజరు యాప్ డౌన్ లోడ్ చేసుకునేందుకు అంగీకరించామన్నారు. ముఖ ఆధారిత యాప్ హాజరులో ఉన్న సాంకేతిక సమస్యలు పరిశీలించేందుకు 15 రోజుల సమయం కోరామని వెల్లడించారు. సాంకేతిక ఇబ్బందులు తొలగించిన తర్వాతే.. పూర్తి స్థాయిలో అమలు చేయాలని మంత్రి అన్నారని చెప్పారు. ఆ తర్వాత అలాంటిదేమీ లేదంటూ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. 15 రోజుల సమయం ఇచ్చినట్లు ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నది నిజం కాదని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలతో ముఖ ఆధారిత హాజరు (Face Recognition Attendance)ను సెప్టెంబర్ 1వ తేదీ అమలు చేస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే ప్రధానోపాధ్యాయులందరికీ ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. సాంకేతిక సమస్యలు వస్తే.. సరిదిద్దడానికి ఐటీ బృందానికి నివేదించాలని ఆదేశాలు పాఠశాల విద్యాశాఖ జారీచేసింది. ఈ యాప్ లో తొలిరోజు 85 శాతం ఉపాధ్యాయులు తమ హాజరు నమోదు చేశారని మంత్రి బొత్స అన్నారు. ఫేస్ రికగ్నిషన్ హాజరు ఇతర ప్రభుత్వ శాఖలకు విస్తరిస్తామన్నారు.
Also Read : Face Recognition Attendance: టీచర్లకు ముఖ ఆధారిత హాజరు ఉన్నట్లా, లేనట్టా - అసలేం జరుగుతోంది ! నెగ్గేదెవరు
Also Read: Minister Botsa : మాకు ఇగో లేదు, సీపీఎస్ పై మూడ్రోజుల్లో చర్చిస్తాం- మంత్రి బొత్స