Badvel By-Election: బద్వేల్ గురించి మర్చిపోయిన రాజకీయ పార్టీలు.. ఉపఎన్నిక ఉంటుందా.. లేక ఏకగ్రీవమేనా..
తెలంగాణలో హుజూరాబాద్‌కు ఉపఎన్నిక వస్తుందని రాజకీయ పార్టీలు హడావుడి చేస్తున్నాయి. కానీ ఏపీలో ఉపఎన్నిక జరగాల్సిన బద్వేలు గురించి అక్కడి పార్టీలు పట్టించుకోవడం మానేశాయి.
తెలంగాణలో ఓ అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ అయితే అక్కడ రాజకీయంగా దుమ్మురేగుతోంది. కానీ ఏపీలో ఓ అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ అయి ఐదు నెలలు దాటుతోంది. కానీ అక్కడ ఉపఎన్నిక జరుగుతుందనే మాటను సైతం రాజకీయ పార్టీలన్నీ మర్చిపోయాయి. అటు అధికార పార్టీ కానీ.. ఇటు ప్రతిపక్ష తెలుగుదేశం కానీ.. బీజేపీ, జనసేన, లెఫ్ట్ ఇతర పార్టీలేవీ పట్టించుకోవడం లేదు. గత మార్చి నెలలోనే బద్వేలు వైసీపీ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య అనారోగ్యంతో మరణించారు. రాజ్యాంగం ప్రకారం ఆరు నెలల్లో ఉపఎన్నిక పెట్టాలి. ఇప్పటికే నాలుగున్నర నెలలు దాటిపోయింది. మరో నెలన్నరలో ఉపఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.
2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి వెంకటసుబ్బయ్య దాదాపు 44 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. వైసీపీ తరుపున వెంకటసుబ్బయ్య భార్య డాక్టర్ సుధకే టిక్కెట్ ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇక్కడ టీడీపీ పోటీలో ఉంటుందో లేదో ఇంత వరకూ ఏ స్పష్టత లేదు. కడప జిల్లా నేతలు ఈ అంశంపై ఎక్కడా స్పందించడం లేదు. వెంకట సుబ్బయ్య కుటుంబసభ్యులకే టిక్కెట్ ఇస్తే... సంప్రదాయం పేరుతో ఏకగ్రీవానికి సహకరించాలన్న ఆలోచనలో టీడీపీ ఉన్నట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం.. ఉపఎన్నిక జరిగినా, టీడీపీ శ్రేణులు ధైర్యంగా నిలబడి వైసీపీతో పోరాడే పరస్థితి లేదు. కడప జిల్లాలో అసలు లేదని.. టీడీపీ అగ్రనేతలే అంతర్గతంగా చెప్పుకుంటూ ఉంటారు. ఈ విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఇంత వరకూ దృష్టి పెట్టలేదు.
హుజూరాబాద్ ఉప ఎన్నికలకు ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ వస్తుందన్నంతగా రాజకీయ నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నందువల్ల దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరగాల్సిన ఉపఎన్నికలను వాయిదా వేస్తున్నామని కేంద్ర ఎన్నికల సంఘం కొన్నాళ్ల కిందట ప్రకటించింది. దేశంలో ప్రస్తుతం మూడు పార్లమెంటరీ నియోజకవర్గాలు, పది అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. దాద్రా - నగర్ హవేలి, మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా, హిమాచల్‌లోని మండి పార్లమెంటరీ నియోజకవర్గాలతో పాటు, హరియాణాలోని కల్కా, ఎల్లెనాబాద్, రాజస్తాన్‌లోని వల్లభనగర్, కర్ణాటకలోని సింగ్డి, మేఘాలయలోని రాజబాలా, మావరింగ్‌కెంగ్, హిమాచల్‌ప్రదేశ్‌లోని ఫతేపూర్, ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్ (ఎస్సీ), తెలంగాణలోని హుజూరాబాద్ , పశ్చిమ బెంగాల్‌లో భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరగాల్సి ఉంది.
అసలు ఉపఎన్నికలపైనే దేశంలో పెద్ద రాజకీయం నడుస్తోంది. మిగతా చోట్లా ఉపఎన్నిక నిర్వహించడానికి ఎన్నికల సంఘం నిర్ణయిస్తే.. బద్వేల్‌లో కూడా ఉపఎన్నిక జరగుతుంది. లేకపోతే.. మరికొంతకాలం ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడు ఎన్నిక జరిగినా బద్వేలుపై పెద్దగా రాజకీయం వ్యూహాల దిశగా పార్టీలు వెళ్లే అవకాశం కనిపించడం లేదు. హుజూరాబాద్‌లో ఉన్న హైటెన్షన్‌లో ఒక్క శాతం కూడా బద్వేలులో ఉండకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.