Face Recognition Attendance: టీచర్లకు ముఖ ఆధారిత హాజరు ఉన్నట్లా, లేనట్టా - అసలేం జరుగుతోంది ! నెగ్గేదెవరు
Face Based Attendance: ముఖ ఆధారిత హాజరు నమోదు ఉన్నట్లో, లేనట్టో ఉప్పటికీ ఎవరికీ తెలియడం లేదు. దీనిపై మొన్న మంత్రి బొత్సతో జరిగిన చర్యల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Face Recognition App: ముఖ ఆధారిత హాజరు నమోదుపై నేటికీ సందిగ్ధత వీడటం లేదు. ఈనెల ఒకటో తేదీన మంత్రి బొత్స సత్యనారాయణ ఉపాధ్యాయ సంఘాలతో జరిపిన చర్చల్లో గందరగోళం నెలకొంది. సమావేశం తర్వాత సంఘాల నాయకులు సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు 15 రోజుల సమయం ఇచ్చారంటూ మీడియా ముందు చెప్పారు.
ఉద్యోగుల ఫోన్ల నుంచి హాజరు ఓకే..
తమ ఫోన్లలోనే ముఖ ఆధారిత హాజరు యాప్ డౌన్ లోడ్ చేసుకునేందుకు ప్రభుత్వం అంగీకరించిందని ఎస్ టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయి శ్రీనివాస్ తెలిపారు. ముఖ ఆధారిత యాప్ హాజరులో ఉన్న సాంకేతిక సమస్యలు పరిశీలించేందుకు 15 రోజుల సమయం కోరామని వెల్లడించారు. సాంకేతిక ఇబ్బందులు తొలగించిన తర్వాతే.. పూర్తి స్థాయిలో అమలు చేయాలని మంత్రి అన్నారని చెప్పారు.
ఆ తర్వాత అలాంటిదేమీ లేదంటూ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. 15 రోజుల సమయం ఇచ్చినట్లు ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నది నిజం కాదని కమిషనరేట్ పేర్కొంది. ఉపాధ్యాయ సంఘాలతో ముఖ ఆధారిత హాజరు (Face Recognition Attendance)ను సెప్టెంబర్ 1వ తేదీ నుంచి తప్పని సరి చేయాలని తెలిపింది. ఈ క్రమంలోనే ప్రధానోపాధ్యాయులందరికీ ఆదేశాలు వెళ్లినట్లు వివరించింది. సాంకేతిక సమస్యలు వస్తే.. సరిదిద్దడానికి ఐటీ బృందానికి నివేదించాలని ఆదేశాలు జారీ చేసింది.
సీఎం దృష్టికి తీసుకెళ్తాం - మంత్రి బొత్స
ఉద్యోగ సంఘాల నేతలతో రెండు అంశాలపై చర్చించామని, ఫేస్ యాప్ హాజరుపై ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ గవర్నమెంట్ అన్నారు. ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తెస్తే, తప్పకుండా పరిష్కరిస్తామని చెప్పారు. టీచర్లపై పెట్టిన కేసుల అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తాం. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మంచి చేయాలనేదే సీఎం జగన్ ఆలోచన అని వివరించారు.
ఉపాధ్యాయ సంఘాలతో నిర్వహించిన చర్చలకు భిన్నంగా అధికారుల వైఖరి ఉందంటూ ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య యూటూఏఫ్, ఏపీటీఏఫ్ లు విమర్శించాయి. ముఖ ఆధారిత హాజరు నమోదులో ఉన్న సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని అధికారులు చెప్పినట్లు ఓ ప్రకటనలో సంఘాలు తెలిపారు. అధికారులు చెప్పిన దానికి భిన్నంగా వ్యవహరించడం వల్ల ఉపాధ్యాయుల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఫోన్ లలో వ్యక్తిగత సమాచారం భద్రతపై మంత్రి బొత్స, అధికారులు ఇచ్చిన భరోసా వారిలో ఆత్మ విశ్వాసాన్ని కల్గించేలా లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వ్యక్తిగత సమాచార భద్రత విషయంలో వాస్తవాలు నిర్దారించేందుకు ప్రభుత్వం ఒక టెక్నికల్ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తమ భద్రతకు వాటిల్లేటట్లు ఉండే.. యాప్ ను అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వం కావాలనే తమను ఇబ్బంది పెడుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఇలాగే కొనసాగితే.. న్యాయ పోరాటానికి సిద్ధం అవుతామని ఉపాధ్యాయ సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు.
Also Read: Minister Botsa : మాకు ఇగో లేదు, సీపీఎస్ పై మూడ్రోజుల్లో చర్చిస్తాం- మంత్రి బొత్స