Sharmila: రాహుల్ గాంధీకి ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలి - విశాఖ దీక్షలో షర్మిల
దేశంలోని సాధారణ ప్రజల హక్కుల రక్షణకై రాహుల్ గాంధీ యాత్ర సాగిస్తున్నారని, అటువంటి యాత్రపై బీజేపీ గూండాలు దాడులకు తెగబడడం దేనికి సంకేతమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు
Pcc chief Sharmila Comments : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్రపై అస్సాంలో బీజేపీ శ్రేణులు దాడి చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చారు. ఈ నిరసనలో భాగంగా విశాఖ నగర పరిధిలోని జీవీఎంసీ కార్యాలయం ఎదురుగా ఉన్న జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద షర్మిల నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ నిరంకుశ పాలన సాగిస్తోందని ఆరోపించారు. రాహుల్ గాంధీ యాత్రపై దాడి చేయడం దారుణమన్నారు. దేశంలోని సాధారణ ప్రజల హక్కుల రక్షణకై రాహుల్ గాంధీ యాత్ర సాగిస్తున్నారని, అటువంటి యాత్రపై బీజేపీ గూండాలు దాడులకు తెగబడడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఈ తరహా దాడులతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులను భయపెట్టలేరని ఆమె స్పష్టం చేశారు. ఇప్పటికైనా బీజేపీ నిరంకుశ విధానాలకు స్వస్తి చెప్పాలని పిలుపునిచ్చారు. అస్సాంలో బీజేపీ అధికారంలో ఉందని, శాంతియుతంగా సాగుతున్న యాత్రపై దాడులు చేయడాన్ని ప్రజాస్వామ్యం అంటారా..? అని ఆమె ప్రశ్నించారు. రాహుల్ గాంధీని గుడికి వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారని, నిరంకుశ విధానాలను ప్రజలు గమనిస్తున్నారని షర్మిల స్పష్టం చేశారు.
ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ, వీహెచ్‌పీ వాళ్లు తప్పా మరొకరు గుళ్లకు వెళ్లకూడదా..? దేశంలో బతకకూడదా..? అని ఆమె ప్రశ్నించారు. బీజేపీ చర్యలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, ఎన్నికలు సమయంలో సరైన బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. ఈ తరహా దాడుల ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమని ఆమె పేర్కొన్నారు. దాడికి పాల్పడిన రాష్ట్రంలో బీజేపీయే అధికారంలో ఉందని, రాహుల్ గాంధీకి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. ప్రజల హక్కులను కాపాడేందుకు సాగిస్తున్న యాత్రపై దాడి చేయడం దారుణమన్నారు.
భారత పౌరుల హక్కులు కోసం కొట్లాడే దిశగా రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రను మొదలు పెట్టారన్నారు. అంతకుముందు చేసిన భారత్ జోడో యాత్రలో భాగంగా నాలుగు వేల కిలో మీటర్లు చేస్తే.. అడుగడుగునా బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేక ప్రభుత్వాలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు. ఈ తరహా చర్యలను మానుకోవాలని ఆమె పిలుపున్చారు. ఈ తరహా దాడులను ప్రజాస్వామ్యం అంటారా..? అని ఆమె ప్రధాని మోదీని ప్రశ్నించారు.
గాంధీ విగ్రహానికి నివాళి.. నినాదాలు
పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆమె విశాఖలో తొలి పర్యటనకు శ్రీకారం చుట్టారు. సాయంత్రం ఏడు గంటలకు గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్న ఆమె 20 నిమిషాలపాటు అక్కడ కూర్చుని నిరసన తెలిపారు. ముందుగా గాంఽధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం నేలపై కూర్చుని నినాదాలు చేశారు. మోదీ డౌన్ డౌన్, బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సుమారు ఐదు నిమిషాలపాటు బీజేపీ, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేసిన షర్మిల.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ విన్నవించారు.
భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు
షర్మిల యాత్ర కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఎయిర్‌పోర్టు నుంచి షర్మిల వెంట కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు భారీగా తరలివచ్చారు. ఆమెతోపాటు పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ మాణిక్యం ఠాకూర్, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరారావు, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు, మాజీ పీసీసీ ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు, రాకేష్ రెడ్డి, నగర పార్టీ అధ్యక్షుడు గంపా గోవింద్, పార్టీ నాయకులు వజ్జపర్తి శ్రీనివాస్, చోడదాసి సుధాకర్, మూల వెంకటరావుతోపాటు అధిక సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు. ఎయిర్ పోర్టు నుంచి కార్లతో ఆమె కాన్వాయ్ వెంట వచ్చారు. ఇక్కడ పర్యటన అర్ధగంటలో ముగించుకున్నారు. ఇక్కడి నుంచి శ్రీకాకుళం పర్యటనకు ఆమె వెళుతున్నట్టు పార్టీ శ్రేణులు వెల్లడించారు.