AP Weather: ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
AP Latest News: ప్రజలు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని.. ఎండదెబ్బ తగలకుండా టోపీ లేదా గొడుగు వాడాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. కాటన్ దుస్తులు ఉపయోగించాలని చెప్పింది.
Heat Waves in AP: ఏపీకి విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. రేపు 56 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 174 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. ఎల్లుండి (ఏప్రిల్ 27) 64 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 170 వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు.
రేపు తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు (56)
శ్రీకాకుళం 13, విజయనగరం 23, పార్వతీపురంమన్యం 13, అల్లూరి సీతారామరాజు 2 అనకాపల్లి 3, తూర్పుగోదావరి 1, కాకినాడ ఒక మండలంలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.
రేపు వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు (174)
శ్రీకాకుళం12 , విజయనగరం 4, పార్వతీపురంమన్యం 2, అల్లూరిసీతారామరాజు 10, విశాఖపట్నం 3, అనకాపల్లి 12, కాకినాడ 17, కోనసీమ 9, తూర్పుగోదావరి 18, పశ్చిమగోదావరి 4, ఏలూరు 14, కృష్ణా 11, ఎన్టీఆర్ 6, గుంటూరు 14, పల్నాడు 18, బాపట్ల 2, ప్రకాశం 8, తిరుపతి 4, నెల్లూరు1, సత్యసాయి 5, మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.
వడగాల్పులు వీచే మండలాల పూర్తి వివరాలు ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు
గురువారం (ఏప్రిల్ 25) నంద్యాల జిల్లా నందవరంలో 45.6°C, విజయనగరం జిల్లా రాజాంలో 45.5°C, అల్లూరి జిల్లా కొండైగూడెంలో 45.1°C, వైయస్సార్ జిల్లా ఖాజీపేటలో 44.7°C, కర్నూలు జిల్లా కోడుమూరులో 44.2°C, అనకాపల్లి జిల్లా దేవరపల్లె 44.1°C, తూర్పుగోదావరి జిల్లా నందరాడ, పల్నాడు జిల్లా రావిపాడు, శ్రీకాకుళం జిల్లా కొల్లివలసలో 44°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. 16 జిల్లాల్లో 43°C కు పైగా ఉష్ణోగ్రతలు నమోదైందన్నారు. అలాగే 72 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 102 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు.
ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలి. ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలి. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. గుండె జబ్బులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని విపత్తుల సంస్థ ఎండీ కూర్మనాథ్ సూచించారు.