CM Jagan slams Chandrababu: 'చంద్రబాబు ఏది ముట్టుకున్నా స్కాములే' - నాలుగేళ్లలో రూ.33,209 కోట్లు రైతులకు అందించామన్న సీఎం జగన్
CM Jagan: చంద్రబాబు హయాంలో రైతులకు మంచి చేసే ఎలాంటి ఆలోచన చేయలేదని సీఎం జగన్ విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడి సాయం అందిస్తూ అన్నదాతలకు అండగా నిలబడ్డామన్నారు.
Andhrapradesh News: టీడీపీ అధినేత చంద్రబాబు ఏది ముట్టుకున్నా స్కాంలేనని సీఎం జగన్ విమర్శించారు. ఆయన హయాంలో స్కీంల గురించి కాకుండా స్కాంల గురించే ఆలోచించారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో ఎప్పుడూ కరువేనని, రైతు రుణ మాఫీ మాట తప్పారని విమర్శించారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు రైతులకు చేసిందేమీ లేదని, వారికి పెట్టుబడి సాయం అందించాలన్న ఆలోచనే చేయలేదని మండిపడ్డారు. పుట్టపర్తి సభలో వైఎస్సార్ రైతు భరోసా నిధుల విడుదల సందర్భంగా ఆయన మాట్లాడారు. 'వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్బీకేల ద్వారా రూ.60 వేల కోట్ల ధాన్యం కొనుగోలు చేశాం. పంట సీజన్ లో నష్టం జరిగితే అదే సీజన్ లో ఇన్ పుట్ సబ్సిడీ అందిస్తున్నాం. సున్నావడ్డీ రుణాలు, పంటల బీమాతో అన్నదాతకు భరోసా కల్పిస్తున్నాం.' అని చెప్పారు. అనంతరం బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. 53.53 లక్షల మంది అన్నదాతల ఖాతాల్లోకి ఒక్కొక్కరికి రూ.4 వేల చొప్పున రూ.2,204 కోట్ల సాయాన్ని అందించారు. నాలుగేళ్లలో ఇప్పటివరకూ రూ.33,209 కోట్ల సాయాన్ని రైతులకు అందించినట్లు సీఎం వివరించారు.
'చంద్రబాబు హయాంలో స్కాములే'
చంద్రబాబు హయాంలో స్కాంలు తప్ప స్కీములు గుర్తుకు రావని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. 'చంద్రబాబు ఏది ముట్టుకున్నా స్కాములే. స్కిల్ స్కాం, ఫైబర్ గ్రిడ్ స్కాం, మద్యం, ఇసుక దందా ఇలా అన్నింటిలోనూ దోచుకున్నారు. ఆయనకు దోచుకోవడం, దాచుకోవడమే తెలుసు. టీడీపీ హయాంలో పేదలు, వృద్ధులు, రైతులు, విద్యార్థుల గురించి ఆలోచించలేదు.' అని విమర్శించారు.
'సైనికులు మీరే'
తనకు ప్రజలే సైనికులని, మీకు మంచి జరిగితే అండగా నిలబడాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. నాలుగేళ్ల పాలనలో మీకు మంచి జరిగిందో లేదో ఆలోచించాలన్నారు. అన్నదాతలకు అండగా నిలబడేందుకు రూ.1.73 లక్షల కోట్లు ఖర్చు చేశామని వివరించారు. రూ.2.42 లక్షల కోట్లు అక్క చెల్లెమ్మలకు అందించామని పేర్కొన్నారు. ఇంటి వద్దకే సంక్షేమం అందేలా వాలంటీర్, సచివాలయ వ్యవస్థలను తీసుకొచ్చామని చెప్పారు. ఇంటి వద్దకే వైద్య సేవలందేలా ఫ్యామిలీ డాక్టర్, జగనన్న సురక్ష, విలేజ్ క్లినిక్ వంటి కార్యక్రమాలు తెచ్చామని, ఏ పేదవాడు వైద్యానికి అప్పులు చేయకూడదనేదే తమ ఉద్దేశమని వెల్లడించారు. అక్క చెల్లెమ్మల కోసం ఆసరా, అమ్మ ఒడి, చేయూత, సున్నావడ్డీ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. గతంలో సున్నా వడ్డీ పథకం నీరు గార్చే ప్రయత్నం జరిగిందన్నారు.
గతంలో ఎప్పుడూ కరువు పరిస్థితులు ఉండేవని, దేవుడి దయతో గత నాలుగేళ్లలో కరువు మాటే లేదని సీఎం జగన్ చెప్పారు. గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి తేడా గమనించాలని సూచించారు. వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా కరెంట్, ఈ క్రాప్ ద్వారా అన్నదాతలకు మేలు జరిగేలా చూస్తున్నామన్నారు. పీఎం కిసాన్ నిధులు కూాడా ఈ నెలలోనే వస్తాయని, డబ్బు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరామని చెప్పారు. అబద్ధాలు చెప్పే వారిని నమ్మొద్దని, అభివృద్ధిని చూసి అండగా నిలబడాలని పిలుపునిచ్చారు.