AP Capital Row: వాయిదా అడగడంపై దురుద్దేశం ఉందా?... మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్న... కోర్టు అంగీకారంతో విశాఖకు రాజధాని
మూడు రాజధానులపై హైకోర్టులో వ్యాజ్యాలు వేసిన వాళ్లే వాయిదా వేయాలని ఎందుకు కోరారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. వాయిదా అడగడంలో ఏదైనా దురుద్దేశం ఉందా? అన్నారు.
కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న కారణంగా రాజధాని వ్యాజ్యాలపై విచారణ వాయిదా వేయాలని కోరడంపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. రాజధానిపై రోజువారీ విచారణ చేస్తామని హైకోర్ట్ చెప్పిందన్నారు. విచారణను వాయిదా వేయాలని ఎందుకు అడిగారని ప్రశ్నించారు. కేసు వేసిన పిటిషనర్లు ఎందుకు వాయిదా అడిగారు? ఆ అవసరం ఏమొచ్చింది? వాయిదా వేయాలని అడగడంలో ఏమైనా దురుద్దేశం ఉందా అని బొత్స ప్రశ్నించారు. ప్రభుత్వం 3 రాజధానులకు కట్టుబడి ఉందని స్పష్టంచేశారు. ఈ నిర్ణయంపై ఎలాంటి అనుమానాలకు తావులేదన్నారు. విశాఖకు రాజధాని తరలింపు కచ్చితమన్నారు. విశాఖకు న్యాయస్థానం ఆదేశాలతోనే వెళ్తామని బొత్స వ్యాఖ్యానించారు.
ఏపీ నుంచి 3 నగరాలు
రాష్ట్రంలోని అన్ని పట్టణ ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వ వాటర్ ప్లస్ సర్టిఫికేట్ కు ఎంపిక అయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారని ఏపీ పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పట్టణాల్లో వ్యర్ధాల నిర్వహణపై స్వచ్ఛ భారత్ కింద కేంద్రం సర్వే చేసిందన్నారు. అందులో వాటర్ ప్లస్ సర్టిఫికెట్ కోసం 9 నగరాలను కేంద్రం గుర్తిస్తే ఏపీ నుంచి 3 నగరాలు ఎంపిక అయ్యాయన్నారు. తిరుపతి, విజయవాడ, విశాఖ వాటర్ ప్లస్ సర్టిఫికెట్ పొందాయని తెలిపారు.
మొత్తం 2.60 లక్షలు టిడ్కో ఇల్లు
ఇదే విధంగా మిగతా పట్టణాలు కూడా వాటర్ పబ్లి సర్టిఫికేట్ పొందేలా తీర్చిదిద్దాలని అధికారులను సీఎం ఆదేశించారని బొత్స తెలిపారు. మొత్తం 2.60 లక్షలు టిడ్కో ఇల్లు ఉన్నాయని, అన్ని త్వరగా లబ్దిదారులకు అందిస్తామన్నారు. టిడ్కో ఇళ్లపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై పసలేదన్నారు. టిడ్కో ఇళ్లను 6 నెలల్లో 80 వేలు చొప్పున అందిస్తామన్నారు. ఇంటి నిర్మాణానికి డబ్బు సరిపోవడం లేదని ఆరోపిస్తున్న ప్రతిపక్షాలు.. ఇంతకు ముందు ఎంత ఇచ్చారో గుర్తు చేసుకోవాలని చెప్పారు.
పథకాల వల్ల బీసీలకు న్యాయం
చేయూత, నేతన్న నేస్తం వంటి పథకాల వల్ల బీసీలకు న్యాయం జరుగుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వారి జీవన ప్రమాణాలు పెరిగేలా ప్రణాళిక బద్దంగా కృషి చేస్తున్నామన్నారు. రాజధాని కేసులను రోజు వారీ విచారణను పిటిషనర్ లు మూడు నెలలు వాయిదా అడగడం వెనుక ఏం ఉద్దేశ్యాలున్నాయని బొత్స ప్రశ్నించారు. కేసు వేసిన వాళ్లే ఎందుకు వాయిదా అడిగారని ప్రశ్నించారు.
Also Read: Hyderabad Fraud: యూపీఐ పిన్ నెంబరు ఇలా పెట్టుకుంటున్నారా? జాగ్రత్త.. మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అవుతుంది!