Somu Veerraju: మార్గదర్శి సంస్థ కేసులో ఏపీ ప్రభుత్వం తీరును తప్పుపట్టిన ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు
మార్గదర్శి సంస్థపై ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (AP BJP Chief Somu Veerraju) అన్నారు.
మార్గదర్శి సంస్థపై ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (AP BJP Chief Somu Veerraju) అన్నారు. ప్రభుత్వం చట్ట ప్రకారం వ్యవహరించాల్సి ఉన్నా, నిబంధనలు పట్టించుకోవటం లేదన్నారు.
మార్గదర్శి వ్యవహరంపై బీజేపి రియాక్షన్ ఇదీ..
ఏ సంస్థపై అయినా ప్రభుత్వం చట్టపరిధిలో వ్యవహరించాల్సిన అవసరం ఉందని బీజేపీ నేత సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. అయితే అందుకు విరుద్దమైన వాతావరణం సృష్టించి సంస్థలను భయబ్రాంతులకు గురి చేయడం ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరించడమేనని బీజేపీ భావిస్తోందని వీర్రాజు తెలిపారు. ఇందులో భాగంగానే మార్గదర్శి సంస్థ పై రాష్ట్ర ప్రభుత్వం కక్షసాధించే విధంగా వ్యవహరిస్తోందని సోమువీర్రాజు పేర్కొన్నారు. ఈమేరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుండి ప్రకటన విడుదల చేశారు.
మన్ కీబాత్ 100వ ఎపిసోడ్ పై కసరత్తు..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం వందో ఎపిసోడ్ నిర్వహణ పై పార్టీ పరంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులను ఏ విధంగా సమాయత్తం చేయాలన్న అంశం పై పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రత్యేక వర్క్ షాప్ నిర్వహించారు. సోమువీర్రాజు మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి నిర్వహించే మన్ కీ బాత్ ద్వారా అనేక విషయాలు దేశవ్యాప్తంగా ప్రచారం పొందుతున్న విషయం గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని అనేక అంశాలు ప్రధాని మోదీ నోటి వెంట మనం విన్నప్పుడు మనకు కలిగే ఆనందం మరువలేనిదన్నారు. పోలింగ్ బూత్ కమిటీలు బలోపేతం చేసుకోవడానికి మన్ కీ బాత్ ఒక ఆయుధంగా చేసుకోవాలని సోము వీర్రాజు సూచించారు.
ఈ వర్క్ షాప్ నకు ప్రతి జిల్లా నుండి జిల్లా ప్రధాన కార్యదర్శి హోదా ఉన్నవారితో పాటు వివిధ మోర్చాలకు చెందిన ఇంఛార్జీలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి జాతీయ పార్టీ నుండి జాతీయ కార్యదర్శి డాక్టర్ ఆశాలక్రా ముఖ్యఅతిథిగా హాజరై వర్క్ షాప్ ను నిర్వాహణ ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. ఝార్కండ్ రాష్ట్రంలోని రాంచీలో మన్ కీ బాత్ నిర్వహించిన తీరును తెలియచేశారు. పార్టీ శ్రేణులతో పాటు స్వయం సహాయక గ్రూప్ లను, రైతు సంఘాలను డ్వాక్రా సంఘాలను మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని వివరించారు. కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు ముందుగా మౌలిక వసతులు కల్పించుకోవాలన్నారు అదేవిధంగా 100వ ఎపిసోడ్ పై స్ధానికంగా కొంత ప్రచారం చేయడం ద్వారా ఎక్కువ సంఖ్యలో క్షేత్ర స్ధాయిలో మన్ కీబాత్ కార్యక్రమం ఎక్కువ కేంద్రాల్లో నిర్వహించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలనుండి వచ్చిన ఇంచార్జీలు జిల్లాల్లో కూడా వర్క్ షాప్ లు నిర్వహించడం ద్వారా గ్రామాలలో ఎక్కువ సంఖ్యలొ కూడా మన్ కీ బాత్ కార్యక్రమం నిర్వహించడానికి వీలుకలుగుతుందన్నారు. ప్రధాని మంత్రి మోదీ అనేక విషయాలను ఈ కార్యక్రమం ద్వారా వెల్లడిస్తున్నారని ఇప్పటివరకు 99 ఎపిసోడ్ లు పూర్తయిన క్రమంలో 100వ ఎపిసోడ్ ప్రభావంతంగా ఎక్కువ కేంద్రాల్లో నిర్వహించాలన్నారు.
కృష్ణవర్మ మృతిపట్ల బీజేపి సంతాపం..
జాతీయవాద పాత్రికేయులు, బీజేపీ మీడియా విభాగంలో అనేక సంవత్సరాలు సేవలందించిన కృష్ణవర్మ అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కృష్ణవర్మ మృతి పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సంతాపం తెలిపారు. కృష్ణ వర్మకుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీనియర్ పాత్రికేయులు, దండు కృష్ణవర్మ విజయవాడలో తుదిశ్వాస విడిచారు. 1950 మే 20న జన్మించిన కృష్ణవర్మ పాత్రికేయ రంగం మీద ఉన్న మక్కువతో, ఇండియా టుడే తెలుగు మేగజైన్ ప్రారంభ రోజులలో కొన్నేళ్ళ పాటు మద్రాసులో సహ సంపాదకుడిగా పనిచేశారు. ఆ తర్వాత హైదరాబాద్ కేంద్రంగా పలు దిన పత్రికలలో జర్నలిస్ట్ గా సేవలు అందించారు. ఆపైన వివిధ దిన, వార, మాస పత్రికలకు ఫ్రీలాన్సర్ గా చేశారు. కృష్ణవర్మ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా విభాగంలో ఏళ్లపాటు సేవలందించారు.