AP Telangana Weather Updates: ఏపీ, తెలంగాణకు వర్ష సూచన - ఆ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: IMD అలర్ట్
AP Telangana Weather News: మే 13న ఏపీ, తెలంగాణలో ఎన్నికలు జరగనుండగా, పలు చోట్ల వర్షం కారణంగా అవాంతరం ఏర్పడనుంది. ఓటర్లు జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు.
Rains In Andhra Pradesh and Telangana: అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో నేడు (మే 13న) భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తాయి. వాతావరణ మార్పుల కారణంగా సోమవారం కొన్ని చోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్లే ఓటర్లు స్థానిక వాతావరణానికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
మే 13న శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వీటితో పాటు పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.
ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో 31.2 మిమీ, కోనసీమ జిల్లా ఆలమూరులో 30.2 మిమీ, తాటపూడిలో 28.7 మిమీ, తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో 26 మిమీ, అనకాపల్లి జిల్లా పరవాడలో 21.2 మిమీ, మన్యం జిల్లా పాచిపెంటలో 22 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. దాదాపు 50 ప్రాంతాల్లో పిడుగులతో కూడిన జల్లులు పడినట్లు వెల్లడించారు.
మే 14న (మంగళవారం నాడు) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలిపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... పొలాల్లో రైతులు, వ్యవసాయ కూలీలు, పశువులు, గొర్రెల కాపరులు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని హెచ్చరించారు.
సోమవారం 18 మండలాల్లో వడగాల్పులు, మిగిలినచోట్ల ఎండ తీవ్రతగా ఉండే అవకాశం ఉందని కూర్మనాథ్ తెలిపారు. విజయనగరం 8, పార్వతీపురంమన్యం 8, ఏలూరు భీమడోలు, కృష్ణా ఉయ్యూరులో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. నిన్న గరిష్టంగా నంద్యాల జిల్లా గాజులపల్లెలో 41.9°C, అల్లూరి జిల్లా యెర్రంపేటలో 41.4°C, ప్రకాశం జిల్లా బొట్లగూడూరులో 41.3°C, కర్నూలు జిల్లా కామవరం, నెల్లూరు జిల్లా వేపినాపి అక్కమాంబాపురంలో 41.2°C, అనంతపురం జిల్లా కోమటికుంట్లలో 41°C అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తెలంగాణలో వాతావరణం ఇలా..
తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో రెండు నుంచి మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ప్రధానంగా దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రంలో గాలులు వీస్తున్నాయి. పోలింగ్ కేంద్రాలపై వర్షాలు ప్రభావం చూపనున్నాయి. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి.
సోమవారం వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ, భద్రాది కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులాతో కూడిన వర్షాలు, కొన్ని చోట్ల చిరుజల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్ జీహెచ్ఎంసీ ప్రాంతాల్లో సైతం వర్షాలు కురవనున్నాయి. వర్షం ప్రభావంతో ఇటీవల దిగొచ్చిన పగటి ఉష్ణోగ్రతలు కొన్ని ప్రాంతాల్లో పెరగనున్నాయి. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని ఐఎండీ పేర్కొంది.
వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని సూచించారు. ఎండదెబ్బ తగలకుండా టోపీ,గొడుగు,టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలి. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. గుండె జబ్బులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు.