YSRCP Panchayat Funds : పంచాయతీ ఖాతాలను ప్రభుత్వం ఎందుకు ఖాళీ చేసింది ? సొంత క్యాడర్‌ను వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ ఎందుకు ఇబ్బంది పెడుతోంది ?
ఏపీలో పంచాయతీ ఖాతాలను ప్రభుత్వం ఖాళీ చేయడంపై విమర్శలు వస్తున్నాయి. సొంత క్యాడర్ కూడా ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉంది. అయినా ప్రభుత్వం ఎందుకిలా చేస్తోంది ?
పంచాయతీల ఖాతాలో ఉన్న నిధులన్నింటినీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖాళీ చేయడం వివాదాస్పదం అవుతోంది. పార్టీలకు అతీతంగా సర్పంచ్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో కనీస అభివృద్ధి పనులు కూడా చేపట్టలేకపోతున్నామని అంటున్నారు. కొంత మంది అధికారపార్టీకి రాజీనామాలు చేస్తున్నట్లుగా ప్రకటిస్తున్నారు. మరికొంత మంది న్యాయపోరాటం చేస్తామని అంటున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు ప్రభుత్వానికి మాత్రమే కాదు రాజకీయంగా అధికార పార్టీకి కూడా ఇబ్బందికరంగా మారింది. విపక్షాలు విమర్శలు చేస్తాయన్నది ఆ ఇబ్బంది కాదు. సొంత క్యాడర్ అసంతృప్తి గురి కావడమే దీనికి కారణం.
పంచాయతీల ఖాతాలన్నీ ఖాళీ చేసిన ప్రభుత్వం !
పంచాయతీలకు సొంత ఆదాయ వనరులతో పాటు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులు నేరుగా ఇస్తోంది. అవన్నీ పంచాయతీ ఖాతాలకు నేరుగా జమ అవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం తలసరి గ్రాంటు, వృత్తి పన్ను, సీనరేజి, పంచాయతీ పరిధిలో జరిగే ఆస్తుల రిజిస్ట్రేషన్ల ఆదాయంలో కొంత మొత్తం ఇవ్వాలి. అలాగే ఆర్థిక సంఘం నుంచి నిధులు వస్తాయి. అయితే ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధఉలు రావడం లేదు. ఆర్థిక సంఘం నిధులు మాత్రం పంచాయతీలకు ఠంచన్‌గా వస్తాయి. అలా వచ్చిన నిధులను ప్రభుత్వం తీసేసుకోవడమే వివాదానికి కారణం అవుతోంది. పంచాయతీల అనుమతి తీసుకోకుండానే ఆర్థిక సంఘం నిధులను విద్యుత్తు బకాయిల కింద పంపిణీ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సర్దుబాటు చేస్తోంది. గత ఐదు నెలల్లో దాదాపు రూ.1,245 కోట్లు రెండు విడతలుగా వెనక్కి తీసుకున్నారు. దీంతో పంచాయతీలు ఆర్థికంగా పూర్తి స్తాయిలో కుంగిపోయాయి.
అప్పుల కోసం చేసుకున్న సంస్కరణల ఒప్పందాల్లో భాగంగానే ప్రభుత్వ నిర్ణయాలు !
రాష్ట్ర ప్రభుత్వం ఇంధనశాఖ వద్ద "లిక్విడిటీ ఇన్‌ఫ్యూజన్ స్కీం" పేరుతో రూ. 6,600 కోట్ల రుణం తీసుకుంది. ఈ రుణం షరతుల్లో ఒకటి డిస్కంలకు పంచాయతీలు చెల్లించాల్సిన విద్యుత్తు ఛార్జీల్ని, పాత బకాయిలను పంచాయతీ నిధుల నుంచి మినహాయించి డిస్కంల ఖాతాలకు జమచేయడం. దీనికి అంగీకరించిన ప్రభుత్వం అప్పట్లోనే జీవో జారీ చేసింది. గ్రామ పంచాయతీలకు చెందిన ఆరు ఖాతాల నుంచి నిధుల సర్దుబాటుకు అనుమతించారు. దానికి తగ్గట్లుగానే పంచాయతీల నిధులు ఖాళీ చేసి విద్యుత్ సంస్థలకు చెల్లిస్తోంది.
Also Read : నెల్లూరులో అమరావతి రైతులకు సర్‌ప్రైజ్.. సంఘిభావం తెలిపిన వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే !
ప్రభుత్వంపై సర్పంచ్‌ల్లో తీవ్ర అసంతృప్తి !
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీల్లో 90శాతం వైఎస్ఆర్సీపీవే. స్థానిక ఎన్నికల్లో బాగా ఖర్చు పెట్టుకున్నారు. గ్రామస్తులకు ఎన్నో హామీలు ఇచ్చారు. సర్పంచ్‌లుగా వార్డు సభ్యులుగా గెలిచారు. తీరా ఇప్పుడు పనులు చేద్దామనుకునేసరికి నిధులు ఖాళీ అయిపోయాయి. ఖర్చు పెట్టుకున్న సొమ్ము కాదు కదా గ్రామ సమస్యలను కూడా సొంత ఖర్చుతో చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వైఎస్ఆర్‌సీపీ క్యాడర్ అయిన సర్పంచ్‌లకు నోట మాట రావడం లేదు. ఓ వైపు పనులు చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. తాము ఖర్చు పెట్టిన వాటిని వెనక్కి తెచ్చుకోవాలనుకున్నారు. కానీ ఆ అవకాశం లేకుండా పోయింది. మరో వైపు పంచాయతీల్లో వచ్చే చిన్న చిన్న పనులను చేయించడానికి చేతి ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోంది. సర్పంచ్ అనే బాధ్యత వారిని అప్పుల పాలు చేస్తోంది. ఏం చేయాలో తెలియక అల్లాడిపోతున్నారు. చాలా కొద్ది మంది మాత్రమే బయటకు వస్తున్నారు. ఎక్కువ మంది లోలోన అసంతృప్తికి గురవుతున్నారు. ఇది సొంత ప్రభుత్వం.. పార్టీపై అసంతృప్తికి కారణం అవుతోంది. ఇటీవల శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాస ప్రసాదరావు కూడా ఇదే తరహాలో ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ క్యాడర్ పనులు చేపట్టి నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు పంచాయతీ నిధులు కూడా లాగేసుకోవడంతో వైసీపీ క్యాడర్ అంతా.. ఆర్థికంగా కుంగిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఇది రాజకీయంగా కూడా వైఎస్ఆర్‌సీపీకి.. ప్రభుత్వానికి ఇబ్బందికరమే.
Also Read : పాల శేషాద్రి.. డాలర్ శేషాద్రిగా ఎలా మారారు.. సామాన్యుల నుంచి వీవీఐపీల వరకు సుపరిచితులు!
ఏకగ్రీవ పంచాయతీలకు ఇస్తామన్న నిధులన్నా ఇస్తారా !?
ఏకగ్రీవ పంచాయతీలకు భారీగా ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు ముందు జీవో నెం. 34ని విడుదల చేశారు. 4 తరగతులుగా విభజించి పంచాయతీలకు ప్రయోజనం కల్పిస్తామని జీవోలో పేర్కొన్నారు. 2 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీల్లో ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగితే రూ.5 లక్షల వరకు నగదు ప్రోత్సాహం, 5000 లోపు జనాభా వుండే పంచాయతీలకు రూ.10 లక్షలు నగదు , 10 వేల జనాభా వున్న పంచాయతీలకు ఏకగ్రీవం అయితే రూ.15 లక్షల నగదు, పదివేల కన్నా జనాభా అధికంగా ఉన్న పంచాయతీల్లో ఏకగ్రీవం జరిగితే రూ.20 లక్షల రూపాయల నగదు ప్రోత్సాహం అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మొత్తంగా 2,199 పంచాయితీలు ఏకగ్రీవం అయ్యాయి. కానీ ఇప్పటికీ నయాపైసా ప్రోత్సాహకం అందించలేదు. ఈ ఏకగ్రీవాలన్నీ వైఎస్ఆర్‌సీపీ నేతలవే. ఎక్కువగా వేలం పాటల ద్వారా ఈ ఏకగ్రీవాలయ్యాయి. ఆ నిధులన్నీ వైఎస్ఆర్‌సీపీ నేతలు గ్రామానికి ఖర్చు పెట్టారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏకగ్రీవలాల నిధులు విడుదల కాకపోవడం.. ఆర్థిక సంఘం నిధులు కూడా వెనక్కి తీసుకోవడంతో ఆర్థికంగా కుంగిపోతున్నారు.
Also Read : ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ కు మరోసారి అస్వస్థత... హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి తరలింపు
పంచాయతీలకు తక్షణ సాయం చేయకపోతే ఇబ్బందే !
కారణం ఏదైనా పంచాయతీలకు ప్రభుత్వం ఇప్పటికిప్పుడు నిధులు సాయం చేయకపోతే వాటి రోజువారీ వ్యవహారాలకు కూడా ఇబ్బందే. మోటార్ల రిపేర్ల బిల్లులూ చెల్లించలేకపోతున్నామని సర్పంచ్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పుల కోసం అంగీకరించిన షరతుల మేరకు ఆర్థిక సంఘం నిధులు వెనక్కి తీసుకున్నా ప్రభుత్వం ఆ నిధులను మరో రూపంలో అయినా సర్దు బాటు చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం స్పందిస్తుందో లేదో వేచి చూడాలి !
Also Read: Omicron Scare: కొత్త వేరియంట్ ఎఫెక్ట్.. విమాన సేవల పునరుద్ధరణపై కేంద్రం సమీక్ష
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి