Pawan Kalyan: 'రఘురామ గారు మీ నుంచి మేం చాలా నేర్చుకోవాలి' - ఏపీ అసెంబ్లీలో నవ్వులు పూయించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Andhrapradesh News: ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నవ్వులు పూయించారు. గత ప్రభుత్వం ప్రతిపక్ష నేతలను చాలా ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపిస్తూ.. ఎమ్మెల్యే రఘురామ గురించి ప్రస్తావించారు.
Pawan Kalyan Comments In AP Assembly: ఏపీ అసెంబ్లీలో (Ap Assembly Sessions) మంగళవారం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం ప్రతిపక్ష నేతలను చాలా ఇబ్బందులు పెట్టిందని.. సీఎంగా చేసిన చంద్రబాబునే తప్పుడు కేసులు పెట్టి 53 రోజులు జైలులో పెట్టారని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘురామ గురించి ప్రస్తావిస్తూ పవన్ సభలో నవ్వులు పూయించారు. 'సీనియర్ నేత రఘురామ కృష్ణంరాజును సైతం చాలా ఇబ్బంది పెట్టారు. అయినా ఆయన అవేవీ పట్టించుకోలేదు. సోమవారం సభకు జగన్ వచ్చినప్పుడు చాలా పెద్ద మనసుతో ఆయన దగ్గరకి వెళ్లి ఆప్యాయంగా నవ్వుతూ పలకరించారు. దాడి చేసినా, హాని తలపెట్టినా పట్టించుకోని మీ పెద్ద మనసుకు ధన్యవాదాలు. మీ నుంచి మేము చాలా నేర్చుకోవాలి. సభా ముఖంగా మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు.' అని పవన్ అనగా సభలో నవ్వులు పూశాయి.
'నేను తప్పు చేసినా చర్యలు తీసుకోండి'
రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు వంటి సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడి ఆధ్వర్యంలో పని చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఎవరూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దని.. అవినీతికి ఆస్కారం లేకుండా పని చేయాలని అన్నారు. తప్పు చేస్తే జనసేన వారిపైనా చర్యలుంటాయని చెప్పారు. తాను తప్పు చేసినా చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు, ఏపీ పునఃనిర్మాణం కోసం జనసేన సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు. ఎందరో మహానుభావుల స్ఫూర్తితో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని చెప్పారు. 'గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యింది. రాజధాని అమరావతి, జీవనాడి పోలవరం ఆగిపోయాయి. శాంతి భద్రతలు క్షీణించాయి. సహజ వనరుల దోపిడీ జరిగింది. పెట్టుబడులు రాకుండా చేశారు. కేంద్ర బడ్జెట్‌లో అమరావతి నిర్మాణానికి రూ.15 వేల కోట్లు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం' అని పవన్ పేర్కొన్నారు.
పవన్ ఫస్ట్ ఆన్సర్
కాగా, ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను మండలి సభ్యులు తొలి ప్రశ్న అడిగారు. దీనిపై స్పందించిన పవన్.. వైసీపీ హయాంలో ఆర్థిక సంఘం నిధుల మళ్లింపు జరిగిన మాట వాస్తవమేనని అన్నారు. కేంద్రం పంచాయతీలకు నిధులిస్తున్నా గత ప్రభుత్వం మాత్రం పంచాయతీలకు నిధుల బదలాయింపులో జాప్యం చేసిందని చెప్పారు. దీని వల్ల కేంద్రానికి రూ.11 కోట్లు పెనాల్టీ చెల్లించాల్సి వచ్చిందని అన్నారు. భారీ ఎత్తునే నిధుల మళ్లింపు జరిగినట్లు వెల్లడించారు. గ్రామ సచివాలయాల్లో సర్పంచులకు స్థానం ఉండేలా చర్యలు తీసుకుంటామని పవన్ పేర్కొన్నారు.
2 బిల్లులకు ఆమోదం
ఏపీ అసెంబ్లీలో (AP Assembly) మంగళవారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ - 2022 (భూ యాజమాన్య హక్కు చట్టం), ఆరోగ్య వర్శిటీ పేరు మార్పు బిల్లులకు ప్రభుత్వం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. విజయవాడలోని (Vijayawada) ఆరోగ్య వర్శిటీకి ఎన్టీఆర్ పేరు పునరుర్ధరించారు. ఈ మేరకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Ayyannapatrudu) సభలో కీలక ప్రకటన చేశారు. అయితే, ఒక్క ఆంగ్ల పదం కూడా వాడకుండా బిల్లులు ఆమోదం పొందినట్లు స్పీకర్ సభలో ప్రకటన చేశారు.