Gulab Cyclone Effect: తీరాన్ని తాకిన గులాబ్ తుపాను... తీరం దాటే సమయంలో 95 కి.మీ.వేగంతో గాలులు... సీఎం జగన్ కు ప్రధాని మోదీ ఫోన్...
గులాబ్ తుపాను తీరాన్ని తాకే ప్రక్రియ మొదలైందని వాతావరణశాఖ తెలిపింది. మూడు గంటల్లో తీరాన్ని తాకే ప్రక్రియ పూర్తవుతుందని వెల్లడించింది.
గులాబ్ తుపాను తీరాన్ని తాకే ప్రక్రియ ప్రారంభమైందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. మరో మూడు గంటల్లో తీరాన్ని తాకే ప్రక్రియ పూర్తవుతుందని వెల్లండించింది. శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నానికి 25 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైనట్లు ఐఎండీ తెలిపింది. ప్రస్తుతం తీర ప్రాంతాల్లో 75-85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని తెలిపింది. తుపాను తీరం దాటే సమయంలో 95 కి.మీ.వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
సీఎం జగన్ కు ప్రధాని ఫోన్
గులాబ్ తుపాను పరిస్థితులపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ఏపీకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీఇచ్చారు. అందరూ సురక్షితంగా ఉండాలని మోదీ ఆకాంక్షించారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ట్విటర్లో తెలిపారు. ఇప్పటికే సీఎం జగన్ తుపాను పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.
గులాబ్ తుఫాన్ పరిస్థితి గురించి @ysjagan గారితో మాట్లాడాను .కేంద్రం నుంచి సహాయాన్ని తక్షణం అందేటట్లు చూస్తామని హామీ ఇచ్చాను. అందరు క్షేమంగా వుండాలని ప్రార్ధిస్తున్నాను .
— Narendra Modi (@narendramodi) September 26, 2021
పునరావాస కేంద్రాలు ఏర్పాటు
శ్రీకాకుళం జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాల్లో గులాబ్ తుపాను ప్రభావం మొదలైంది. తుపాను ప్రభావంతో తీరప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తున్నాయి. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీకేస్ లాఠక్ ఆదేశించారు. ఇప్పటికే వజ్రపుకొత్తూరు మండలంలో 182 మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు కలెక్టర్ చెప్పారు. ఫిర్యాదులు, సాయం కోసం కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూమ్ నంబర్ 08942-240557, ఎస్పీ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ నంబర్ 6309990933ను సంప్రదించాలని సూచించారు.
#WATCH | Srikakulam in Andhra Pradesh witnessed strong winds and heavy rainfall due to Cyclone Gulab (Earlier visuals)
— ANI (@ANI) September 26, 2021
As per IMD, the landfall process has commenced in coastal regions of Andhra Pradesh and Odisha pic.twitter.com/RKSLzv5cGs
విజయనగరం జిల్లాపై ప్రభావం
విజయనగరం జిల్లాలో గులాబ్ తుఫాన్ ప్రభావంతో నేటి ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య 20.2 మీ.మీ సరాసరి వర్ష పాతం నమోదైంది. పార్వతీపురంలో అత్యధికంగా 33.4 మీ.మీ, పాచిపెంటలో అత్యల్పంగా 5 మీ.మీ.ల సరాసరి వర్షపాతం నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. ఆదివారం 4 గంటల నుంచి 5 గంటల మధ్య వేపాడలో 7 మీ.మీ, రామభద్రపురంలో 5.6 మీ.మీ., కొత్తవలసలో 5.2 మీ.మీ. వర్షం కురిసింది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో ప్రజలంతా ఇళ్ల విడిచి బయటకు రావొద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు తెలిపారు.
Also Watch: గులాబ్ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో అలర్ట్
అన్ని చర్యలు చేపట్టాం : మంత్రి సీదిరి అప్పలరాజు
గులాబ్ తుపాన్ పలాస, టెక్కలి నియోజకవర్గాల మధ్య తీరం దాటే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీదిరి అప్పలరాజు కోరారు. తుపాను ప్రభావంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందన్నారు. అధికారులు, విపత్తు నిర్వహణ బృందాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. తుపాను ప్రభావంతో 70-90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రావొద్దని కోరారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా గ్రామ సచివాలయ సిబ్బందికి సమాచారం అందించాలన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియజేస్తున్నామన్నారు.
Also Watch: పలాస, టెక్కలి మధ్య తీరం దాటనున్న గులాబ్ తుపాను.. ప్రజలను అప్రమత్తం చేసిన ఏపీ మంత్రి
విద్యుత్ అంతరాయలపై ఫిర్యాదులకు
తుపాను ప్రభావంతో కలిగే విద్యుత్తు అంతరాయాలపై టోల్ ఫ్రీ నంబర్ 1912కి ఫిర్యాదు చేయాలని ఏపీఈపీడీసీఎల్ ఛైర్మన్ కె. సంతోషరావు తెలిపారు. విద్యుత్తు పునరుద్ధరణ చర్యలు చేపట్టెందుకు సంస్థ డైరెక్టర్లు, ఆపరేషన్స్, ప్లానింగ్, కమర్షియల్, మెటీరియల్ పర్చేజ్ విభాగపు అధికారులతో సమావేశం ఏర్పాటుచేశామన్నారు. తుపాను ప్రభావానికి తెగిపడే విద్యుత్ వైర్లు, విద్యుత్ స్తంభాలు, నియంత్రికలను సరిచేసేందుకు యంత్రాంగాన్ని, పరికరాలను, సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
Also Read: ఉత్తరాంధ్ర వైపు దూసుకొస్తున్న గులాబ్ తుపాను.. సముద్రంలో అలజడి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి