AP JAC Demand: ఏపీ ప్రభుత్వంపై ఉద్యోగుల ఆగ్రహం - పీఆర్‌సీ, ఐఆర్‌కై ఏపీ జేఏసీ ఉద్యమ శంఖారావం - సచివాలయంలో నిరసనలకు రెడీ
P JAC Employee Demands : ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై ఏపీ జేఏసీ భేటీ. 12వ పీఆర్‌సీ నియామకం, 30% ఐఆర్, డీఏ బకాయిల విడుదలపై ఉద్యమించాలని నిర్ణయించారు.

AP Employees Pending DA Arrears Release: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు , కార్మికుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం దిశగా ఏపీ జేఏసీ మరోసారి పోరుబాట పట్టింది. బకాయిలు పడిపోయిన ఆర్థిక లబ్ధులు, నిలిచిపోయిన డీఏలు మరియు నూతన వేతన సవరణ సంఘం నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని ఏపీ జేఏసీ డిమాండ్ చేసింది. విజయవాడలోని ఏపీ ఎన్జీవో హోమ్‌లో జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎ. విద్యాసాగర్ అధ్యక్షతన శనివారం నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు.
తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉద్యోగులు
ఈ సమావేశంలో జేఏసీ నేతలు సుమారు మూడేళ్లుగా ఉద్యోగ వర్గాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని, ప్రభుత్వ ప్రకటనలు తప్ప క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే 12వ వేతన సవరణ సంఘం చైర్మన్‌ను నియమించాలని, పీఆర్‌సీ నివేదిక వచ్చేలోపు ఉద్యోగుల ఊరట కోసం కనీసం 30 శాతం మధ్యంతర భృతి మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేయాలని స్పష్టం చేశారు. సీఎంతో పాటు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు తక్షణమే దీనిపై స్పందించి చొరవ చూపాలని జేఏసీ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.ఎస్. ప్రసాద్ కోరారు.
సచివాలయాల్లో నిరసనలకు రెడీ
సమావేశం అనంతరం ఏపీ జేఏసీ ముఖ్య నాయకులు విలేకరులతో మాట్లాడారు. తమ ప్రధాన ఆర్థిక డిమాండ్లను వివరించారు. 11వ పీఆర్‌సీకి సంబంధించిన వేతన వ్యత్యాస బకాయిలు, 2022 నుంచి నిలిచిపోయిన ఈఎల్ ఎన్‌క్యాష్‌మెంట్ బిల్లులను తక్షణమే ఖాతాల్లో జమ చేయాలన్నారు. దీంతోపాటు దాదాపు నాలుగైదు కరవు భత్యం వాయిదాలు పెండింగ్‌లో ఉన్నాయని, ద్రవ్యోల్బణం పెరిగినందున పాత డీఏ బకాయిలను విడుదల చేస్తూనే కొత్త డీఏలను వెంటనే ప్రకటించాలని పట్టుబట్టారు.
వచ్చే రోజుల్లో సచివాలయ ముట్టడి, కలెక్టరేట్ల వద్ద మహాధర్నాలు
సమస్యల తీవ్రతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఇప్పటికే తాము ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి అధికారిక కార్యాచరణ నోటీసు అందజేసినట్లు జేఏసీ స్పష్టం చేసింది. గత జూలై 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు ఇచ్చి తమ నిరసనను వ్యక్తం చేశామని గుర్తుచేశారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ రాకపోవడంతో నిరసనల వేడిని మరింత పెంచక తప్పడం లేదని హెచ్చరించారు. ప్రభుత్వం నుంచి తగిన స్పందన రాకపోతే వచ్చే రోజుల్లో సచివాలయ ముట్టడి, కలెక్టరేట్ల వద్ద మహాధర్నాలు, నిరవధిక సమ్మె దిశగా కార్యాచరణను ఉధృతం చేస్తామని ఏపీ జేఏసీ స్పష్టం చేసింది. లక్షలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాల సంక్షేమం దృష్ట్యా ముఖ్యమంత్రి నేరుగా సమీక్ష నిర్వహించి తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















