AP Power Cuts : రూ.వెయ్యి కోట్లతో విద్యుత్ కొనుగోలు - ఆసుపత్రులకు కోతల్లేకుండా చూస్తాం : ఇంధనశాఖ కార్యదర్శి శ్రీధర్
AP Power Cuts : కోవిడ్ తర్వాత రాష్ట్రంలో విద్యుత్ వినియోగం పెరిగిందని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీధర్ తెలిపారు. జాతీయ ఎక్స్ఛేంజీల్లో విద్యుత్ లభ్యత లేని కారణంగా విద్యుత్ కోతలు విధించాల్సి వస్తుందన్నారు.
AP Power Cuts : ఏపీలో విద్యుత్ కోతలు కొనసాగుతున్నాయి. విద్యుత్ డిమాండ్ పెరగడంతో కోతలు తప్పడంలేదని అధికారులు అంటున్నారు. కోవిడ్ తర్వాత విద్యుత్ వినియోగం భారీగా పెరిగిందని రాష్ట్ర ఇంధనశాఖ కార్యదర్శి బి. శ్రీధర్ అన్నారు. రాష్ట్రంలో సగటు విద్యుత్ వినియోగం 180 మిలియన్ యూనిట్లు మాత్రమేనన్నారు. సాధారణంగా ప్రతీ వేసవిలో విద్యుత్ వినియోగం 204 మిలియన్ యూనిట్లకు చేరుతుందన్నారు. కానీ కోవిడ్ తర్వాత ఈ ఏడాది మార్చి నుంచి విద్యుత్ వినియోగం గరిష్ట స్థాయికి చేరిందన్నారు. పరిశ్రమలు, ఆర్థిక లావాదేవీలు పూర్తి స్థాయిలో జరుగుతున్న కారణంగా 240 మిలియన్ యూనిట్లకు విద్యుత్ వినియోగం చేరిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నంత విద్యుత్ డిమాండ్ ఇప్పుడు ఉందన్నారు. రాష్ట్రంలోని అన్ని జెన్కో యూనిట్లు పూర్తి సామర్థ్యంతో పని చేస్తున్నాయని ఆయన తెలిపారు.
గ్రిడ్ కు ప్రమాదం వాటిల్లే అవకాశం
ప్రస్తుత సీజన్లో రూ. 1058 కోట్లతో విద్యుత్ కొనుగోలు చేశామని బి.శ్రీధర్ తెలిపారు. జాతీయ ఎక్స్ఛేంజీల్లో లభ్యత లేని కారణంగా ఇటీవల వ్యవసాయానికి, గృహాలకు విద్యుత్ కోత విధించాల్సి వచ్చిందన్నారు. ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నందున పరిశ్రమలకు లోడ్ రిలీఫ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. లేకపోతే గ్రిడ్ కు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందన్నారు. అందుకే పరిశ్రమల వినియోగంలో 50 శాతం మాత్రమే వినియోగించుకోవాలని చెప్పామన్నారు. ఇదీ ఇబ్బందే కానీ తప్పని పరిస్థితి అని శ్రీధర్ తెలిపారు. వ్యవసాయ అవసరాలకు వినియోగించే విద్యుత్ ఈ నెలాఖరుకు తగ్గే అవకాశం ఉందన్నారు. ఆ తర్వాత పరిశ్రమలకు యథావిధిగా విద్యుత్ సరఫరా జరుగుతుందన్నారు.
పరిశ్రమలకు 10 మిలియన్ యూనిట్ల కోత
బొగ్గు సరఫరా గురించి సీఎం, ఎంపీలు ప్రధానితో మాట్లాడితే సరఫరా పెరిగే అవకాశం ఉంటుందని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీధర్ అన్నారు. పొరుగు రాష్ట్రాలకు కూడా తీవ్రమైన విద్యుత్ కొరత ఉందన్నారు. ఆస్పత్రులకు విద్యుత్ ఇబ్బందులు లేకుండా చూడాలని డిస్కంలకు ఆదేశాలిచ్చామన్నారు. ప్రస్తుతం 20 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు చేస్తున్నామన్నారు. ఎక్సైఛేంజీల్లో లభ్యత లేని కారణంగా గృహాలకు పరిమితంగా కోతలు విధించాల్సి రావొచ్చన్నారు. నికరంగా 30 మిలియన్ యూనిట్ల వరకు లోటు ఉందని ఆయన చెప్పారు. నిన్నటి వరకు పరిశ్రమలకు 10 మిలియన్ యూనిట్ల కోత విధించామని స్పష్టం చేశారు.
Also Read : Power Cut Memes : కరెంట్ ఏది పుష్పా - ఏపీ పవర్ కట్స్‌పై సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువ